17న స్టార్స్ క్రికెట్
-
పోటీలో 8 జట్లుగా 48 ప్రముఖ నటులు
-
పాల్గొననున్న రజనీ, కమల్, అమితాబ్, చిరంజీవి
-
నాగార్జున, మమ్ముట్టి, మోహన్‌లాల్
ఏప్రిల్ నెల భానుడి ప్రతాపంతో ఎండలు మండే రోజులు. అలాంటి సమయంలో సినీ ప్రియులను కూల్ పరచే సమాచారం స్టార్స్ క్రికెట్. అవును ప్రముఖ భారతీయ నటీనటులను ఒకే చోట చూసి అభిమానులు పులకించే తరుణం అది. స్టార్ నటీనటులు బ్యాట్ చేత పట్టి గౌండ్ న లుమూలల బంతులను పరుగులెత్తిస్తుంటే, మరి కొందరు చాకచక్యంతో బంతుల్ని విసిరి వికెట్లు పడగొడుతుంటే వీక్షకులు పొందే ఆనందం, కుర్రకారుల కేరింతలు మాటల్లో చెప్పడం కాస్త కష్టమే. అలాంటి అరుదైన తరుణం ఏప్రిల్ 17న చెన్నై ప్రజల కోసం రానుంది.
దక్షిణ భారత నటీన టుల సంఘం నూతన భవన నిర్మాణ నిధి కోసం ఈ స్టార్ క్రికెట్‌ను నిర్వహించినుందన్న విషయం తెలిసింది. ఈ బ్రహ్మాండమైన కార్యక్రమానికి సంబంధించిన తాజా సమాచారం ఇది చెన్నైలోని చేపాక్ స్టేడియంలో కనులవిందుగా జరగనుంది. ఇందులో సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,నాగార్జున, మలయాళ సూపర్‌స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ ప్రముఖ కళాకారులు పాల్గొననున్నారు.
ఈ స్టార్ క్రికెట్ క్రీడలో 8 జట్లు పోటీ పడనున్నాయి. ఒక్కో జట్టులో ఆరుగురు నటులు చొప్పున 48 మంది ఆడనున్నారు. వీటికి నటుడు సూర్య, విశాల్, ఆర్య, దనుష్, జీవా, విష్ణు ఒక్కో జట్టుకు ఒక్కొక్కరు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.ఈ జట్టులకు చెన్నై, మదురై, తిరుచ్చి అంటూ ఊర్ల పేర్లను పెట్టనున్నారు.ఇందులో సూపర్‌స్టార్ రజనీకాంత్ వయసు రీత్యా ఏ జట్టులో పాల్గొనక పోయినా తొలి బంతిని వేసి క్రీడను ప్రారంభించనున్నారు.
కమలహాసన్ ఒక జట్టులో ఆడనున్నారు. ఇక ఒక్కో జట్టుకు ఒక్కో అగ్ర కథానాయకి అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. అలా అందాల భామలు నయనతార, త్రిష, అనుష్క, కాజల్‌అగర్వాల్, సమంత వీక్షకుల్ని అలరించనున్నారు. ఈ స్టార్ క్రికెట్ క్రీడలో తొలి ఆట గెలిచిన వారు క్వార్టర్ ఫైనల్‌కు అందులో గెలిచిన జట్టు సెమీఫైనల్, అందులో గెలుపొందిన వారు ఫైనల్‌లో పోటీ పడనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ క్రీడ జరగనుంది. ఇప్పటికే సినీ కళాకారులందరూ విధిగా ఇందులో పాల్గొనాలని సంఘ నిర్వాహకం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీలో ప్రఖ్యాత నటీనటులందరూ పాల్గొననునందున గట్టి భద్రతకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నగర పోలీస్‌కమిషనర్, ఎన్నికల కమిషనర్‌ను సంఘ నిర్వాహకులు కలిసి అనుమతి కోరుతూ విన్నపం పత్రాన్ని అందించారు.