starvation death
-
పట్టెడన్నం పెట్టేవారు లేక.. వృద్ధ దంపతుల ఆకలిచావు?
సాక్షి, మంచిర్యాల: అందరూ ఉన్నా.. మలి సంధ్యలో తినడానికి తిండి లేక పది రోజులపాటు ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ∙సంఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం లో శనివారం జరిగింది. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బియ్యాల రాజయ్య (70), మల్లక్క(63) దంపతులకు ఇద్దరు కుమారులు మల్లేశ్, రవి ఉన్నారు. ఇద్దరికీ వివాహం అయింది. ఆస్తి పంపకాలు కూడా జరిగాయి. రాజయ్యకు ఆరేళ్ల క్రితం పక్షవాతం రావడంతో మంచానికే పరిమితయ్యాడు. భార్య మల్లక్క కూడా నెల క్రితం మంచాన పడింది. తల్లిదండ్రులను చూసుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. పెద్దమనుషులు పంచాయితీలు నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ కూడా వెళ్లారు. ఈ క్రమంలో గొడవల కారణంగా ఏప్రిల్ 30న చిన్న కుమారుడు రవి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఆత్మహత్యతో పెరిగిన గొడవలు రవి ఆత్మహత్య తర్వాత కుటుంబంలో గొడవలు మరింత పెరిగాయి. రవి భార్య స్వప్న స్థానిక పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుతో అప్పటి ఎస్సై దత్తాత్రితోపాటు సర్పంచ్ రాజేశం, మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరువాత ఇంట్లో జరుగుతున్న గొడవల కారణంగా పెద్ద కొడుకు మల్లేశ్ గ్రామం నుంచి వెళ్లిపోయి రంగపేటలో ఉంటున్నాడు. దీంతో వృద్ధుల బాగోగులు చూసుకునేవారు కరువయ్యా రు. కొద్దిరోజుల క్రితం మల్లేశ్ వచ్చి తల్లిదండ్రులకు స్నానం చేయించి ఆహారం పెట్టాలని ఇంటిపక్కన సమీప బంధువుకు చెప్పి వెళ్లాడు. అయితే, ఆ బంధువుకు జ్వరం రావడంతో ఆయన వృద్ధుల వద్దకు వెళ్లలేదు. ఈ క్రమంలో ఆకలికి అలమటించి శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఎస్సై చంద్రశేఖర్, ఏఎస్సై రాజేందర్ పరిశీలించారు. బాధ్యులపై చర్య తీసుకోవాలి.. తన తల్లిదండ్రులను కొంతమంది వ్యక్తులు చంపినట్లు అనుమానం ఉందని, మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దకొడుకు మల్లేశ్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. -
ఘోరం: తండ్రికి తిండి పెట్టకుండా చంపేశాడు
పస్తులుండి మరీ పిల్లల కడుపు నింపే తల్లిదండ్రులు ఎందరో! కన్నబిడ్డలను పోషించేందుకు ఒళ్లు హూనం చేసుకునే అమ్మానాన్నలు ఎందరో! పిల్లలు బాగుంటే అదే పదివేలు అని జీవితాంతం కష్టపడే అభాగ్య తల్లిదండ్రులు చివరికి అందరూ ఉన్న అనాథలుగా మారుతున్నారు. మలి వయసులో వారికి అండగా నిలవాల్సిన పిల్లలు రాక్షసులై వేధిస్తున్నారు. బుక్కెడు తిండి పెట్టేందుకు చిటపటలాడుతున్నారు. ఓ చోట కన్నకొడుకే తండ్రికి అన్నం పెట్టకుండా ఆయన కడుపు మాడ్చి చంపిన దారుణ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తిరువనంతపురం: కేరళలోని ముండాయక్కమ్‌కు చెందిన పొడియాన్(80), యామిని(76) వృద్ధ దంపతులు తన కొడుకు రేజీతో కలిసి నివసిస్తున్నారు. తాగుడుకు బానిసైన రేజీ నిత్యం తల్లిదండ్రులతో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో అతడు తన తల్లిదండ్రులను గదిలో బంధించి తిండి పెట్టకుండా హింసించాడు. ఇరుగు పొరుగు కూడా వారికి ఆహారం అందించకుండా ఉండేందుకు ఆ గదిలో కుక్కను కట్టేశాడు. దీంతో ముసలి జంటను దుస్థితి తెలిసి వారికి సాయం చేద్దామన్నా కుక్క ఉండటంతో ఎవరూ వారి దగ్గరకు కూడా వెళ్లలేకపోయారు. (చదవండి: భార్యకు రెండు పెళ్లిళ్లు.. అనుమానంతో హత్య) పిడికెడు మెతుకులు కూడా కడుపులో పడకపోవడంతో డొక్క లోపలకు పోయి తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. వాళ్ల దయనీయ పరిస్థితిని చూసి కొందరు ఆశా కారక్యర్తలకు సమాచారం అందించారు. మంగళవారం నాడు వారు పోలీసులను వెంట పెట్టుకుని రాగా దంపతులను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పొడియాన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ప్రాణాలు విడిచాడు. పోస్టుమార్టం నివేదికలోనూ అతడికి తిండి లేక అంతర్గత అవయవాలు దెబ్బతిని మరణించాడని తేలింది. మరోవైపు అతడి భార్య ఇంకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రేజిని అరెస్టు చేశారు. (చదవండి: మెయిల్ ఓపెన్ చేస్తే జేమ్స్ అధీనంలోకి వెళ్లడమే!) -
చిన్నారుల ఆకలి మరణం : హక్కుల కమిషన్ సీరియస్!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆకలితో అలమటిస్తూ ముగ్గురు చిన్నారుల మరణంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. తూర్పు ఢిల్లీలోని మందవాలి ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు వారు కొద్దిరోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోనట్టు వైద్యులు గుర్తించారు. ఎనిమిది, నాలుగు, రెండు సంవత్సరాల బాలికలను ఆమె తల్లి మంగళవారం మధ్యాహ్నం మయూర్విహార్లోని ఎల్బీఎస్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. చిన్నారులు అప్పటికే మరణించారని ఆస్పత్రి వర్గాలు నిర్ధారించాయి. చిన్నారులు గత వారం రోజులుగా ఏమీ తినలేదని వారి అటాప్సీ నివేదికలు వెల్లడించాయని వైద్యులు తెలిపారు. చిన్నారుల శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, క్షుద్బాధతోనే వారు మరణించారని ఎల్బీఎస్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అమితా సక్సేనా చెప్పారు. చిన్నారుల కడుపు, బ్లాడర్, జీర్ణాశయ వ్యవస్థలు ఖాళీగా ఉన్నాయని పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడైందని తెలిపారు. అయితే చిన్నారులు డయేరియా కారణంగా వాంతులు చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చిన్నారుల తండ్రి రిక్షా నడుపుతాడని, ఇటీవల కొందరు అతడి రిక్షా తీసుకునివెళ్లడంతో వేరే పని కోసం ప్రయత్నించేందుకు ఇల్లు విడిచివెళ్లాడని స్ధానికులు చెప్పారు. మరోవైపు చిన్నారుల తల్లి మానసిక వికలాంగురాలని తెలిసింది. -
మూడు రోజలుగా ఆహారం లేక..
సాక్షి, రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. మూడు రోజులుగా ఆహారం లేక 58 సంవత్సరాల మహిళ మరణించిన ఘటన గిరిధ్ జిల్లా దుమ్రీ బ్లాక్‌లోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. మంగరగాడి గ్రామానికి చెందిన సావిత్రి దేవి అనే మహిళ శనివారం ఆకలిచావుకు గురైందని, ఆమె చిన్న కుమారుడు ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాతే ఘటనపై సమాచారం అందించారని అధికారులు తెలిపారు. బాధిత మహిళ కుటుంబానికి రేషన్ కార్డు లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. సావిత్రి దేవి మృతిపై విచారణ చేపట్టారు. ఆదివారం సాయంత్రం తాము బాధితురాలి ఇంటిని సందర్శించామని, ఈ ఘటనపై అధికార యంత్రాంగం సకాలంలో తమకు సమాచారం అందించలేదని ఎగ్జిక్యూటివ్ మేజిస్ర్టేట్ రాహుల్ దేవ్ తెలిపారు. ఆమె ఇంటిలో కొద్దిరోజులుగా ఆహారం లేదని, ఆ కుటుంబానికి రేషన్ కార్డు కూడా లేదని వెల్లడైందన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా అనే దానిపై విచారిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డు ఎందుకు మంజూరు కాలేదో ఆరా తీస్తామన్నారు. బాధిత మహిళ సహా కుటుంబ సభ్యులెవరూ ఇతర ప్రభుత్వ పథకాల్లో ఎందుకు లబ్ధి పొందలేదో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. సావిత్రి దేవి పెద్ద కోడలు రెండు నెలల కిందట తన రేషన్ కార్డు దరఖాస్తు వెరిఫికేషన్ కోసం తమ వద్దకు వచ్చిందని, మరి దాన్ని బ్లాక్ ఆఫీస్‌లో అందచేశారో లేదో తనకు తెలియదని గ్రామ సర్పంచ్ రామ్ ప్రసాద్ మహతో పేర్కొన్నారు. ఎనిమిది రోజుల కిందట సావిత్రి దేవి కోడలు తమ ఇంట్లో ఆహార ధాన్యాలు లేవని చెప్పడంతో తాము సర్ధుబాటు చేశామని స్వయం సహాయక బృంద సభ్యురాలు సునీతా తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మరికొంత ఆహార ధాన్యాలు ఇవ్వాలని భావిస్తుండగా ఈ లోగానే సావిత్రిదేవి మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు తాము సమకూర్చిన ఆహార ధాన్యాలు సరిపోలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు సావిత్రి మృతిపై జార్ఖండ్ ఆహార, పౌరసరఫరాల మంత్రి సరయూ రాయ్ సవివర నివేదిక సమర్పించాలని డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. -
వృద్ధ వికలాంగుడి ఆకలిచావు
వనపర్తి రూరల్: ఓ వృద్ధ వికలాంగుడు ఆకలి చావుకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం కడుకుంట్లలో జరిగింది. గ్రామానికి చెందిన తలారి లక్ష్మయ్య (70) వికలాంగుడు కావడంతో ఏ పనీ చేయలేక ఇంటివద్దే ఉండేవాడు. ఉన్న ఇద్దరు కూతుళ్లు అత్తారింటికి, కుమారుడు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వె ళ్లగా, భార్య మూడేళ ్లక్రితమే మృతి చెందింది. అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా జీవిస్తుండడంతో కాలనీవాసులు ఆయన పరిస్థితిని చూసి అప్పుడప్పుడు అన్నం పెట్టేవారు. కొంతకాలంగా సమయానికి భోజనం వండిపెట్టే వారు లేక నీరసంగా కనిపించేవాడు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా కావడం, ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. చివరకు బుధవారం సాయంత్రం మృతిచెందాడు. గురువారం ఉదయం విషయం వెలుగులోకి వచ్చింది. -
వృద్ధ వికలాంగుడి ఆకలిచావు
వనపర్తి : గత కొన్ని రోజులుగా సక్రమంగా ఆహారం లేక ఒంటరిగా నివాసం ఉంటున్న ఓ వృద్ధవికలాంగుడు ఆకలితో మృత్యుఒడికి చేరిన హృదయ విదారక సంఘటన గురువారం కరీంనగర్ జిల్లా వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి లక్ష్మయ్య(70) అనే వృద్ధుడు వికలాంగుడు కావటంతో పని చేయలేక ఇంటివద్దే ఉండేవారు. భార్య మూడేళ్ల క్రితం మృతి చెందటం, కుమారుడు బుచ్చన్న జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లడంతో గ్రామంలోని తన సొంత ఇంట్లో ఒంటరిగా ఉండేవారు. కొడుకు బుచ్చన్న తండ్రిని తనతో పాటు హైదరాబాద్‌కు రమ్మని పిలిచినా తనకు చిన్ననాటి నుంచి అలవాటైన స్వగ్రామాన్ని విడిచి రానని తేల్చి చెప్పాడు. సమయానికి భోజనం వండిపెట్టే వారు లేక గత కొంత కాలంగా లక్ష్మయ్య నీరంగా కనిపించే వారని గ్రామస్తులు తెలిపారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళలు వృద్ధుడి నీరసాన్ని గమనించి కొంత అన్నం పెడితే తినేవారని, అన్నం పెట్టమని అడగలేని ఆత్మగౌరవం గల వ్యక్తి లక్ష్మయ్య అని గ్రామస్తులు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువకావటం, ఆహారం తీసుకోకపోవటంతో మృతుని ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం అతని పరిస్థితిని చూసిన చుట్టుపక్కల వారు పాలు తాగించేందుకు ప్రయత్నించగా వృద్ధుడు పాలు తాగుతూనే ప్రాణాలు వదిలేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది పరామర్శించిన ఎమ్మెల్యే విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి. చిన్నారెడ్డి ఆహారంలేక మృతి చెందిన లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. వృద్ధులైన తల్లితండ్రులను వెంటే ఉంచుకోవాలన్నారు. మృతుని కుటుంబానికి ఎన్ఎఫ్బీఎస్ తక్షణ సాయం రూ. 5 వేల అందజేయాలని తహశీల్దార్‌కు సూచించారు.