నక్షత్ర ఫలాలు
అశ్వని: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేష రాశిలోకి వస్తాయి. వీరు సాత్వికులు, అందరితోనూ స్నేహంగా మెలగుతారు. నేర్పు, ఓర్పు కలిగి అందరికీ ఆదర్శప్రాయులుగా ఉంటారు. ధైర్యం ఎక్కువ. ఆభరణాలపై మక్కువ చూపుతారు. పొదుపు గుణం ఉంటుంది.. మంచి రూపవంతులు. స్వశక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రతివిషయంలోనూ సమర్థతను చాటుకుంటారు. నక్షత్రాధిపతి కేతువు. మేషరాశికి అధిపతి కుజుడు. వీరు వైఢూర్యం ధరించవచ్చు. కేతువు జ్ఞానకారకుడు. జ్యోతిష్యం, వేదాంతం, యోగశాస్త్రాలపై ఆసక్తి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ రంగాలలో రాణిస్తారు.
భరణి: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేష రాశిలోకి వస్తాయి. వీరు అభిమానవంతులు, ధైర్యవంతులు కాగలరు. కళల పట్ల ఆసక్తి మెండు. అలంకారప్రియులై ఉంటారు. వస్త్రాభరణాలపై మక్కువ అధికం. భోగభాగ్యాలతో విలాసవంతంగా జీవిస్తారు. ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు. రాజకీయ, విద్య, సాంకేతిక రంగాల్లో రాణిస్తారు. లౌకికజ్ఞానం ఎక్కువ. దూరదృష్టి కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. పదవులు, హోదాలు చేపడతారు. జీవిత మధ్య కాలం నుంచి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి కుజుడు. వీరు వజ్రం ధరించాలి.
కృత్తిక: ఈనక్షత్రంలోని మొదటి పాదం మేషరాశిలోకి, మిగతా మూడు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. మేషరాశికి కుజుడు, వృషభరాశికి శుక్రుడు అధిపతులు. నక్షత్రాధిపతి రవి(సూర్యుడు). మంచి వర్చస్సు, రూపం కలిగి ఉంటారు. ైైధైర్యసాహసాలు అధికం. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. పరిపాలకులుగా, మంచి హోదాలలో బాధ్యతలు చేపట్టి గుర్తింపు పొందుతారు. బంధువుల పట్ల ఎక్కువ అభిమానం చూపుతారు. చిన్నతనంలో కొన్ని ఇబ్బందులు పడ్డా మధ్య వయస్సు నుంచి అభివృద్ధి ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో మంచి పేరు సంపాదిస్తారు. జనాకర్షణ కలిగి ఉంటారు. దానగుణం, దైవభక్తి మెండుగా ఉంటాయి. వీరు కెంపు ధరించాలి.
రోహిణి: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృషభరాశిలోకి వస్తాయి. నక్షత్రాధిపతి చంద్రుడు. రాశ్యాధిపతి శుక్రుడు. వీరు ఎప్పుడూ ప్రశాంతంగా, క్లిష్టమైన సమస్యలను సైతం నేర్పుగా పరిష్కరించుకునే నైపుణ్యం కలిగి ఉంటారు. మేధావులు, విజ్ఞానవంతులై ఉంటారు. స్నేహితులు అధికం. ఆకర్షణీయమైన రూపం. కార్యసాధకులు. మాటల చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకునే గుణం ఉంటుంది. తెలివితేటలతో ఉన్నత శిఖరాలకు చేరతారు. ఉద్యోగ, రాజకీయ, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. భోగభాగ్యాలు, సుఖసంతోషాలతో జీవిస్తారు. వీరు ముత్యం ధరించవచ్చు.
