
సాక్షి, హైదరాబాద్: కాటెనరీ ఓహెచ్‌ఈ పార్టింగ్ కారణంగా శనివారం మూసాపేట్–మియాపూర్ మధ్య మెట్రో సేవలకు అంతరాయం కలిగినట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఉదయం 9.57 నుంచి 11.40 గంటల వరకు మెట్రో రైళ్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నా రు. ఉదయం 11.40కి సింగిల్ లైన్ పనిచేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు, సర్వీసులను మూసాపేట్ నుంచి మియాపూర్ మార్గంలో డీగ్రేడెడ్ పద్ధతిలో పునరుద్ధరించారు.
సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు కాటెనరీ మెయింటెనెన్స్ వెహికల్ (సీఎంవీ)తో పాటు, మెయింటెనెన్స్ బృందం సత్వరమే స్పందించి చర్యలు చేపట్టింది. దీంతో మధ్యాహ్నం 1.20కి మెట్రో రైలు సర్వీసులను యధావిధిగా పునరుద్ధరించారు. మెట్రో రైళ్ల రాకపోకల అంతరాయం వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సాంకేతికంగా తలెత్తిన సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు.