NHRC notice
-
అచ్యుతాపురం ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్.. ఏపీ సర్కార్‌కు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: అచ్యుతాపురం సెజ్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీ.. డీజీపీ, చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యాజమాన్యం నిర్లక్ష్యం తదితర అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.కాగా, విశాఖలోని అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రియాక్టర్ పేలిపోయిన ఘటనలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరిచింది. దుర్ఘటన తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితులను హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం తరలించకపోవడం... వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం... శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేయకపోవడం.. ఇలా ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించింది.ఏదైనా దుర్ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకున్న సమయాల్లో బాధిత కుటుంబాలకు సమాచారం అందించి భరోసా కల్పించేందుకు హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చి సహాయక చర్యలు, ఇతర ముఖ్య సమాచారాన్ని అందిపుచ్చుకునే వ్యవస్థను తేవడం పరిపాటి. అయితే తాజా ఘటనలో అలాంటి చర్యలేవీ లేకపోగా కూటమి సర్కారు స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది. -
నరబలి ఘటన: కేరళ ప్రభుత్వానికి నోటీసులు
న్యూఢిల్లీ: కేరళ నరబలి ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ కేరళ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై మీడియా కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించింది. నాగరిక సమాజంలో ఇలాంటి దారుణాలను ఊహించలేమని పేర్కొంది. చట్టాలంటే ఏమాత్రం భయంలేకుండా మూఢనమ్మకంతో మనుషులను చంపడం చాలా ఘోరమని పేర్కొంది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో.. డబ్బు దొరుకుతుందనే ఆశతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. అయితే.. ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముగ్గురు నిందితులు(దంపతులతో సహా) నేరాన్ని అంగీకరించడంతో పాటు అవశేషాలు దొరక్కపోవడంపై పోలీసులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇదీ చదవండి: Kerala Human Sacrifice Case: డబ్బుపై అత్యాశతోనే నరబలి.. చంపేసి ముక్కలు చేసి తిన్నారా? -
సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా.. నాగరాజు హత్య కేసుపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి(సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నోటీసులు పంపింది. సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా శుక్రవారం ఆదేశించింది. ఇక ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తమ దృష్టికొచ్చిందని, అయితే పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఇలాంటి ఘటనలు అరాచకత్వానికి నిదర్శమని, ఇది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. మతాంతర, కులాంతర వివాహాలు జరిగినప్పుడు పరువుహత్యలు జరగకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏదైనా విధానం ఉందా? అంటూ చీఫ్ సెక్రటరీని కమిషన్ ప్రశ్నించింది. సీఎస్ తన నివేదికలో ఈ అంశంపై బదులివ్వాలని పేర్కొంది. ఈ హత్యోదంతం దర్యాప్తు స్థితిగతులు, బాధిత కుటుంబానికి కల్పిస్తున్న భద్రత, దర్యాప్తులో అధికారుల నిర్లక్ష్యం ఏదైనా ఉంటే అలాంటివారిపై తీసుకున్న చర్యల గురించి నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. చదవండి: సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన గవర్నర్ తమిళిసై -
ఏ మాత్రం జాలి, దయ లేకుండా..
