శ్రీకాంత్ ఎలెవన్ ఘనవిజయం
హుద్‌హుద్ బాధితుల సహాయార్థం బెజవాడలో స్టార్ క్రికెట్ మ్యాచ్
39 పరుగులతో నెగ్గిన శ్రీకాంత్ జట్టు
అలరించిన తారల నృత్యాలు
విజయవాడ స్పోర్ట్స్: హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన స్టార్ క్రికెట్ మ్యాచ్ ఉత్సాహభరితంగా సాగింది. శ్రీమిత్ర హౌసింగ్, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన మ్యాచ్‌ను హీరో రామ్‌చరణ్‌తేజ టాస్ వేసి ప్రారంభించారు. తరుణ్ ఎలెవన్, శ్రీకాంత్ ఎలెవన్ జట్లు తలపడగా.. శ్రీకాంత్ ఎలెవన్ జట్టు 39 పరుగులతో విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీకాంత్ ఎలెవన్ జట్టు 19.2 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు నిఖిల్(35), నాని(31) మంచి పునాది వేయగా, సుధీర్ (41), నందకిషోర్ (32) రాణించారు. అనంతరం 200 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన తరుణ్ ఎలెవన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. జట్టులో రఘు 43 (6 ఫోర్లు, ఒక సిక్స్), తారకరత్న 22, తరుణ్ 27 పరుగులు చేశారు.
శ్రీకాంత్ ఎలెవన్ జట్టు బౌలర్లలో ఆదర్శ్ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. సుధీర్ 2, ఖయ్యూం ఒక వికెట్ పడగొట్టారు. మ్యాచ్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.రామకృష్ణ, శ్రీమిత్ర గ్రూప్ అధినేత చౌదరి, సినిమా రంగ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, హీరో జగపతిబాబు, బుల్లితెర నటులు, హీరోయిన్లు గౌరీ ముంజల్, సంజనా, రెజీనా, కామ్నా జెఠ్మలానీ, రక్ష, సాన్వీ తదితరులు పాల్గొన్నారు. హీరోయిన్లు, పలువురు నటీనటులు చేసిన నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.
సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 71 లక్షలు..
టాలీవుడ్ ఫండ్ రైజింగ్ క్రికెట్ మ్యాచ్ ద్వారా శ్రీమిత్ర హౌసింగ్, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ కలిపి రూ. 20 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు శ్రీమిత్ర హౌసింగ్ అధినేత చౌదరి ప్రకటించారు. ఈ మ్యాచ్ ద్వారా సేకరించిన దాదాపు రూ. 71 లక్షల 10 వేలు హుద్‌హుద్ బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు మ్యాచ్ స్పాన్సర్లు ప్రకటించారు.
అభినందన గ్రూప్ రూ. 5 లక్షలు, శుభగృహ హౌసింగ్ రూ. 10 లక్షలు, నున్న రమణ రూ. 5 లక్షలు, పీజే ఎంటర్టైన్మెంట్స్ రూ. 5 లక్షలు, ఫ్యూచరాల్ రూ. 10 లక్షలు, భాష్యం స్కూల్ రూ. 5 లక్షలు, జీడీ కమ్యూనికేషన్స్, రామకృష్ణ హౌసింగ్ తదితర సంస్థలు ప్రకటించిన వాటితో కలిపి ఆ మొత్తం సమకూరాయని నిర్వాహకులు తెలిపారు. నాహిద్ అనే మూడేళ్ల బాలుడు రూ.10 వేలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు జమ చేశాడు.