మూడు రోజలుగా ఆహారం లేక.. | Woman Allegedly Dies Of Starvation Son Says No Food At Home For Three Days | Sakshi
Sakshi News home page

మూడు రోజలుగా ఆహారం లేక..

Published Mon, Jun 4 2018 3:32 PM | Last Updated on Mon, Jun 4 2018 5:10 PM

Woman Allegedly Dies Of Starvation Son Says No Food At Home For Three Days - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. మూడు రోజులుగా ఆహారం లేక 58 సంవత్సరాల మహిళ మరణించిన ఘటన గిరిధ్‌ జిల్లా దుమ్రీ బ్లాక్‌లోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. మంగరగాడి గ్రామానికి చెందిన సావిత్రి దేవి అనే మహిళ శనివారం ఆకలిచావుకు గురైందని, ఆమె చిన్న కుమారుడు ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాతే ఘటనపై సమాచారం అందించారని అధికారులు తెలిపారు. బాధిత మహిళ కుటుంబానికి రేషన్‌ కార్డు లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. సావిత్రి దేవి మృతిపై విచారణ చేపట్టారు. ఆదివారం సాయంత్రం తాము బాధితురాలి ఇంటిని సందర్శించామని, ఈ ఘటనపై అధికార యంత్రాంగం సకాలంలో తమకు సమాచారం అందించలేదని ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ర్టేట్‌ రాహుల్‌ దేవ్‌ తెలిపారు. ఆమె ఇంటిలో కొద్దిరోజులుగా ఆహారం లేదని, ఆ కుటుంబానికి రేషన్‌ కార్డు కూడా లేదని వెల్లడైందన్నారు.

రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా అనే దానిపై విచారిస్తున్నామని చెప్పారు. రేషన్‌ కార్డు ఎందుకు మంజూరు కాలేదో ఆరా తీస్తామన్నారు. బాధిత మహిళ సహా కుటుంబ సభ్యులెవరూ ఇతర ప్రభుత్వ పథకాల్లో ఎందుకు లబ్ధి పొందలేదో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. సావిత్రి దేవి పెద్ద కోడలు రెండు నెలల కిందట తన రేషన్‌ కార్డు దరఖాస్తు వెరిఫికేషన్‌ కోసం తమ వద్దకు వచ్చిందని, మరి దాన్ని బ్లాక్‌ ఆఫీస్‌లో అందచేశారో లేదో తనకు తెలియదని గ్రామ సర్పంచ్‌ రామ్‌ ప్రసాద్‌ మహతో పేర్కొన్నారు.  

ఎనిమిది రోజుల కిందట సావిత్రి దేవి కోడలు తమ ఇంట్లో ఆహార ధాన్యాలు లేవని చెప్పడంతో తాము సర్ధుబాటు చేశామని స్వయం సహాయక బృంద సభ్యురాలు సునీతా తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మరికొంత ఆహార ధాన్యాలు ఇవ్వాలని భావిస్తుండగా ఈ లోగానే సావిత్రిదేవి మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు తాము సమకూర్చిన ఆహార ధాన్యాలు సరిపోలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు సావిత్రి మృతిపై జార్ఖండ్‌ ఆహార, పౌరసరఫరాల మంత్రి సరయూ రాయ్‌ సవివర నివేదిక సమర్పించాలని డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement