ఫ్యాషన్ పిడుగు
‘బుజ్జి పిల్లా... తెల్ల పిల్లా.. ఐ లవ్యూ పిల్లా..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ఈ ‘బుజ్జిమా’ ను నెత్తిన పెట్టేసుకుంది. ఆస్ట్రేలియన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో ఈ అమ్మాయికి స్టార్ స్టేటస్ ఉంది. వాలెంటీనా కాప్రీ అనే ఈ రెండేళ్ల పిల్ల అకౌంట్‌లో ఉన్న వివిధ దుస్తులు, వివిధ పోజులు, లవ్‌లీ ఫొటోలు చూసి ఆస్ట్రేలియన్ కంపెనీలు ఫ్లాట్ అయిపోయాయి! 28,000 ఫాలోయర్లు రాగానే కిడ్జ్ ఫ్యాషన్ అనే కంపెనీకి అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ మోడల్ అయిపోయింది కాప్రి. ఇప్పుడు ఆ చిన్నారికి 2,90,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆ పాపకు డ్రస్సులు పంపి, అవి తను వేసుకుని ఫొటో దిగి, ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తే ఫొటోకు 400 డాలర్లు ఇస్తున్నారు. ఇకనేం, వాలెంటీనా కాప్రికి డ్రస్సులే డ్రస్సులు. డబ్బులే డబ్బులు.
రెండేళ్ల వాలెంటీనా పాపులారిటీ ఏ స్థాయికి చేరుకుందంటే ఆఖరికి ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌పై హ్యాకర్లు దాడి చేశారు! చివరికి ఎలాగోలా నెట్ దొంగలపై అదుపు సాధించింది వాలెంటీనా తల్లి. ఇప్పుడు మళ్లీ కనీసం రోజుకి ఏడు డ్రెస్సులు పార్సెల్‌లో వస్తున్నాయట. ఇదిలా ఉంటే వాలెంటీనా కాప్రీకి గట్టి పోటీ ఎదురవబోతోంది! ఎవరనుకుంటున్నారా? వాళ్లమ్మ మళ్లీ గర్భవతి. వాలెంటీనాకి అకౌంట్ సృష్టించినట్టే పుట్టబోయే బిడ్డకూ అకౌంట్ ఓపెన్ చేస్తానని ఆమె ప్రకటించేసింది.