సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆకలితో అలమటిస్తూ ముగ్గురు చిన్నారుల మరణంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. తూర్పు ఢిల్లీలోని మందవాలి ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు వారు కొద్దిరోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోనట్టు వైద్యులు గుర్తించారు. ఎనిమిది, నాలుగు, రెండు సంవత్సరాల బాలికలను ఆమె తల్లి మంగళవారం మధ్యాహ్నం మయూర్‌విహార్‌లోని ఎల్‌బీఎస్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. చిన్నారులు అప్పటికే మరణించారని ఆస్పత్రి వర్గాలు నిర్ధారించాయి. చిన్నారులు గత వారం రోజులుగా ఏమీ తినలేదని వారి అటాప్సీ నివేదికలు వెల్లడించాయని వైద్యులు తెలిపారు.
చిన్నారుల శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, క్షుద్బాధతోనే వారు మరణించారని ఎల్‌బీఎస్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అమితా సక్సేనా చెప్పారు. చిన్నారుల కడుపు, బ్లాడర్, జీర్ణాశయ వ్యవస్థలు ఖాళీగా ఉన్నాయని పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడైందని తెలిపారు. అయితే చిన్నారులు డయేరియా కారణంగా వాంతులు చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చిన్నారుల తండ్రి రిక్షా నడుపుతాడని, ఇటీవల కొందరు అతడి రిక్షా తీసుకునివెళ్లడంతో వేరే పని కోసం ప్రయత్నించేందుకు ఇల్లు విడిచివెళ్లాడని స్ధానికులు చెప్పారు. మరోవైపు చిన్నారుల తల్లి మానసిక వికలాంగురాలని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment