యమస్పీడ్‌గా మెట్రో | Metro works Speed ​up | Sakshi
Sakshi News home page

యమస్పీడ్‌గా మెట్రో

Published Fri, Nov 8 2013 4:45 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

Metro works Speed ​up

 

= 2015 ఉగాదికి పట్టాలపైకి రైలు
 = ఇప్పటి వరకు రూ. 4,000 కోట్లు ఖర్చు
 = రికార్డు స్థాయిలో 1000వ పునాది పూర్తి
 = ఒప్పందం ప్రకారమే భూ కే టాయింపులు
 = అలైన్‌మెంట్ మార్చే ప్రసక్తే లేదు
 = మెట్రోరైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి,  ఎల్ అండ్ టీ సీఈవో వి.బి.గాడ్గిల్ వెల్లడి

 
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మెట్రోరైలు పనులు శరవేగంగా సాగుతున్నాయని నిర్మాణ, నిర్వహణ సంస్థలు స్పష్టం చేశాయి. ముందుగా చెప్పినట్టే 2014 డిసెంబర్ నాటికి నాగోల్- మెట్టుగూడ తొలిదశ పనులు పూర్తిచేసి 2015 ఉగాది (మార్చి 21)న తొలిరైలు నడుపుతామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మెట్రో పనుల పురోగతిని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రోరైలు సీఈఓ, ఎండీ వి.బి.గాడ్గిల్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు.

ఎక్కడా రాజీ పడకుండా, ముందస్తు ప్రణాళిక ప్రకారమే మెట్రో పనులు సాగుతున్నాయన్నారు. ఇప్పటివరకు మెట్రోరైలు పనుల కోసం ఎల్‌అండ్‌టీ సంస్థ రూ. 3,100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 900 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. నిర్మాణ పనులు పూర్తయిన తరువాతే కేంద్ర ప్రభుత్వం ఒప్పందం ప్రకారం వీజీఎఫ్ కింద అందజేస్తుందని చెప్పారు. మెట్రో రైలు కోసం రూ. 16,375 కోట్లు ఫైనాన్షియల్ క్లోజర్‌ను ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మెట్రో పిల్లర్లకు పునాదులు మొదలుకొని వాటి నిర్మాణం, స్పాన్ ఏర్పాటుతో పాటు ఉప్పల్, మియాపూర్‌లలో డిపోల పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతున్నట్లు వారు తెలిపారు.

మూడు కేరిడార్‌లలో నిర్మించతలబెట్టిన 2,434 పిల్లర్స్(స్థంభాలు)లో భాగంగా రెండు రోజుల క్రితమే 1000వ పిల్లర్‌కు పునాది పడిందని, ఇది అంతర్జాతీయ రికార్డుగా వారు పేర్కొన్నారు. వీటిలో 26 కిలోమీటర్ల మేర అంటే 850 పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. 11 కిలోమీటర్ల వరకు సెగ్మెంట్ల అనుసంధానం పూర్తయిందని చెప్పారు. 72 కిలోమీటర్ల మెట్రోలైన్‌లో 28వేల సెగ్మెంట్లు అవసరమవుతాయని, వీటి నిర్మాణం కోసం ఉప్పల్, కుత్బుల్లాపూర్‌లలో ప్రత్యేక యార్డులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

నగరంలోని ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని పిల్లర్ల ఏర్పాటు, సెగ్మెంట్లు అమర్చడం, స్పాన్ తయారుచేయడం అనే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉప్పల్‌లో డిపో నిర్మాణం పనులు 83 శాతం పూర్తికాగా, మియాపూర్ డిపోలో 63 శాతం పనులు పూర్తయినట్లు వివరించారు. నిర్దేశిత  మొదటిదశ సివిల్ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయని, నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు స్టేషన్ల ఏర్పాటు, రైల్వేట్రాక్ ఏర్పాటు, ఇతర సాంకేతిక పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు.

రైలు కోచ్‌లు, సిగ్నలింగ్, రైలు నియంత్రణ వ్యవస్థ, సీబీటీసీ టెక్నాలజీ, ఎఎఫ్‌సీ వ్యవస్థల కోసం అంతర్జాతీయంగా మేటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. పారదర్శకంగా, ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఎల్ అండ్ టీ, హెచ్‌ఎంఆర్, రాష్ట్ర ప్రభుత్వం మెట్రో పనులను సాగిస్తున్నట్లు తెలిపారు. మెట్రో అలైన్‌మెంట్ మార్పులు, ఇతరత్రా వస్తున్న ఆరోపణలను వారు కొట్టేశారు.
 
ఒప్పందం ప్రకారమే ఎల్ అండ్ టీకి భూ కేటాయింపులు: ఎన్‌వీఎస్ రెడ్డి

నిర్మాణ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే భూ కేటాయింపులు జరిగాయని మెట్రోరైలు ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు ఐదేళ్లుగా మెట్రోరైలు పనులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వారి ఆరోపణలేవీ ఇప్పటి వరకు నిరూపితం కాలేదని అన్నారు. అయినా నిర్మాణ సంస్థకు కేటాయించిన భూములు పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసి, నిర్ణీత గడువు పూర్తయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించడం జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

269 ఎకరాల భూమి ఎల్ అండ్ టీ సంస్థకు ఇవ్వాల్సి ఉండగా, డిపోల కోసం 212 ఎకరాలు కేటాయించారని, మిగతా 57 ఎకరాలు పార్కింగ్, సర్క్యులేషన్ కోసం ఇవ్వాలన్నారు. ఈ 57 ఎకరాల్లో ఇప్పటి వర కు 34.5 ఎకరాలే ఎల్ అండ్ టీకి ఇవ్వగా, మరో 22 ఎకరాలు కేటాయించలేదన్నారు. ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్థలాలు ఇవ్వాల్సి ఉందని, కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల సాధ్యం కాలేదని చెప్పారు. హైదరాబాద్‌కు మెట్రోరైలు తలమానికం లాంటిదన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశ, విదేశాల్లో నిర్మాణాలు జరిపే సంస్థ ఎల్ అండ్ టీ అని, రాజకీయ జోక్యానికి తలవంచదని ఎల్ అండ్ టీ మెట్రోరైలు సీఈవో గాడ్గిల్ స్పష్టం చేశారు. అలైన్‌మెంట్ మార్పులు, ఒత్తిళ్లకు తలొగ్గడం వంటివేవీ ఉండవని ఆయన వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement