
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా.. నాగరాజు హత్య కేసుపై ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి(సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నోటీసులు పంపింది.
సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా శుక్రవారం ఆదేశించింది. ఇక ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తమ దృష్టికొచ్చిందని, అయితే పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఇలాంటి ఘటనలు అరాచకత్వానికి నిదర్శమని, ఇది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అని ఎన్‌హెచ్ఆర్సీ పేర్కొంది.
మతాంతర, కులాంతర వివాహాలు జరిగినప్పుడు పరువుహత్యలు జరగకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏదైనా విధానం ఉందా? అంటూ చీఫ్ సెక్రటరీని కమిషన్ ప్రశ్నించింది. సీఎస్ తన నివేదికలో ఈ అంశంపై బదులివ్వాలని పేర్కొంది. ఈ హత్యోదంతం దర్యాప్తు స్థితిగతులు, బాధిత కుటుంబానికి కల్పిస్తున్న భద్రత, దర్యాప్తులో అధికారుల నిర్లక్ష్యం ఏదైనా ఉంటే అలాంటివారిపై తీసుకున్న చర్యల గురించి నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించింది.
చదవండి: సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన గవర్నర్ తమిళిసై
Comments
Please login to add a commentAdd a comment