మృగశిర: ఈ నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు వృషభరాశిలోకి, చివరి రెండు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. వృషభరాశికి శుక్రుడు, మిథునరాశికి బుధుడు అధిపతులు. నక్షత్రాధిపతి కుజుడు. ఎప్పుడూ ఉత్సాహవంతులుగా ఉంటారు. కోపం కూడా ఎక్కువే. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. స్వాభిమానం, దైవభక్తి అధికం. ఎవరికీ తలవంచని మనస్తత్త్వం. శాస్త్రవేత్తలుగా, రచయితలుగా, వ్యవసాయదారులుగా, అధ్యాపకులుగా రాణిస్తారు. రాజకీయాల్లో కూడా ప్రవేశం ఉంటుంది. ఎంతటి కార్యాన్నైనా సాధించాలన్న పట్టుదల ఉంటుంది. పరోపకారులు. త్యాగాలకు సైతం సిద్ధపడే గుణం ఉంటుంది. వీరు పగడం ధరించాలి.
ఆరుద్ర: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మిథునరాశిలోకి వస్తాయి. నక్షత్రాధిపతి రాహువు. రాశ్యాధిపతి బుధుడు. వ్యాపారులు, ఉద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లుగా రాణిస్తారు. ఫొటోగ్రఫీ, ప్రచురణలు, కళారంగాలపై మక్కువ చూపుతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. గర్వం, పట్టుదల అధికం. చపలత్వం కలిగి ఉంటారు. ప్రతివిషయంపై వాదనలంటే ఇష్టపడతారు. మేధావులై సన్మానాలు కూడా పొందుతారు. పెద్దలంటే గౌరవం అధికం. నిగ్రహశక్తి ఎక్కువగా ఉంటుంది. రెండు మూడు విద్యల్లో ప్రవేశం కలిగి ఉంటారు. వీరికి ఆలస్యంగా గుర్తింపు వస్తుంది. వీరు గోమేధికం ధరించాలి.
పునర్వసు: ఈ నక్షత్రంలోని మూడు పాదాలు మిథునరాశిలోకి, చివరి పాదం కర్కాటకరాశిలోకి వస్తాయి. మిథునరాశికి బుధుడు, కర్కాటకరాశికి చంద్రుడు అధిపతులు. నక్షత్రాధిపతి గురుడు. మంచిరూపం, తెలివితేటలు కలిగి ఉంటారు. ధర్మబుద్ధి, ఔదార్యం, దైవభ క్తి ఉంటుంది. యుక్తిగా పనులు చక్కదిద్దుకునే నేర్పు ఉంటుంది. పరోపకారులై మంచి గుర్తింపు పొందుతారు. హాస్యచతురులు. తరచూ శ్వాససంబంధ వ్యాధులు బాధిస్తాయి. అన్నవస్త్రాలకు లోటు ఉండదు. అందరిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఉన్నత విద్యావంతులు, పండితులు కాగలరు. వ్యాపారాలు, కాంట్రాక్టులు, ఉద్యోగాల్లో రాణిస్తారు. న్యాయశాస్త్రంపై ఆసక్తి చూపుతారు. వీరు పుష్యరాగం ధరించవచ్చు.
పుష్యమి: ఈనక్షత్రంలోని నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. నక్షత్రాధిపతి శని, రాశ్యాధిపతి చంద్రుడు. మొరటుతనం కలిగి ఉంటారు. స్ఫురద్రూపి, సూక్ష్మబుద్ధి కలిగి ఉంటారు. సత్ప్రవర్తనతో పాటు ధనాపేక్ష అధికం. ఉత్తమ గుణాలు, ధైర్యం అధికంగా ఉంటాయి. ఏకాంత జీవనానికి ఇష్టపడతారు. మధుర పదార్థాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి అభివృద్ధి ఆలస్యంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యవసాయ రంగాలలో రాణిస్తారు. మధ్య వయస్సులో రాజకీయాల్లో కూడా ప్రవేశం ఉంటుంది. న్యాయ, తర్కశాస్త్రాలపై మక్కువ చూపుతారు. వీరు నీలం ధరించవచ్చు.
ఆశ్లేష: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి చంద్రుడు, నక్షత్రాధిపతి బుధుడు. మంచి పనులతో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారాలపై ఆసక్తి అధికం. దైవభక్తి, సేవాభావం ఎక్కువగా ఉంటుంది. మంచి దేహదారుఢ్యంతో పాటు భాగ్యవంతులై ఉంటారు. శాంతస్వభావులు. చపలత్వం కూడా ఎక్కువే. ఆగ్రహం వస్తే మాత్రం ఎవరూ ఆపలేరు. ప్రశాంత జీవనం అంటే ఇష్టపడతారు. ఏదో ఒక వ్యాధి బాధిస్తూనే ఉంటుంది. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టునే గుణం కలిగి ఉంటారు. మధ్యమధ్యలో ఆటంకాలు ఎదురైనా మొత్తంమీద జీవితం సాఫీగానే సాగుతుంది. చిన్నతనంలో కష్టాలు అనుభవించినా మధ్య వయస్సు నుంచి మంచి అభివృద్ధి ఉంటుంది. వీరు పచ్చ ధరించవచ్చు.
మఖ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు సింహరాశిలోకి వస్తాయి. సింహరాశికి రవి(సూర్యుడు) అధిపతి. నక్షత్రాధిపతి కేతువు. ధైర్యవంతులై ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక భావన అధికం. పెద్దల పట్ల గౌరవం కలిగి బంధువులకు ఉపకారం చేస్తారు. కార్యసాధకులు. కళలపై ఆసక్తి ఉంటుంది. కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. విలాసజీవనం గడుపుతారు. దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. యుక్తాయుక్త విచక్షణ కలిగి ఎదుటవారి సమస్యలు సైతం పరిష్కరించే సత్తా కలిగి ఉంటారు. శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తి చూపుతారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వ్యవసాయదారులు, కళాకారులుగా రాణిస్తారు. వీరు వైఢూర్యం ధరించవచ్చు.
పుబ్బ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు సింహరాశిలోకి వస్తాయి. సింహరాశికి అధిపతి రవి(సూర్యుడు), నక్షత్రాధిపతి శుక్రుడు. కళాభిరుచి కలిగి ప్రసంగాలు, తర్కం అంటే ఇష్టపడతారు. దైవభక్తి మెండు. అలంకారప్రియులు, ఆభరణాలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. కార్యసాధకులు, నేర్పరులై ఉంటారు. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధించే తత్వం. గణాంకాలు, కళారంగాల్లో ఎక్కువగా రాణిస్తారు. స్నేహానికి ప్రాణమిస్తారు. అందర్నీ ప్రేమించే గుణం ఉంటుంది. చిన్నతనంలో కొద్దిపాటి కష్టాలు పడ్డా క్రమేపీ మంచి అభివృద్ధిలోకి వస్తారు. వీరు వ జ్రం ధరించవచ్చు.
ఉత్తర: ఈ నక్షత్రంలోని మొదటి పాదం సింహరాశిలోకి, మిగతా మూడు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. సింహరాశికి రవి(సూర్యుడు), కన్యారాశికి బుధుడు అధిపతులు. నక్షత్రాధిపతి రవి. సాధుప్రవర్తన, త్యాగనిరతి కలిగి ఉంటారు. సంఘంలో విశేషమైన గౌరవం పొందుతారు. తరచూ సన్మాన, సత్కారాలు జరుగుతాయి. సాహిత్యం, సంగీతాలపై ఆసక్తి చూపుతారు. పరాక్రమవంతులై శత్రువులను జయిస్తారు. బంధుప్రియులు. మిత్రులు అధికంగా ఉంటారు. వ్యాపారులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఉద్యోగులుగా రాణిస్తారు. ప్రకృతి ఆరాధకులు. ఉన్నత విద్యావంతులై ప్రతిభను చాటుకుంటారు. వీరు కెంపు ధరించాలి.
హస్త: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశికి బుధుడు అధిపతి. నక్షత్రాధిపతి చంద్రుడు. మంచి రూపంతో అందర్నీ ఆకర్షిస్తారు. దైవభక్తి, పెద్దలయందు గౌరవం ఎక్కువ. కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. రెండుమూడు విధాలుగా ధనసంపాదన ఉంటుంది. ఉన్నత విద్యావంతులు కాగలరు. నిపుణ్యత, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. స్వయం కృషితో అభివృద్ధిలోకి వస్తారు. వ్యాపారులుగా, ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, న్యాయనిపుణులుగా రాణిస్తారు. మంచి ఆస్తిపరులు, ధనవంతులై ఉంటారు. వీరు ముత్యం ధరించవచ్చు.
చిత్త: ఈ నక్షత్రంలోని మొదటి రెండుపాదాలు కన్య, చివరి రెండుపాదాలు తులారాశిలోకి వస్తాయి. కన్యారాశికి బుధుడు, తులారాశికి శుక్రుడు అధిపతులు. నక్షత్రాధిపతి కుజుడు. పట్టుదల, కోపం ఎక్కువగా ఉంటాయి. తాము చెప్పిందే వేదమనే తత్వం. అలంకారప్రియులై ఉంటారు. రెండుమూడు విద్యలలో ప్రవేశం ఉంటుంది. శాస్త్రవిజ్ఞానం, వ్యవసాయరంగాలపై ఆసక్తి చూపుతారు. అందరిలోనూ గుర్తింపునకు ఆరాటపడతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. ఎక్కువగా ఉద్యోగులు, వ్యవసాయదారులు, రాజకీయ నాయకులుగా రాణిస్తారు. వీరు పగడం ధరించవచ్చు.
స్వాతి: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశికి అధిపతి శుక్రుడు, నక్షత్రాధిపతి రాహువు. స్వతంత్రంగా జీవించాలనే తపన ఉంటుంది. ఎవరినీ లెక్కపెట్టరు. బాధ్యతలు అప్పగిస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తట్టుకుని పూర్తి చేసే మనస్తత్త్వం. బుద్ధిమంతులు, బంధువర్గానికి అత్యంత ఇష్టులై ఉంటారు. కీర్తిప్రతిష్ఠలు గడిస్తారు. న్యాయదృష్టి, విజ్ఞత కలిగి ఉంటారు. శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాలలో రాణిస్తారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులుగా కూడా కొనసాగుతారు. వీరు గోమేధికం ధరించాలి.
విశాఖ: ఈ నక్షత్రంలోని మూడు పాదాలు తుల, చివరి పాదం వృశ్చిక రాశిలోకి వస్తాయి. తులా రాశికి శుక్రుడు, వృశ్చిక రాశికి కుజుడు అధిపతులు. నక్షత్రాధిపతి గురుడు. సూక్ష్మబుద్ధి కలిగి, వివేకంతో వ్యవహరిస్తారు. విద్యావేత్తలు, పండితులు కాగలరు. యుక్తిగా వ్యవహరించి శత్రువులను సైతం మిత్రులుగా చేసుకుంటారు. ఆస్తిపరులు, ధనవంతులై ఉంటారు. జీవిత మధ్య భాగం నుంచి భోగభాగ్యాలు అనుభ విస్తారు. ఉపకార గుణం ఉంటుంది. సమర్థతను చాటుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలుగా ఎక్కువగా రాణిస్తారు. కనకపుష్యరాగం ధరించవచ్చు.
అనూరాధ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చికరాశికి కుజుడు అధిపతి కాగా, నక్షత్రాధిపతి శని. భోగభాగ్యాలు అనుభవిస్తారు. కష్టజీవులుగా ఉంటారు. రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువగా స్థిరపడతారు. మంచిరూపం, పాపభీతి కలిగి ఉంటారు. శౌర్యవంతులు, మేధావులు కాగలరు. సంగీత, సాహిత్య, లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. కష్టాలెదురైనా ఎప్పుడూ చింతించక సంతోషంగా ఉంటారు. కొందరు గణితం, జ్యోతిషం, సాముద్రికాలలో ఆసక్తి చూపుతారు. వీరు నీలం ధరించాలి.
జ్యేష్ఠ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి కుజుడు, నక్షత్రాధిపతి బుధుడు. వ్యాపారదృక్పథం కలిగి ఉంటారు. పొదుపు గుణం ఎక్కువ. బాగా ఆలోచిస్తే గానీ ఒక నిర్ణయానికి రారు. స్నేహితులంటే ఎక్కువగా ఇష్టపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, రాజకీయ రంగాలలో రాణిస్తారు. చమత్కారులు, హాస్యచతురులు. సాహిత్యం, సంగీతాలపై ఆసక్తి మెండు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. వీరి పచ్చ ధరించాలి.
మూల: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనుస్సు రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి గురుడు, నక్షత్రాధిపతి కేతువు. వీరు యజమానులకు మేలు చేసే వారై ఉంటారు. సమాజసేవపై మక్కువ చూపుతారు. రహస్యాలు పసిగట్టే తత్వం. బంధువులంటే ఇష్టపడతారు. ఎంతటి సమస్య ఎదురైనా ఏమాత్రం భ యపడరు. విషయ పరిజ్ఞానం అధికం. శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, ఉద్యోగులుగా రాణిస్తారు. క ష్టపడి పైకి వస్తారు. స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. వీరు వైఢూర్యం ధరించాలి.
పూర్వాషాఢ: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనుస్సు రాశిలోకి వస్తాయి. ధనూరాశికి గురుడు అధిపతి, నక్షత్రాధిపతి శుక్రుడు. ఉన్నత విద్యావంతులు, సంగీత, సాహిత్యకారులు కాగలరు. వినయవిధేయతలు , దానగుణం కలిగి ఉంటారు. సంపన్నులతో స్నే హం చేస్తారు. ప్రయాణాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. తరచూ సన్మాన, సత్కారాలు పొందుతారు. అధ్యాపకులు, కళాకారులు రాజకీయ నాయకులుగా రాణిస్తారు. వీరు వజ్రం ధరించాలి.
ఉత్తరాషాఢ: ఈ నక్షత్రంలోని మొదటి పాదం ధనుస్సు రాశిలోకి, మిగతా మూడు పాదాలు మకరరాశిలోకి వస్తాయి. ధనుస్సు రాశికి గురుడు, మకర రాశికి శని అధిపతులు. నక్షత్రాధిపతి రవి(సూర్యుడు). వీరికి రవి దశతో జీవితం ప్రారంభమవుతుంది. అందరికీ ఆప్తులై ఉంటారు. శ్రమ, కష్టాలను తట్టుకునే తత్వం. నాయకత్వ లక్షణాలు కలిగి జనాకర్షణ ఉంటుంది. స్వశక్తితో పైకి వస్తారు. ఇతరుల మేలు మర్చిపోరు. మిత్రులు ఎక్కువగా ఉంటారు. శాస్త్రవిజ్ఞానం, న్యాయశాస్త్రాలంటే ఇష్టపడతారు. ఉన్నతపదవులు చేపడతారు. వీరు కెంపు ధరించాలి.
శ్రవణం: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మకరరాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి శని, నక్షత్రాధిపతి చంద్రుడు. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. బంధువులకు సాయపడతారు. విద్యావంతులై ఉన్నత హోదాలు చేపడతారు. ఔదార్యం, ఉపకారబుద్ధి, మాటల చాతుర్యం కలిగి ఉంటారు. కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. సుగంధ ద్రవ్యాలంటే ఇష్టమెక్కువ. వ్యాపారాల్లో ఎక్కువగా రాణిస్తారు. వ్యవసాయంపై కూడా ఆసక్తి ఉంటుంది. సంగీత, సాహిత్య ప్రియులు కాగలరు. ఆకర్షణీయమైన రూపం ఉంటుంది. వీరు ముత్యం ధరించాలి.
