35 పాఠశాలల్లో ‘మధురాన్నం’
తాడేపల్లిగూడెం: గోదావరి విద్యావికాస చైతన్య సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుంచి జిల్లాలోని 35 పాఠశాలల్లో మధురాన్నం పథకాన్ని ప్రారంభించనున్నట్టు సొసైటీ చైర్మన్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం విలేకరులకు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతోపాటు 35 ప్రభుత్వ పాఠశాలల్లో 15 వేల మంది విద్యార్థులకు మధురాన్నం పథకంలో భాగంగా పోషకాహారం అందిస్తామనిచచెప్పారు. మధురాన్నం పేరుతో మధ్యాహ్న భోజనాన్ని నూరుశాతం నాణ్యతతో వేడిగా విద్యార్థులకు అందిస్తామన్నారు. వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్లు అందిస్తామనిచచెప్పారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని భారతీయ విద్యాభవన్స్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక వంటశాల నుంచి మధురాన్నం సరఫరా చేస్తామన్నారు. స్టీమ్ కుక్కింగ్ ద్వారా పూర్తి పరిశుభ్రత గల వాతావరణంలో వంటలు వండుతామన్నారు. భోజన సరఫరా కోసం ఎనిమిది వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. పెదతాడేపల్లి విద్యాభవన్స్ నుంచి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలకు ఉదయం 10.30 నిమిషాల నుంచి మ«ధ్యాహ్నం 12 గంటలలోపు ఆహార పదార్థాలు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ పథకం అమలుకు సంబంధించి కలెక్టర్‌తో ఒప్పందం కుదిరిందన్నారు. పథకం అమలుకోసం వంద మంది సిబ్బందిని నియమించామని చెప్పారు. మధురాన్నంతో పాటు పథకం అమలు జరిగే పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామన్నారు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల ద్వారా ఆయా పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు , దాతల సహకారంతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, నల్లజర్ల, ఇరగవరం, అత్తిలి, భీమవరం మండలాల్లో పాఠశాలలకు తొలివిడతగా మధురాన్నరం పథకం అమలు చేస్తామని వివరించారు.