ఇది మెట్రో ఇయర్‌ | 2017 is metro year : nvs reddy | Sakshi
Sakshi News home page

ఇది మెట్రో ఇయర్‌

Published Sat, Dec 30 2017 8:54 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

2017 is metro year : nvs reddy  - Sakshi

హైదరాబాద్‌ చరిత్రలో 2017 సంవత్సరం మర్చిపోలేనిది. ప్రజల కలల మెట్రో రైలు పట్టాలెక్కిన వేళ...ఇది ‘మెట్రో ఇయర్‌’ అని చెప్పొచ్చు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి అమీర్‌పేట–ఎల్‌బీనగర్‌ (17 కిలోమీటర్లు), అమీర్‌పేట– హైటెక్‌ సిటీ (8.5 కిలోమీటర్లు) మార్గంలోనూ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం. నెల రోజుల్లో 32.25 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణించారు. మార్చి నుంచి రైళ్ల ఫ్రీక్వెన్సీ, బోగీల సంఖ్యను పెంచుతాం. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే..వాటిని అధిగమించి రానున్న రోజుల్లో నగరవాసులకు అద్భుతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించేందుకు గట్టిగా కృషి చేస్తాం.
– ఎన్వీఎస్‌ రెడ్డి, మెట్రో రైల్‌ ఎండీ

సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగర్‌ : వచ్చే ఏడాది జూన్‌ నాటికి అమీర్‌పేట–ఎల్‌బీనగర్‌ (17 కిలోమీటర్లు), అమీర్‌పేట– హైటెక్‌ సిటీ (8.5 కిలోమీటర్లు) రూట్లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. పాతనగరంలోనూ ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో పూర్తికి ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. గ్రేటర్‌ వాసుల కలల మెట్రో ప్రారంభమై శుక్రవారానికి నెలరోజులు పూర్తయిన సందర్భంగా రసూల్‌పురాలోని మెట్రోరైల్‌ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చేపట్టిన ప్రతిష్టాత్మక మెట్రో ప్రాజెక్టు అమలు సాధ్యం కాదంటూ ప్రారంభంలో చాలామంది కొట్టిపడేశారని, అలాంటి ప్రాజెక్టును సుసాధ్యం చేసినట్లు తెలిపారు. ఆర్థిక వనరుల లేమి కారణంగా పీపీపీ కింద ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో చాలామంది మెట్రోరైల్‌ ప్రాజెక్టుపై పుకార్లు సృష్టించారని, వాటన్నింటినీ తాము ఏమాత్రం పట్టించుకోకుండా మెట్రోరైల్‌ ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేశామన్నారు. హైదరాబాద్‌ చరిత్రలో 2017 సంవత్సరం మెట్రో ఏడాదిగా నిలిచిపోనుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిలో మెట్రోరైల్‌ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. హైటెక్‌సిటీ–రాయదుర్గం(1.5 కి.మీ)మార్గంలో మెట్రో పిల్లర్ల ఏర్పాటుకు అలైన్‌మెంట్‌ ఖరారు చేశామని..త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

30 రోజుల్లో 32.25 లక్షల మంది ప్రయాణికులు
గడిచిన 30 రోజుల్లో 32.25 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణించారని ఎండీ తెలిపారు. సరాసరిన రోజుకు లక్ష మంది ప్రయాణికులు మెట్రోరైల్‌ ప్రయాణం చేశారన్నారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ మెట్రోలు ప్రారంభమైన తొలినాళ్లలో ఇంత భారీ స్థాయిలో రద్దీలేదని ఆయన స్పష్టం చేశారు. మెట్రోరైళ్లు రాకపోకలు సాగిస్తోన్న నాగోలు–అమీర్‌పేట–మియాపూర్‌ మార్గంలోని 24 స్టేషన్లలో ఒక్క ప్రకాష్‌నగర్‌ స్టేషన్‌ మినహా మిగతా 23 స్టేషన్లలో పార్కింగ్‌ వసతి కల్పించామన్నారు. ఇందులో 11 చోట్ల ఎక్స్‌క్లూజివ్‌ పార్కింగ్‌ స్టేషన్లు (అర ఎకరా స్థలం కంటే ఎక్కువ) ఉన్నా వాటిల్లో సగం కూడా నిండని పరిస్థితి ఉందన్నారు. త్వరలో కంప్యూటరైజ్డ్‌ స్మార్ట్‌ పార్కింగ్‌ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నామన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సు, ఆటోలకు కలరింగ్‌ కోడ్‌ ఇచ్చి పార్కింగ్‌ విధానం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప భవనాలకు చేరుకునేందుకు వీలుగా స్కైవాక్‌లు ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

జనవరి 15 నాటికి స్టేషన్ల సుందరీకరణ..
అన్ని స్టేషన్ల వద్ద పట్టణ నవీకరణ పథకం కింద చేపట్టిన స్ట్రీట్‌ఫర్నీచర్, ఫుట్‌పాత్‌లు, హరిత వాతావారణం, టైల్స్‌ ఏర్పాటు పనులు 80 శాతం వరకు పూర్తి చేశామన్నారు. ఒక్కో స్టేషన్‌ నిర్మాణానికి రూ.60 కోట్లు ఖర్చు చేశామని..వీటివద్ద సుందరీకరణ పనులకు మరో రూ.2 కోట్లు ఖర్చు చేశామన్నారు. అమీర్‌పేట్, మియాపూర్‌ ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్ల నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రతీ స్టేషన్‌కు రెండు వైపులా 1.5 కిలోమీటరు మేర ఫుట్‌పాత్‌ నిర్మాణ పనులతో పాటు సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. జనవరి 15 వరకు దాదాపు అన్ని స్టేషన్లలో ఆయా పనులు పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించామన్నారు.  కారిడార్‌–3లోని జూబ్లీహిల్స్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు పెద్ద సంఖ్యలో ఆక్రమణలను తొలగించామని, ఇదో సవాల్‌గా మారిందన్నారు. 