చెన్నై: ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి ఒకరు ఓ రోగిని వీల్ చైర్లోంచి కిందపడేసిన సంఘటనపై తమిళనాడు రాష్ట్ర మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ఈ మేరకు సోమవారం వైద్య, గ్రామీణ ఆరోగ్య సేవల డైరెక్టర్‌కు నోటీసు పంపింది. కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇన్-పేషెంట్ వార్డులో ఈ సంఘటన జరిగింది. వీడియోలో ఓ పేషెంట్.. హాస్పిటల్ ఉద్యోగి బాస్కరన్(40)ను, తన మంచం మీదకు వెళ్లడానికి సహాయం చేయమని కోరతాడు. కానీ బాస్కరన్ స్పందించడు. పేషెంట్ పదే పదే ప్రాధేయపడటంతో సదరు ఉద్యోగిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటిది. ఏ మాత్రం జాలి, దయ లేకుండా ఆ పేషెంట్‌ను వీల్ చైర్లో నుంచి కిందకు పడేస్తాడు. పాపం ఆ వ్యక్తి మంచం మీదకు ఎక్కడానికి నానా అవస్థలు పడతాడు. అంతేకాక బాస్కరన్ అతడిని తిట్టడం వీడియలో చూడవచ్చు. ఈ తతంగాన్ని మరో పేషెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు ఉద్యోగితో పాటు ఆస్పత్రి యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం అవుతోంది. (5 రూపాయల డాక్టర్ ఇకలేరు) Watch | Tamil Nadu government hospital employee pushes patient from wheel-chair, viral video leads to action. pic.twitter.com/Y3d5yRbbBb — The Indian Express (@IndianExpress) August 18, 2020 అంతేకాక దీని గురించి ఓ తమిళపత్రికలో వార్తా కథనం ప్రచురితమయ్యింది. ఈ క్రమంలో ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించి.. నోటిసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మూడు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆలస్యం చేస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనిపై ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యుడైన ఉద్యోగిని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. -
యువతికి నిప్పంటించిన కీచకుడు
పట్నా: బిహార్‌లో యువతిపై మరో అకృత్యం చోటుచేసుకుంది. అత్యాచారం చేయబోతుండగా ప్రతిఘటించినందుకు 23 ఏళ్ల ఆ యువతికి ఓ కీచకుడు నిప్పంటించాడు. బిహార్‌లోని అహియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని వెంటనే ముజఫరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. 85 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఆ యువతి కోమాలో కొట్టుమిట్టాడుతోంది. గత మూడేళ్లుగా తమ కుమార్తెను నిందితుడు వేధిస్తున్నాడని ఆమె తల్లి చెప్పింది. తాజా ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్‌చేశారు. ఈ ఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బిహార్ ప్రభుత్వానికి సోమవారం నోటీసులు ఇచ్చింది. దర్యాప్తు వివరాలను నాలుగు వారాల్లోగా తమకు తెలపాల్సిందిగా కోరింది. ఈ నోటీసులను రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీలకూ పంపింది. -
బిహార్‌లో హాహాకారాలు
ముజఫర్‌పూర్/ పట్నా / న్యూఢిల్లీ: బిహార్‌ను మెదడువాపు వ్యాధి వణికిస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నారులను ఈ మహమ్మారి బలి తీసుకుంటోంది. సోమవారం ఈ వ్యాధితో ముజఫర్‌పూర్‌లో ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు ఈ వ్యాధి బారినపడి మరణించిన వారి సంఖ్య 103కు చేరినట్లు శ్రీ కృష్ణ వైద్య కళాశాల, ఆస్పత్రి (ఎస్‌కేఎంసీహెచ్) సూపరింటెండెంట్ సునీల్ కుమార్ షాహి సోమవారం తెలిపారు. ఇలావుండగా ఎస్‌కేఎంసీహెచ్ ఆస్పత్రిలో రాత్రివేళ వైద్యులు అందుబాటులో ఉండటం లేదని రోగుల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్‌కేఎంసీహెచ్‌లో సౌకర్యాలే లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బిహార్‌లో సైతం సోమవారం డాక్టర్లు సమ్మె చేయడంతో వైద్య సేవలు స్తంభించాయి. మరణాలపై సీఎం నితీశ్‌కుమార్ స్పందించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బిహార్‌లో చిన్నారుల మరణాలపై వివరణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు, బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. -
మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అయిదుగురు మానవహక్కుల కార్యకర్తల అరెస్టులను సుమోటోగా స్వీకరించిన కమిటీ మహారాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపికి నోటీసులు జారీ చేసింది. ఐదుగురు కార్యకర్తల అరెస్టు వ్యవహారంలో ప్రామాణిక పద్ధతులను అనుసరించలేదని ఆరోపించింది. ఇది వారి మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ మొట్టికాయలేసింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లో 'వాస్తవ నివేదిక' సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ కోరింది. దేశవ్యాప్తంగా అయిదు రాష్ట్రాల్లోని పలునగరాల్లో మానవహక్కుల కార్యకర్తల అరెస్టులపై నివేదికలను హక్కుల సంఘం పరిశీలించిన తరువాత నోటీసులు పంపించామని జాతీయ మానవ హక్కుల కమిషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పుణే పోలీసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మానవ, దళిత హక్కుల కార్యకర్తలపై ఇళ్లపై ఆకస్మిక దాడులు, అరెస్టులు కలకలం రేపాయి. విప్లవ కవి వరవరరావు, అరుణ ఫెరారి, వెర్నాన్ గోన్సాల్వేస్, రోనా విల్సన్, న్యాయవాది సురేంద్ర, సుధా భరద్వాజ్, గౌతం నావ్‌లాఖ్ ఇళ్లపై సోదాలు నిర్వహించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అరెస్టులకు నిరసనగా దేశ వ్యాప్తంగా వివిధ ప్రజల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. మరోవైపు విరసం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. ప్రమఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్‌ను ఖండిస్తూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
చిన్నారుల ఆకలి మరణం : హక్కుల కమిషన్ సీరియస్!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆకలితో అలమటిస్తూ ముగ్గురు చిన్నారుల మరణంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. తూర్పు ఢిల్లీలోని మందవాలి ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు వారు కొద్దిరోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోనట్టు వైద్యులు గుర్తించారు. ఎనిమిది, నాలుగు, రెండు సంవత్సరాల బాలికలను ఆమె తల్లి మంగళవారం మధ్యాహ్నం మయూర్విహార్లోని ఎల్బీఎస్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. చిన్నారులు అప్పటికే మరణించారని ఆస్పత్రి వర్గాలు నిర్ధారించాయి. చిన్నారులు గత వారం రోజులుగా ఏమీ తినలేదని వారి అటాప్సీ నివేదికలు వెల్లడించాయని వైద్యులు తెలిపారు. చిన్నారుల శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, క్షుద్బాధతోనే వారు మరణించారని ఎల్బీఎస్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అమితా సక్సేనా చెప్పారు. చిన్నారుల కడుపు, బ్లాడర్, జీర్ణాశయ వ్యవస్థలు ఖాళీగా ఉన్నాయని పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడైందని తెలిపారు. అయితే చిన్నారులు డయేరియా కారణంగా వాంతులు చేసుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చిన్నారుల తండ్రి రిక్షా నడుపుతాడని, ఇటీవల కొందరు అతడి రిక్షా తీసుకునివెళ్లడంతో వేరే పని కోసం ప్రయత్నించేందుకు ఇల్లు విడిచివెళ్లాడని స్ధానికులు చెప్పారు. మరోవైపు చిన్నారుల తల్లి మానసిక వికలాంగురాలని తెలిసింది. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ బుధవారం నోటీసులు ఇచ్చింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తూ సాంబారు పాత్రలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కాగా ఒకటో తరగతి చదువుతున్న బల్కూరి జయవర్ధన్(5) శుక్రవారం (డిసెంబర్ 23) మధ్యాహ్న భోజనం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులంతా వరుసలో నిలుచున్నారు. ఈ క్రమంలో వెనుకనున్న విద్యార్థులు తోసుకోవడంతో ముందున్న జయవర్ధన్ ఒక్కసారిగా వేడి సాంబారు ఉన్న పాత్రలో పడిపోయాడు. దీంతో తల, ముఖ భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధ్యాయులు వెంటనే స్పందించి అతడిని చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయవర్థన్ శనివారం ఉదయం మృతి చెందాడు.