ఆటను చూద్దాం రండి
- రేపటి నుంచే జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నీ
- హాజరుకానున్న సౌతిండియా జట్లు
- ఇదో పండుగలాంటిదన్న ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్
అనంతపురం సప్తగిరి సర్కిల్: జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు అనంత క్రీడా గ్రామం వేదికగా నిలవనుంది. గతేడాది రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన అనంత క్రీడా గ్రామం ఈ ఏడాది మరో ముందడుగు వేసింది. అండర్–14 (సబ్–జూనియర్) క్రీడా పోటీలను అనంతలో నిర్వహించనున్నారు.
అన్ని అంశాల పరిశీలన
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఐఫా) నిబంధనల మేరకు క్రీడా మైదానం, క్రీడాకారులకు అందాల్సిన వసతులు, ఫుట్‌బాల్ క్రీడా మైదానం ఏర్పాట్లు, గోల్‌పోస్టు, అంబులెన్స్, వైద్య సిబ్బంది, మరుగుదొడ్లు, గదులు తదితర అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ఆర్డీటీ సంస్థకు ఈ ఏడాది జాతీయస్థాయి టోర్నీని నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు. ఆర్డీటీ, అనంతపురం జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్లు సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించనున్నారు. సౌత్‌జోన్ స్థాయి ఫుట్‌బాల్ జట్లు ఈ పోటీల్లో తలపడనున్నాయి.
3 నుంచి పోటీలు
అనంతలో జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించడం ఇదే ప్రథమం.
ఈ పోటీల ఈ నెల 3 నుంచి 8వ తేది వరకు అనంత క్రీడా గ్రామంలో జరగనున్నాయి.
మ్యాచ్‌ల వివరాలు
03–09–2017 తమిళనాడు–తెలంగాణ
04–09–2017 కేరళ–పాండిచ్చేరి
05–09–2017 తెలంగాణ–కర్ణాటక
06–09–2017 పాండిచ్చేరి–ఆంధ్రప్రదేశ్
07–09–2017 కర్ణాటక–తమిళనాడు
08–09–2017 ఆంధ్రప్రదేశ్–కేరళ
చాలా సంతోషంగా ఉంది - నాగరాజు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి
మొదటిసారి జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నీకి అనంత వేదికగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఆర్డీటీ ఫుట్‌బాల్ అకాడమీకి ఈ ఏడాది టూ స్టార్ హోదా లభించింది. ఇది కూడా ఈ టోర్నీకి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టోర్నీలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ఐ–లీగ్ పోటీలకు ఇప్పటి నుంచే మంచి తర్ఫీదును అందిస్తాం.
అన్ని సదుపాయలు కల్పించాం - నిర్మల్‌కుమార్, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్
టోర్నీకి వచ్చే క్రీడాకారులకు, కోచ్‌లకు, రెఫరీ, ఇతర ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులకు ఎకాలజీ సెంటర్లో 25 గదులను అందించాం. ఇతర సదుపాయాలను కూడా అందిస్తున్నాం. అన్ని వేళలా వారికి క్రీడా మైదానాన్ని అందుబాటులో ఉంచుతాం. క్రీడా మైదానంలో అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ ద్వారా నీటిని, ఫుల్ గ్రౌండ్ గ్రాస్‌ను పరిచాం. గోల్ పోస్టును సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాం.
ఇదో పండుగ లాంటిది - మాంచో ఫెర్రర్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్
ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఇదో పండుగ లాంటిది. జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలను నిర్వహించడం జిల్లా క్రీడాకారులకు శుభపరిణామం. ఈ ఏడాది అనంత క్రీడా గ్రామం వేదికగా అనేక కార్యకలాపాలను చేపట్టాం. న్యూజిలాండ్ జట్టు టోర్నీని, దివ్యాంగుల వరల్డ్‌కప్ మ్యాచ్‌ను, అండర్–16 బాలికల అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీని అనంత వేదికగా నిర్వహించాం. ఏషియన్ ఫుట్‌బాల్ కన్సడ్రేషన్ (ఐఎఫ్‌సీ) అందించిన సూచనలను పాటించి క్రీడా మైదానంలో మార్పులు చేశాం. మరిన్ని టోర్నీలకు వేదికగా అనంతను నిలిపేందుకు కృషి చేస్తాం.