బస్సులు, క్యాబ్‌లకు ప్రత్యేక పార్కింగ్‌
కేపీహెచ్‌బీ, అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్ల నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లేందుకు బస్సులతో పాటు ఓలా, ఉబర్‌ క్యాబ్‌లు నిలిపేందుకు  ప్రత్యేక పార్కింగ్‌ స్థలం కేటాయించామన్నారు. మెట్రో స్టేషన్ల నుంచి ఆర్టీసీ 57 ఫీడర్‌ బస్సులు నడుపుతుందని..త్వరలో స్టేసన్ల నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలు నడిపేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ పాలసీని ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి ఫీడర్‌ బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే హైదరాబాద్‌ బైస్కిల్‌ క్లబ్‌ తరుపున స్టేషన్లలో అధునాతన సైకిళ్లను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గడచిన నెల రోజుల్లో 1.5 లక్షల మెట్రో స్మార్ట్‌ కార్డులను విక్రయించామన్నారు. ప్రస్తుతం రోజుకు రెండు వేల కార్డుల వరకు విక్రయాలు జరుగుతున్నాయన్నారు. స్మార్ట్‌కార్డు రీచార్జిని పేటీఎం లేదా టీసవారీ యాప్‌ ద్వారా చేసుకోవచ్చన్నారు. 

మార్చి తరవాత పెరగనున్న రైళ్ల ఫ్రీక్వెన్సీ..
ప్రస్తుతం మూడు బోగీలతో వెయ్యి మంది ప్రయాణికులతో నడుస్తుండగా మార్చి నుంచి  ప్రతీ మెట్రోకు ఆరు బోగీలు ఏర్పాటుచేసి రెండు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మియాపూర్‌ నుంచి అమీర్‌పేట మార్గంలో ప్రస్తుతం ఎనిమిది నిమిషాలకో సర్వీసు, అమీర్‌పేట్‌– నాగోలు మార్గంలో ప్రతి 15 నిమిషాలకో సర్వీసు నడుస్తుందన్నారు. మార్చి తరవాత ఫ్రీక్వెన్సీని 3–5 నిమిషాలకు తగ్గిస్తామని..రైళ్ల సంఖ్యను కూడా రద్దీని బట్టి పెంచుతామన్నారు. ప్రస్తుతం మెట్టుగూడా–అమీర్‌పేట్‌ మార్గంలో మార్చి వరకు కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ మార్గదర్శకాల మేరకు రైళ్లను మ్యాన్యువల్‌గానడుపుతున్నామని..ఈ మార్గంలో మరిన్ని భద్రతా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. మార్చి తరవాత ఈ రూట్లోనూ కమ్యూనికేషన్‌బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఆధారంగా రైళ్లు నడపనుండడంతో రైళ్ల వేగం పెరుగుతుందని ఆయన స్పష్టంచేశారు. 24 మెట్రో స్టేషన్లలో ..ప్రతీ స్టేషన్‌కు రెండు చివరలా టాయిలెట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లను ఆహ్వానించామని..త్వరలో మెట్రో స్టేషన్లలో త్రీస్టార్‌ హోటళ్లలో ఉండే విధంగా టాయిలెట్స్‌ నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పోలీసు శాఖ బాంబు హెచ్చరికల నేపథ్యంలో స్టేషన్లలో డస్ట్‌బిన్‌లు ఏర్పాటుచేయలేదని..త్వరలో పూర్తిగా పారదర్శకంగా ఉండేలా డిజైన్‌ చేసిన డస్ట్‌బిన్లను ఏర్పాటుచేస్తామన్నారు. 

మెట్రో వ్యయం రూ.16,511 కోట్లు..
మెట్రో ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.16,511 కోట్లు ఖర్చు చేశామని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఇందులో ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.14,261 కోట్లు (ఎల్‌ అండ్‌ టీ) ఖర్చు చేయగా.. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి మరో రూ.2250 కోట్లు ఖర్చుచేసినట్లు ఎండీ తెలిపారు. మరో రూ.500 కోట్ల వ్యత్యాస నిధులు(వీజీఎఫ్‌) కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. జర్మనీకి చెందిన కెఫ్‌డబ్లు్య సంస్థనుంచి సుందరీకరణ పనులకు రుణం సేకరించనున్నామన్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.12,500 కోట్లు వివిధ బ్యాంకుల నుంచి రుణంగా సేకరించిందన్నారు. పంజగుట్ట, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లోని షాపింగ్‌ మాల్స్‌ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని, వాటిల్లోని మొత్తం 16 అధునాతన తెరలపై పడుకుని మరీ సినిమాను వీక్షించే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు.

టిక్కెట్‌ ధరల తగ్గింపు లేనట్టే..
మెట్రో ప్రయాణ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఆందోళన ఉన్నప్పటికీ ఇప్పట్లో ఛార్జీల తగ్గింపు లేనట్టేనని..ఛార్జీలపై నిర్ణయం ఉన్నతస్థాయి కమిటీదేనన్నారు. ఇక ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు వీలుగా కామన్‌ బస్‌పాస్‌ను ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement