వాన ముంచింది
కలెక్టరేట్, న్యూస్‌లైన్: అప్పులు చేసి ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు అకాల వర్షానికి నీటిపాలయ్యాయి. జిల్లాలో ఐదు రోజులపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు చేతికొచ్చే దశలో పంటలకు అపారనష్టం సంభవించింది.
జిల్లావ్యాప్తంగా 1,77,180 ఎకరాలలో పంటలు నీటమునిగాయని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 87,730 ఎకరాల్లో వరి, 89,200 ఎకరాల్లో పత్తి, 125 ఎకరాల్లో మొక్కజొన్న, 125 ఎకరాల్లో సోయాబీన్ పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. మొత్తం 49 మండలా ల్లో పంటలు నీటమునిగినట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు రూపొందించిన ప్రాథమిక నివేదికను వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు నివేదించారు. ఆదివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించా రు.
వర్షాలతో నీటమునిగిన పంటల సర్వేపై ఆరా తీసి అధికారులకు మొట్టికాయ లు వేశారు. ప్రతిసారీ జిల్లా నుంచి నివేదికల సమర్పణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు తగ్గాక రైతుల వారీగా సర్వే చేసి పంటనష్టాన్ని పారదర్శకంగా అంచనా వేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యం లో ఇప్పటివరకు రూపొందించిన ప్రాథమిక నివేదికలలో నష్టం మరింత తగ్గే అవకాశాలున్నాయి. గ్రామాలవారీగా నష్టం పూర్తిస్థాయి లో అంచనా వేయలేని అధికారులు రైతులవారీగా సర్వే చేయడంలో మరింత జాప్యం చేసే అవకాశాలున్నాయి. ఆ సర్వే అనంతరమే పూ ర్తి నష్టం తేలనుంది. వరి, పత్తి పంటలకు హె క్టారుకు రూ.10 వేల చొప్పున పరిహారం కోరు తూ నివేదిస్తే అప్పుడు ప్రభుత్వం పరిశీలించి నిధులు మంజూరు చేసే అవకాశాలున్నాయి. ఈ తతంగం జరగాలంటే ఎంతకాలం పడుతుందో ఊహించలేమని వ్యవసాయశాఖ అధికారులే చెబుతుండడం గమనార్హం.
అంచనాలకు మించి నష్టం..
జిల్లావ్యాప్తంగా సాగు చేసిన 5.50 లక్షల హెక్టార్లలో 60 శాతం పైగా పంటలు నీటమునిగితే అధికారులు కేవలం 12 శాతమే దెబ్బతిన్నట్లు నివేదికలు తయారు చేసి మమ అనిపించారు. పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే మొక్కుబడిగా కాకిలెక్కలు వేసి చేతులు దులుపుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
గ్రామాలలో ఉండే ఆదర్శరైతుల సమన్వయంతో నష్టం అంచనా వేయాల్సినప్పటికీ వారు జాడలేకపోవడంతో క్షేత్రస్థాయిలో సరైన సమాచారం అందలేదని తెలుస్తోంది. రెవెన్యూ, వ్యవసాయ శాఖల నివేదికలు పూర్తిగా పొంతనలేకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతె ల్లం చేసింది. సంయుక్తంగా రూపొందించాల్సి న నివేదికలు ఎవరికివారే వేసిన కాకి లెక్కలు ఏది నమ్మాలో కూడా ప్రభుత్వం పునరాలోచనలో పడే అవకాశాలున్నాయి. జిల్లాలో 1565 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, నాలుగు ప శువులు మృతి చెందాయని రెవెన్యూ అధికారులు శనివారం వరకే లెక్కలు వేసి చేతులు దులుపుకున్నారు.
కంట్రోల్ రూంకు ఫిర్యాదుల వెల్లువ
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పంటలు దెబ్బతిన్న రైతులు అధికారుల కోసం ఇక్కడికి ఫోన్లు చేసి తమ వివరాలు చెబుతున్నారు. ఆది వారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు 20 మంది బాధితులు ఫోన్ ద్వారా తమ గోడు వెల్లబోసుకున్నారు. సిబ్బంది వివరాలు సేకరించి సంబంధిత తహశీల్దార్లకు చేరవేసారు. ఈ వివరాలను వ్యవసాయశాఖ సంబంధిత మండలాల ఏవోలకు అందించింది.