మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద కార్లను ప్రారంభిస్తున్న ఎన్వీఎస్ రెడ్డి
మియాపూర్: సిటీ రూపురేఖలను సమూలంగా మార్చేసిన మెట్రో రైల్.. మరో ముందడుగు వేసింది. ఆయా స్టేషన్లలో దిగిన ప్రయాణికులు చివరి గమ్యస్థానం చేరేందుకు ఎలక్ట్రికల్ కార్లను ప్రవేశపెట్టింది. వీటిని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే సౌకర్యం సైతం కల్పించింది. మహేంద్ర తయారు చేసిన ‘ఈ2ఓ ప్లస్’ ఎలక్ట్రిక్ కారును శుక్రవారం మియాపూర్ మెట్రో స్టేషన్‌లో హైదరా బాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మెట్రో ప్రయాణికులకు సెల్ఫ్ డ్రైవ్ సౌకర్యంతో పాటు.. గ్రేటర్‌లో వాయు కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు ఈ ఎలక్ట్రిక్ కార్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. గ్రేటర్ సిటీజన్లుడీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రికల్ కార్లను వినియోగించాలని సూచించారు. భవిష్యత్‌లో నగరంలో మూడు కారిడార్లలోని 65 మెట్రో స్టేషన్ల వద్ద దశలవారీగా ఎలక్ట్రికల్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మెట్రో జర్నీ చేసే పప్రయాణికులు తక్కువ ఖర్చుతో గమ్యస్థానానికి చేరుకోవచ్చన్నారు. ప్రస్తుతం మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద 25 ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి తెచ్చామన్నారు.
అందుబాటులోకి ‘బయో టాయిలెట్స్’..
మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద నేచర్ సని ఆర్గనైజేషన్ సంస్థ ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లను హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ మరుగుదొడ్లలో నీరు అవసరం లేకుండానే పరిశుభ్రంగా ఉంటాయన్నారు. వీటి ఏర్పాటులో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానంతో మూత్రాన్ని శుద్ధిచేసి.. ఆనీటిని మొక్కల పెంపకానికి వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, అనిల్‌కుమార్ షైనీ, జూమ్ కార్ సీఈఓ సురేందర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ కార్లు వినియోగించండిలా..
ఎలక్ట్రికల్ కారును వినియోగించాలనుకునే ప్రయాణికులు మొదటగా ‘జూమ్ యాప్’లో అందులో డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతా వివరాలను ఆప్‌లోడ్ చేయాలి. అనంతరం యాప్ ద్వారా కారు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మెట్రో స్టేషన్ల సమీపంలో ఉండే ఈ కారు వద్దకు వెళ్లి కారు డోరుకు ఉన్న బటన్ ప్రెస్ చేస్తే డోర్ తెరుచుకుంటుంది. కారులో ఉన్న తాళం చెవితో స్టార్ట్ చేసుకొని డ్రైవ్ చేసుకుంటూ గమ్యస్థానానికి వెళ్లవచ్చు. గమ్యానికి చేరుకున్న తరువాత కారు కీని అందులోనే ఉంచి మరల డోర్‌కు ఉన్న బటన్ ప్రెస్ చేస్తే కారు లాక్ అయిపోతుంది.
ఎలక్ట్రిక్ కార్ల అద్దె ఇలా..
ఈ కారుకు అటోమెటిక్ గేర్, సెల్ఫ్ డ్రైవింగ్ సౌకర్యం ఉంటుంది. గంటకు రూ.40 చొప్పున అద్దెగా నిర్ణయించారు. లేదా నెలకు రూ.10 వేలు చెల్లించి కారును వినియోగించుకోవచ్చు. ఇలా కాకుండా ప్రతీ కిలోమీటరుకు అద్దె చెల్లిస్తూ వాడినట్లయితే ప్రతి కి.మీ.కి రూ.8.50 చార్జీ చెల్లించాలి. నెల వారీగా అద్దెకు తీసుకునే వారు ఇంట్లో కూడా చార్జింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. 8 గంటలు చార్జింగ్ చేస్తే 120 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ‘స్పీడ్ చార్జర్’తో 90 నిమిషాల్లో 90 శాతం చార్జింగ్ పూర్తవడం ఈ కారు ప్రత్యేకత. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, గచ్చిబౌలి, మాదాపూర్, జీవీకే మాల్, పరేడ్ గ్రౌండ్, కొత్తపేట్, మియాపూర్ ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ కారు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జూమ్‌కార్స్ నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment