అమ్మపై సమరశంఖం
అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలితపై డీఎంకే సమరశంఖం పూరించింది. రాష్ట్రంలో అమ్మ పాలన మళ్లీ మొదలైన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. కరుణానిధి అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి అన్బళగన్, కోశాధికారి స్టానిల్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, ప్రచారాలతో అమ్మ ప్రభుత్వాన్ని తూర్పారపట్టాలని సమావేశంలో తీర్మానించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: జయ ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుతో సంబరపడిన డీఎంకే... కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో చతికిలపడింది. కర్ణాటక ప్రభుత్వం అప్పీలు చేస్తుందనే ఆశ నిరాశగా మిగిలింది. అప్పీలుపై తర్జనభర్జనలు సాగుతుండగానే జయ మళ్లీ సీఎం పీఠం ఎక్కారు. అప్పీలుపై ఇతరులను నమ్ముకునేకంటే తామే దాఖలు చేయ డం ఉత్తమమని కరుణ నిర్ణయించుకున్నారు. జయ ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వం అప్పీలుకు వెళ్లకుంటే భవిష్యత్తులో ఈ కేసు ఒక ఉదాహరణగా మిగిలిపోతుందని ఆ ప్రభుత్వ న్యాయవాది ఆచారి హెచ్చరించినా సీఎం స్పందించలేదని కరుణ వ్యాఖ్యానించారు. జయ కేసులో డీఎంకేకు జోక్యం చేసుకునే హక్కుందని గతంలో సుప్రీం కోర్టు రెండుసార్లు స్పష్టం చేసినందున తామే అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కరుణ ప్రకటించారు. అప్పీలు ద్వారా అమ్మపాలనను అడ్డుకునేందుకు మరోసారి పార్టీ సన్నద్ధమవుతోంది. అన్ని జిల్లాల నుంచి వచ్చిన పార్టీ కార్యదర్శుల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. అన్నాడీఎంకే ప్రభుత్వ పాలనపై పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించారు.
అమ్మప్రభుత్వాన్ని సాగనంపుదాం : స్టాలిన్
మధురైలో ఆదివారం రాత్రి డీఎంకే నిర్వహించిన భారీ బహిరంగ సభలో స్టాలిన్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో జయ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. జయ పాలన నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత డీఎంకేపై ఉందని అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వెలువడే వరకు విశ్రమించరాదని కార్యకర్తలను కోరారు. అన్నాడీఎంకే పాలనలోని ఘోరవైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల జయ పాలన సాధించింది ఏమీ లేదని అన్నారు. నీళ్లను సైతం అమ్ముకునే ప్రభుత్వం ఎన్నడైనా ఎరుగుదుమా అంటూ అమ్మా మినరల్ వాటర్ సరఫరాను విమర్శించారు. ఆస్తుల కేసు నుండి నిర్దోషిగా బైటపడవచ్చు, అసలైన తీర్పును ప్రజలు చెప్పేరోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు.