Star Status
-
అది శాశ్వతం కాదు
ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకోవాలని చాలామంది హీరోయిన్స్ కోరుకుంటుంటారు. కానీ ఆ స్టేటస్ పై తనకు సరైన అభిప్రాయం లేదని చెబుతున్నారు అమలాపాల్. ఎందుకు? అని అడిగితే... ‘‘స్టార్ హోదాలో ఉన్నాను అన్న ఫీలింగ్ కంటే యాక్టర్‌గా ఎదుగుతున్నాను అన్న భావనే నాకు సంతృప్తిని ఇస్తుంది. అప్పుడే మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాను. స్టార్డమ్ శాశత్వం కాదు. అది ఎక్కువ కాలం ఉండదు. లైఫ్‌లో అదొక ఫేజ్ మాత్రమే. నా వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకున్న తర్వాత నాతో నటించడానికి కొందరు స్టార్ హీరోలు అంగీకరంచలేదు. ఆశ్చర్యం వేసింది. సినిమాల కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటాను. సినిమాపై నాకు ఉన్న ప్రేమ అలాంటిది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘తమిళ నటుడు విజయ్ సేతుపతికి నేను పెద్ద అభిమానిని. ఆయన ఎక్కడినుంచో ఇండస్ట్రీకి వచ్చి గొప్ప స్థాయికి ఎదిగారు. నేను కూడా ఆయనలా మంచి యాక్టర్ కావాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు అమలాపాల్. -
ఫ్యాషన్ పిడుగు
‘బుజ్జి పిల్లా... తెల్ల పిల్లా.. ఐ లవ్యూ పిల్లా..’ అంటూ ఇన్స్టాగ్రామ్ ఈ ‘బుజ్జిమా’ ను నెత్తిన పెట్టేసుకుంది. ఆస్ట్రేలియన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో ఈ అమ్మాయికి స్టార్ స్టేటస్ ఉంది. వాలెంటీనా కాప్రీ అనే ఈ రెండేళ్ల పిల్ల అకౌంట్లో ఉన్న వివిధ దుస్తులు, వివిధ పోజులు, లవ్లీ ఫొటోలు చూసి ఆస్ట్రేలియన్ కంపెనీలు ఫ్లాట్ అయిపోయాయి! 28,000 ఫాలోయర్లు రాగానే కిడ్జ్ ఫ్యాషన్ అనే కంపెనీకి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ మోడల్ అయిపోయింది కాప్రి. ఇప్పుడు ఆ చిన్నారికి 2,90,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆ పాపకు డ్రస్సులు పంపి, అవి తను వేసుకుని ఫొటో దిగి, ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తే ఫొటోకు 400 డాలర్లు ఇస్తున్నారు. ఇకనేం, వాలెంటీనా కాప్రికి డ్రస్సులే డ్రస్సులు. డబ్బులే డబ్బులు. రెండేళ్ల వాలెంటీనా పాపులారిటీ ఏ స్థాయికి చేరుకుందంటే ఆఖరికి ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌పై హ్యాకర్లు దాడి చేశారు! చివరికి ఎలాగోలా నెట్ దొంగలపై అదుపు సాధించింది వాలెంటీనా తల్లి. ఇప్పుడు మళ్లీ కనీసం రోజుకి ఏడు డ్రెస్సులు పార్సెల్‌లో వస్తున్నాయట. ఇదిలా ఉంటే వాలెంటీనా కాప్రీకి గట్టి పోటీ ఎదురవబోతోంది! ఎవరనుకుంటున్నారా? వాళ్లమ్మ మళ్లీ గర్భవతి. వాలెంటీనాకి అకౌంట్ సృష్టించినట్టే పుట్టబోయే బిడ్డకూ అకౌంట్ ఓపెన్ చేస్తానని ఆమె ప్రకటించేసింది. -
మొదట్లో నేనూ... ఫీలయ్యేదాన్ని!
తెలుగు, తమిళ భాషల్లో సమంత ‘మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’. చెప్పాలంటే తమిళ పరిశ్రమలోకన్నా తెలుగులోనే సమంత ఎక్కువ విజయాలు చూశారు. మొదటి చిత్రం ‘ఏ మాయ చేశావె’తోనే క్రేజీ హీరోయిన్ అయిపోయారు. ఆ మధ్య వరుసగా తెలుగు చిత్రాలే చేసిన సమంత ఇప్పుడు మాత్రం ఇటు తెలుగు, అటు తమిళంలో చేస్తూ బిజీగా ఉన్నారు. రెండు భాషల్లోనూ స్టార్ హోదా ఉన్నప్పటికీ సాదాసీదా అమ్మాయిలానే భావిస్తానని సమంత అంటున్నారు. ‘‘పరిశ్రమకు రాక ముందు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను. కాకపోతే అంతకు ముందు కన్నా స్ట్రాంగ్ పర్సన్ అయ్యాను. ఇక్కడికొచ్చాక మానసికంగా స్ట్రాంగ్ అయ్యాను. ఒకవేళ ఎవరైనా సినిమా పరిశ్రమకు రావాలనుకున్నారనుకోండి... ఇక్కడకు రాక ముందే జీవితపాఠాలు నేర్చుకోవాలి. అప్పుడే ఇక్కడ నిలదొక్కుకోగలుగుతాం. లేకపోతే అపజయాలకు కుంగిపోతాం. పుకార్లకు దిగులుపడతాం. మొదట్లో నేనూ అలా బాధపడేదాన్ని. ఆ తర్వాత నుంచి తేలికగా తీసుకుంటున్నాను. అదే ఇండస్ట్రీకి రాక ముందే మానసికంగా బలంగా ఉండి ఉంటే, ముందు నుంచే వీటిని పెద్దగా పట్టించుకొనేదాన్ని కాదేమో! ఏమైనా, ఇప్పటికీ నా గురించి నెగటివ్, పాజిటివ్ - ఏ కామెంట్ వచ్చినా ఆలోచిస్తాను. ఆ వ్యాఖ్యల్లో ఏదైనా మంచి ఉంటే దాన్ని స్వీకరిస్తాను’’ అని సమంత చెప్పారు.