
అచ్యుతాపురం సెజ్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది.
సాక్షి, ఢిల్లీ: అచ్యుతాపురం సెజ్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. డీజీపీ, చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యాజమాన్యం నిర్లక్ష్యం తదితర అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
కాగా, విశాఖలోని అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రియాక్టర్ పేలిపోయిన ఘటనలో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరిచింది. దుర్ఘటన తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితులను హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం తరలించకపోవడం... వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం... శాఖల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేయకపోవడం.. ఇలా ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించింది.
ఏదైనా దుర్ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకున్న సమయాల్లో బాధిత కుటుంబాలకు సమాచారం అందించి భరోసా కల్పించేందుకు హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చి సహాయక చర్యలు, ఇతర ముఖ్య సమాచారాన్ని అందిపుచ్చుకునే వ్యవస్థను తేవడం పరిపాటి. అయితే తాజా ఘటనలో అలాంటి చర్యలేవీ లేకపోగా కూటమి సర్కారు స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది.