ధనిష్ఠ: ఈ నక్షత్రంలోని మొదటి రెండుపాదాలు మకరరాశిలోకి, చివరి రెండుపాదాలు కుంభరాశిలోకి వస్తాయి. మకర, కుంభరాశులకు శని అధిపతి. నక్షత్రాధిపతి కుజుడు. ఎరుపు దుస్తులు, వస్తువులంటే ఇష్టపడతారు. దానగుణం, సౌమ్యగుణం కలిగి ఉంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకునే లక్షణం ఉంటుంది. శ్రమించే తత్వం. క్రీడాకారులుగా, వ్యవసాయదారులుగా రాణిస్తారు. ఉన్నతోద్యోగులుగా కూడా స్థిరపడతారు. సంగీతంపై మక్కువ చూపుతారు. అధిక సంపాదనపై అభిలాష ఉంటుంది. మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడతారు. భూములు, వాహనాలు కలిగి ఉంటారు. వీరు పగడం ధరించవచ్చు.
శతభిషం: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశికి శని అధిపతి. నక్షత్రానికి రాహువు అధిపతి. బంధువులకు ఉపకారం చేస్తారు. గౌరవమర్యాదలు పొందుతారు. నీతినిజాయితీలు, ధైర్యసాహసాలు కలిగి ఉంటారు. వాక్చాతుర్యం కలిగి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. పరిశోధనలు, వైద్యం, సాంకేతిక రంగాలలో రాణిస్తారు. వాదనల్లో ఆరితేరతారు. వక్తలుగా కూడా రాణిస్తారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వీరు గోమేధికం ధరించాలి.
పూర్వాభాద్ర: ఈ నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు కుంభరాశిలోకి, చివరి పాదం మీన రాశిలోకి వస్తాయి. కుంభానికి శని, మీనరాశికి గురుడు అధిపతులు. నక్షత్రాధిపతి గురుడు. వినయవిధేయతలు, సేవాభావం కలిగి ఉంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. విచక్షణాజ్ఞానంతో మంచిచెడ్డలను అంచనా వేస్తారు. గొప్ప పనులు చేసి అందరి ప్రశంసలు పొందుతారు. రెండు మూడు విద్యల్లో రాణిస్తారు. ధనవంతులై భోగభాగ్యాలు అనుభవిస్తారు. కళాభిరుచి, వైద్య నైపుణ్యం ఉంటుంది. ప్రతిభావంతులై సన్మానాలు పొందుతారు. వీరు పుష్యరాగం ధరించవచ్చు.
ఉత్తరాభాద్ర: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మీన రాశిలోకి వస్తాయి. మీన రాశికి గురుడు అధిపతి. నక్షత్రాధిపతి శని. ధైర్యం వీరి సొంతం. నీతినిజాయితీలకు ప్రాణం ఇస్తారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మనస్సు చంచ లం. వీరు నాయకులుగా, వ్యాపారులుగా, ఉద్యోగులుగా రాణిస్తారు. నమ్మినవారికి ఎన్ని కష్టాలెదురైనా సాయం అందించే గుణం ఉంటుంది. జీవిత ప్రారంభంలో కొద్దిపాటి కష్టాలు పడ్డా క్రమేపీ అభివృద్ధిలోకి వస్తారు. ప్రయాణాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. నచ్చని విషయాలను నిర్భయంగా వెల్లడిస్తారు. వీరు నీలం ధరించాలి.
రేవతి: ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మీన రాశిలోకి వస్తాయి. మీనరాశికి గురుడు, నక్షత్రానికి బుధుడు అధిపతులు. వ్యాపార లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పట్టుదల అధికం. శ్రమకు, కష్టాలకు భయపడరు. మేధావులై ఉంటారు. రచనలు, జ్యోతిషం, గణిత శాస్త్రాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. విద్యావేత్తలు కాగలరు. జీవిత మధ్య దశలో ధనవంతులు, ఆస్తిపరులు కాగల అవకాశాలు ఉంటాయి. వాక్పటిమతో అందర్నీ ఆకట్టుకునే గుణం కలిగి ఉంటారు. రాజకీయ నాయకులుగా కూడా రాణిస్తారు. వీరు పచ్చ ధరించాలి.