బహుళజాతి కంపెనీలకు ఝలక్
* జన్యుమార్పిడి ప్రయోగాలపై అభ్యంతరాలు
* సాంకేతిక సమాచారం కోరిన వ్యవసాయశాఖ
సాక్షి, హైదరాబాద్: జన్యుమార్పిడి పంటలపై ప్రయోగాలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్సీ) చేసుకున్న దరఖాస్తులను రాష్ట్ర వ్యవసాయశాఖ పక్కనపెట్టింది. కంపెనీలు దరఖాస్తుల్లో వెల్లడించిన వివరాలు సంతృప్తి కలిగించకపోవడంతో ఆ శాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రయోగాలు ఎందుకు చేయదలిచారు? ఏ పంటలపై చేస్తారు? రైతులకు కలిగే లాభమేంటి? ప్రయోగించబోయే విత్తన మూలకాలు ఏ లేబరేటరీలో, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో తయారుచేశారు? ఆ విత్తన మూలకాన్ని ఈ రాష్ట్రంలో జన్యుమార్పిడి చేస్తే విషపూరితం కావడానికి అవకాశం ఉందా? లేదా? తదితర సందేహాలను నివృత్తి చేస్తూ సమాచారంతో రావాలని వ్యవసాయశాఖ ఆదేశించింది.
శాస్త్రీయ సమాచారంతో వస్తే అప్పుడు పరిశీలిస్తామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పినట్లు సమాచారం. జన్యుమార్పిడి పంట ప్రయోగాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటికి అనుమతి ఇవ్వకూడదని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. కంపెనీలు సాంకేతిక సమాచారం తీసుకొచ్చినా వాటిపట్ల సంతృప్తి చెందే పరిస్థితి కనిపించడం లేదు. గోధుమలు, వరి, కూరగాయలు వంటి వాటిల్లో జన్యుమార్పిడి ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటికి అనుమతి సంపాదిస్తే తర్వాత పప్పుధాన్యాల్లోనూ దూరిపోవాలనేది బహుళజాతి కంపెనీల యోచనగా తెలుస్తోంది.