ఓట్ల లెక్కింపు శిక్షణ ప్రారంభం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల తలరాతలను తేల్చేందుకు ఈనెల 16న జరగాల్సిన ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతోంది. ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపుపై మూడురోజుల శిక్షణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రవీణ్‌కుమార్ సోమవారం ప్రారంభించారు. రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు వివిధ పార్టీలు పోటీపడ్డాయి. గత నెల 24వ తేదీన పోలింగ్ ముగియగా ఈనెల 16న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సుమారు 16 వేల మంది సిబ్బందిని ఈ పనులకు నియమించారు.
ఈవీఎంలను ఎలా తెరవాలి, లెక్కింపు ఎలా ప్రారంభించాలి, రెండవసారి ఎలా ధృవీకరించుకోవాలి, రౌండ్ల వారీగా వివరాలను ఎలా నమోదు చేసుకోవాలి, విజేతకు ధృవీకరణ పత్రం ఎలా అందజేయాలనే అంశాలపై ఈవీఎంను చేతపుచ్చుకుని వివరించారు. 77 మందికి నాలుగుదశల్లో శిక్షణ నిచ్చారు. ఈనెల 7వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు సాగుతాయి. తొలినాటి కార్యక్రమంలో శిక్షణ పొందిన 308 మంది అధికారులు త మ పరిధిలో పనిచేసే కింది స్థాయి సిబ్బందికి నేర్పిస్తారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, 8 జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు నాలుగు షిప్టుల్లో శిక్షణ నిచ్చినట్లు తెలిపారు.
లెక్కింపు విధులకు అధికారుల నియూమకంపై వారంరోజుల ముందుగా నిర్ణయం తీసుకుంటామని, ఎవరెవరు, ఏ బాధ్యతలు నిర్వర్తించాలో లెక్కింపునకు ముందురోజు అంటే ఈనెల 15న లాటరీ విధానంలో నిర్ణయిస్తామన్నారు. ఏ టేబుల్‌పై ఎవరు బాధ్యతలు నిర్వర్తించాలో 16న తెల్లవారుజాము 5 గంటలకు లాటరీ పద్ధతి ద్వారానే ఎంపిక చేస్తామని తెలిపారు. రాజకీయ జోక్యాలకు తావులేకుండా ఈ పద్ధతిని అవలంభిస్తున్నామని చెప్పారు. 7 గంటలకు ఏజెంట్లు విధులకు హాజరుకావాలి, 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, 8.30 గంటలకు సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అయన వివరించారు. నుంగంబాక్కంలో జరిగిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ప్రధానాధికారులు, ఎన్నికల నిర్వహణాధికారులు, నియోజకవర్గ అధికారులు, పర్యవేక్షణాధికారులు తదితర 8 కేటగిరిలకు చెందిన 77 మంది అధికారులు తొలినాటి శిక్షణలో పాల్గొన్నారు.