stars Cricket
-
కొడితే కొట్టాలి రా.. హిట్టు కొట్టాలి
కొడితే కొట్టాలి రా కప్పు కొట్టాలి అనే ధ్యేయంతో బరిలోకి దిగుతున్నారు క్రికెటర్లు. క్రికెట్ వరల్డ్ కప్ హంగామా మొదలైపోయింది. ఇటు సిల్వర్ స్క్రీన్ క్రికెట్ కూడా రెడీ అవుతోంది. కొడితే కొట్టాలి రా.. హిట్టు కొట్టాలి అంటూ కొందరు స్టార్స్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. గ్రౌండ్లో డాన్ ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ క్రికెట్ గ్రౌండ్లోకి దిగాడు. ఏం చేశాడనేది వచ్చే ఏడాది వెండితెరపై చూడాలి. విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలాం’. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ క్రికెటర్స్‌గా నటించగా, ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా రజనీ నటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 170వ చిత్రం ప్రారంభమైంది. అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్ కీలక పాత్రల్లో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ముత్తయ్య 800 లెజెండరీ క్రికెటర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోముత్తయ్య మురళీధరన్‌గా ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. మురళీధరన్ భార్య మది మలర్ పాత్రను మహిమా నంబియార్ పోషించారు. ఈ సినిమాలో తన క్రికెట్ లైఫ్ గురించి 20 శాతం ఉంటే, తన జీవితంలోని ఆసక్తికర సంఘటనలు 80 శాతం ఉంటాయని మురళీధరన్ ఇటీవల పేర్కొన్నారు. అలాగే మురళీధరన్గారిలా నటించేందుకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఆయన అన్ని వీడియోలను చూశానని, తీవ్రంగా బౌలింగ్ సాధన చేశానని, మేకప్ కోసమే మూడు గంటలు పట్టేదనీ మధుర్ మిట్టల్ తెలిపారు. అంతేకాదు.. కొన్నాళ్ల క్రితం తనకు యాక్సిడెంట్ జరగడం వల్ల తన ఎల్బో కూడా ముత్తయ్య తరహాలోకే వచ్చిందనీ మధుర్ మిట్టల్ చెప్పుకొచ్చారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. ది టెస్ట్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో తమిళంలో ‘టెస్ట్’ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్, నయనతార లీడ్ రోల్స్ చేస్తుండగా, నిర్మాత శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. మోషన్ పోస్టర్‌ను బట్టి ఈ సినిమా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో ఉంటుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో మాధవన్, నయనతార, సిద్ధార్థ్లలో ఎవరు క్రికెటర్స్‌గా కనిపిస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. చక్దా ఎక్స్‌ప్రెస్ దాదాపు రెండు దశాబ్దాల పాటు హిట్ క్రికెట్ ఆడారు జులన్ గోస్వామి. ఆమె జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘చక్దా ఎక్స్‌ప్రెస్’. జులన్గా అనుష్కా శర్మ నటించారు. నాలుగేళ్ల తర్వాత అనుష్కా శర్మ నటించిన చిత్రం ఇదే. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానుందట. క్రికెటర్ మహి జాన్వీ కపూర్ క్రికెటర్‌గా నటించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్ట్రస్ మహి’. రాజ్‌కుమార్ రావు మరో లీడ్ రోల్లో నటించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం క్రికెట్లో ఆరు నెలల పాటు జాన్వీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇలా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
17న స్టార్స్ క్రికెట్
పోటీలో 8 జట్లుగా 48 ప్రముఖ నటులు పాల్గొననున్న రజనీ, కమల్, అమితాబ్, చిరంజీవి నాగార్జున, మమ్ముట్టి, మోహన్‌లాల్ ఏప్రిల్ నెల భానుడి ప్రతాపంతో ఎండలు మండే రోజులు. అలాంటి సమయంలో సినీ ప్రియులను కూల్ పరచే సమాచారం స్టార్స్ క్రికెట్. అవును ప్రముఖ భారతీయ నటీనటులను ఒకే చోట చూసి అభిమానులు పులకించే తరుణం అది. స్టార్ నటీనటులు బ్యాట్ చేత పట్టి గౌండ్ న లుమూలల బంతులను పరుగులెత్తిస్తుంటే, మరి కొందరు చాకచక్యంతో బంతుల్ని విసిరి వికెట్లు పడగొడుతుంటే వీక్షకులు పొందే ఆనందం, కుర్రకారుల కేరింతలు మాటల్లో చెప్పడం కాస్త కష్టమే. అలాంటి అరుదైన తరుణం ఏప్రిల్ 17న చెన్నై ప్రజల కోసం రానుంది. దక్షిణ భారత నటీన టుల సంఘం నూతన భవన నిర్మాణ నిధి కోసం ఈ స్టార్ క్రికెట్‌ను నిర్వహించినుందన్న విషయం తెలిసింది. ఈ బ్రహ్మాండమైన కార్యక్రమానికి సంబంధించిన తాజా సమాచారం ఇది చెన్నైలోని చేపాక్ స్టేడియంలో కనులవిందుగా జరగనుంది. ఇందులో సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,నాగార్జున, మలయాళ సూపర్‌స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ ప్రముఖ కళాకారులు పాల్గొననున్నారు. ఈ స్టార్ క్రికెట్ క్రీడలో 8 జట్లు పోటీ పడనున్నాయి. ఒక్కో జట్టులో ఆరుగురు నటులు చొప్పున 48 మంది ఆడనున్నారు. వీటికి నటుడు సూర్య, విశాల్, ఆర్య, దనుష్, జీవా, విష్ణు ఒక్కో జట్టుకు ఒక్కొక్కరు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.ఈ జట్టులకు చెన్నై, మదురై, తిరుచ్చి అంటూ ఊర్ల పేర్లను పెట్టనున్నారు.ఇందులో సూపర్‌స్టార్ రజనీకాంత్ వయసు రీత్యా ఏ జట్టులో పాల్గొనక పోయినా తొలి బంతిని వేసి క్రీడను ప్రారంభించనున్నారు. కమలహాసన్ ఒక జట్టులో ఆడనున్నారు. ఇక ఒక్కో జట్టుకు ఒక్కో అగ్ర కథానాయకి అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. అలా అందాల భామలు నయనతార, త్రిష, అనుష్క, కాజల్‌అగర్వాల్, సమంత వీక్షకుల్ని అలరించనున్నారు. ఈ స్టార్ క్రికెట్ క్రీడలో తొలి ఆట గెలిచిన వారు క్వార్టర్ ఫైనల్‌కు అందులో గెలిచిన జట్టు సెమీఫైనల్, అందులో గెలుపొందిన వారు ఫైనల్లో పోటీ పడనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ క్రీడ జరగనుంది. ఇప్పటికే సినీ కళాకారులందరూ విధిగా ఇందులో పాల్గొనాలని సంఘ నిర్వాహకం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీలో ప్రఖ్యాత నటీనటులందరూ పాల్గొననునందున గట్టి భద్రతకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నగర పోలీస్‌కమిషనర్, ఎన్నికల కమిషనర్‌ను సంఘ నిర్వాహకులు కలిసి అనుమతి కోరుతూ విన్నపం పత్రాన్ని అందించారు. -
రెడీ...స్టార్ట్
‘మేము సైతం’ అంటూ విశాఖవాసులకు భరోసానిస్తున్న టాలీవుడ్ ఈవెంట్ సక్సెస్ కోసం ఫుల్‌గా ప్రిపేరవుతోంది. పది రోజులుగా రిహార్సల్స్‌లో మునిగిపోతున్నారు సినీజనాలు. ఆదివారం జరిగే 12 గంటల లైవ్ షో ఆద్యంతం ఆసక్తిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పలువురు నటీనటులు వెరైటీ స్కిట్స్‌తో రెడీ అవుతున్నారు. డ్యాన్స్, షోస్ ప్రాక్టీస్‌లో గంటల తరబడి గడుపుతున్నారు. ఇంకొందరు కబడ్డీ.. కబడ్డీ.. అంటూ ‘కూత’ పెడుతున్నారు. స్టార్స్ క్రికెట్లో బౌండరీలు బాదడానికి నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. హుద్‌హుద్ బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ రంగంలోకి దిగిన ఇండస్ట్రీ ప్రాక్టీస్ సెక్షన్ ముచ్చట్లు మీ కోసం.. అందరూ భాగస్వాములే.. విశాఖవాసులకు ఎవరూ తీర్చలేని కష్టం వచ్చింది. దాన్ని పూర్తిగా పూడ్చలేకపోయినా.. మా వంతు సాయం చేయడానికి వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. మాకు వచ్చిన కళతోనే దీన్ని ఎదుర్కోవాలని మేముసైతం కార్యక్రమానికి పూనుకున్నాం. టాలీవుడ్ ఫ్యామిలీ తరఫున చేస్తున్న బృహత్కార్యం ఇది. ఇండస్ట్రీలోని అందరూ వివిధ పెర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు. కమెడియన్స్ కామెడీ స్కిట్స్ చేస్తున్నారు. నేను క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ ఈవెంట్ ద్వారా మేమందిస్తున్న సహాయం వారికి కొంతైనా ఓదార్పునిస్తుంది. మాతో ప్రతి ఒక్కరూ చేయి కలిపి వైజాగ్ పునరుద్ధరణలో భాగస్వాములు కావాలి. - నాగార్జున ఎంత కష్టం.. విశాఖలో కొన్ని వందల షూటింగ్‌లు చేసుంటాం. అక్కడ ప్రతి అంగుళం మా సినీజనానికి తెలుసు. అవన్నీ సుడిగాలి తీవ్రతకు సర్వనాశనమయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి విద్యుత్ పునరుద్ధరణకు రూ.16 కోట్ల విలువైన సామగ్రి పంపించారు. తెలుగు ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఇండస్ట్రీ ఆదుకుంటుందని గతంలో ఎన్నోమార్లు రుజువైంది. ఆ ఆదర్శంతోనే ఈరోజు మేమంతా ముందుకు వచ్చాం. రచయితలమంతా కలసి స్వచ్ఛభారత్‌పై జొన్నవిత్తుల రాసిన ఓ స్కిట్‌ను ప్రదర్శిస్తున్నాం. - పరుచూరి గోపాలకృష్ణ తలో చెయ్యి.. వారం రోజులుగా నటీనటులందరూ సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ దామూ నేతృత్వంలో ఈ సెక్షన్ నిర్వహిస్తున్నాం. బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, పరుచూరి గోపాలకృష్ణ, కోడి రామకృష్ణ, నాగేశ్వర్‌రెడ్డి, ఎమ్మెస్, ఈవీవీ సత్తిబాబు, శివారెడ్డి ఇలా అందరూ స్కిట్స్ చేస్తున్నారు. నేను, ఖయ్యూం ఇద్దరం వీటిని కో ఆర్డినేట్ చేస్తున్నాం. - కాదంబరి కిరణ్ అందరివాళ్లం.. హుద్‌హుద్ తీవ్రతకు బ్యూటిఫుల్ వైజాగ్ కళావిహీనమైపోయింది. తెలుగు ఇండస్ట్రీ అంతా కలసి వారికి సాయం చేయాలని ముందుకు వచ్చింది. క్రికెట్లో నేను వెంకటేష్ టీమ్‌లో ఉన్నాను. నాలుగు జట్లు ఉన్నాయి. ఒక్కో ఇన్నింగ్స్ ఆరు ఓవర్లు సాగుతుంది. నేను సీసీఎల్, టీసీఐ టీమ్‌లలో ఉన్నాను. అప్పుడప్పుడూ క్రికెట్ ఆడుతూనే ఉంటాను. - నవీన్ చంద్ర ఉడతాసాయం నాకు క్రికెట్ అంటే ప్రాణం. విశాఖవాసులను ఆదుకోవడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ చేస్తున్న గొప్ప కార్యక్రమమిది. ఉడతాసాయంగా నేను అందులో పాలుపంచుకోవాలనుకున్నాను. అందుకే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా 900 గ్రాముల లైట్‌వెయిట్ బీడీఎం బ్యాట్స్ తెప్పించాను. హీరో నాగార్జునకు అందించాను. జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్లకూ ఇస్తాను. - చక్రపాణి, స్పోర్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ చైర్మన్ బాధ్యతగా ఫీలవుతున్నాం.. వైజాగ్ ఒక ప్రళయాన్ని చూసింది. ఈ సమయంలో వారి బాగోగులను చూడాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉంది. ఆ బాధ్యతతోనే ఇండస్ట్రీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో నేను భాగస్వామినైనందుకు సంతోషంగా ఉంది. - నాని క్రికెట్, కబడ్డీ కూడా.. ఎంటర్టైన్మెంటే కాదు.. ఇలాంటి సందర్భాల్లో కూడా అండగా ఉంటామని టాలీవుడ్ నిరూపించింది. డ్యాన్సింగ్ పెర్ఫార్మెన్స్తో పాటు క్రికెట్, కబడ్డీ జట్టుల్లో కూడా ఉన్నాను. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. - తనీష్ స్టే స్ట్రాంగ్ మా సినిమాలను ఆదరించిన కామన్ పీపుల్ కష్టాల్లో ఉంటే స్పందించడం మా కనీస బాధ్యత. నేను కబడ్డీ జట్టులో ఉన్నాను. స్కిట్లో కూడా యాక్ట్ చేస్తున్నా. గుడ్ కాజ్ గురించి చేస్తున్న ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. స్టే స్ట్రాంగ్ మీకు మేమున్నాం. - నవదీప్ పది రోజులుగా.. మేముసైతంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది. నేను స్కిట్స్ కో ఆర్డినేట్ చేస్తున్నాను. పది రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నాం. ఎమ్మెస్, రఘుబాబు, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి.. ఇలా అందరు నటులు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. క్రికెట్ విషయానికి వస్తే నేను రామ్‌చరణ్‌తేజ్ టీమ్‌లో ఉన్నాను. - ఖయ్యూం ప్రత్యేక అనుబంధం.. నా మొదటి సినిమా వేదం వైజాగ్‌లోనే షూట్ చేసుకుంది. ఆ సిటీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. సాయం చేసే పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ విశాఖవాసులకు చేయూతనివ్వాలి. డ్యాన్స్‌తో పాటు క్రికెట్ కూడా ఆడుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ టీమ్‌లో ఉన్నాను. ఫ్యాషన్ పెరేడ్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. - దీక్షాసేథ్ ఎప్పుడూ సిద్ధం.. గతంలో దాసరి గారు, మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో జరిగిన చారిటీ ఈవెంట్లలో పాల్గొన్నాను. మేముసైతం సక్సెస్ కోసం నటీనటులంతా కష్టపడుతున్నారు. నేను హంసనందిని, దీక్షాసేథ్, ఊర్వశి, తనీష్ కోసం కొరియోగ్రఫీ చేస్తున్నాను. - సత్య మాస్టర్ అందుకే వచ్చా.. తెలుగు ఇండస్ట్రీ మొత్తం యూనిటీగా నడవటం సంతోషంగా ఉంది. మేముసైతం కాజ్ నచ్చడంతో టాలీవుడ్‌తో పరిచయం లేకున్నా.. ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాను. నేను టాలీవుడ్ నటిని కాకపోయినా.. వారు చేసే మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది. - ఊర్వశి రౌటెల ..:: శిరీష చల్లపల్లి ఫొటోలు: సృజన్ పున్నా -
21న తారల క్రికెట్
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియం మరో సంబరానికి వేదికవుతోంది. నిన్న ఇండియా- వెస్టిండీస్ క్రికెట్ జట్ల పోరును కనులారా వీక్షించిన విశాఖ వాసులను ఈ సారి తారల క్రికెట్ అలరించనుంది. ఇందుకు ఈ నెల 21వ తేదీ ముహూర్తం ఖరారైంది. గతంలో సీసీఎల్ పేరిట పోటీలు జరిగితే, ఈసారి టాలీవుడ్ జట్టుతో బాలీవుడ్ జట్టు తలపడనుంది. శ్రీకాంత్... సునీల్‌శెట్టి నాయకత్వం టీఎస్ఆర్ సీసీ కప్ పేరిట నిర్వహించనున్న ఈ పోటీలో టాలీవుడ్ జట్టుకు శ్రీకాంత్, బాలీవుడ్ జట్టుకు సునీల్ శెట్టి నాయకత్వం వహించనున్నారు. మోహన్‌బాబు, జయప్రద, బ్రహ్మానందం, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, చార్మి, మంచు లక్ష్మి, స్నేహా ఉల్లాల్, రాణాలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. మధ్యాహ్నం మ్యాచ్ ఈ నెల 21న తొలి బంతి మధ్యాహ్నం మూడుగంటలకు పడనుంది. అంతా సవ్యంగా జరిగితే మ్యాచ్ ఫ్లడ్‌లైట్ల కాంతి నడుమ పది గంటలకల్లా పూర్తికానుంది. తారల తళుకులతో స్టేడియంలో జరిగే హల్చల్కు అనుకున్న టైమ్‌కే మ్యాచ్ నిర్వహణ కాస్తకష్టమైన పనే. రూ. 2కోట్లు టీఎస్ఆర్ యూత్వింగ్ ఖర్చుపెట్టి నిర్వహిస్తోంది. టాలీవుడ్ జట్టు శ్రీకాంత్, అల్లరినరేష్, నాని, ప్రిన్స్, ఆదర్స్, రాజీవ్, రఘు, ప్రభు, అయ్యప్ప, ఖయ్యం, నిఖిల్ టాలీవుడ్ జట్టులో ఆడనునాన్నారు. బాలీవుడ్ జట్టు సునీల్ శెట్టి, రితీష్, సోనుసూద్, రణ్‌దీప్, మహేష్ మంజ్రేకర్, మకరంద్, సన్నీ, మనోజ్, షబ్బీర్, రాజాలు బాలీవుడ్ జట్టులో ఆడనున్నారు. అంతా ఉచితమే గతంలో జరిగిన తారల క్రికెట్‌కు భిన్నంగా ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. నగరంలోనే యాభైవేల మంది వరకు విద్యార్థులున్నారని, వారందరినీ ఆహ్లాద పరిచేందుకే ఈ మ్యాచ్ అంటూ నిర్వాహకులు పేర్కొంటున్నారు. టికెట్ల అమ్మకాలు ఉండవని, అంతా కాంప్లిమెంటరీలే అంటున్నారు. పోస్టర్, టికెట్లు విడుదల స్థానికంగా శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు తారల క్రికెట్ మ్యాచ్ వివరాలు వెల్లడించారు. అనంతరం కాంప్లిమెంటరీ టికెట్లను, తారల క్రికెట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మ్యాచ్ నిర్వాహక కమిటీ ప్రతినిధులు రెహ్మాన్, తిప్పల గురుమూర్తి, ప్రభుకిషోర్, వరదారెడ్డి పాల్గొన్నారు.