‘రెండో’ సగానికి గ్రీన్‌సిగ్నల్
రెండో విడత రుణమాఫీపై తెలంగాణ సర్కారు నిర్ణయం
ఒకటి రెండు రోజుల్లో బ్యాంకుల్లో జమ
రూ.2,043 కోట్లు లెక్కతేల్చిన ప్రభుత్వం
మొత్తం రూ.4,086 కోట్లకు చేరనున్న రెండో విడత
రూ.5వేల కోట్లకే పరిమితమైన ఖరీఫ్ పంట రుణాలు
హైదరాబాద్: పంట రుణాల మాఫీకి సంబంధించి రెండో విడతలోని మిగతా సగం నిధుల విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో రూ.2,043 కోట్లను బ్యాంకుల్లో జమ చేయనుంది. ఈ సొమ్ము విడుదలైతే రెండో విడత సొమ్ము మొత్తం రూ.4,086 కోట్లకు చేరనుంది. సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సర్కారు ఈ మేరకు హామీ ఇచ్చింది. అర్హులకే రుణమాఫీ సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ సొమ్ము విడుదలైతే రైతులకు కొత్త రుణాలు ఇచ్చే ప్రక్రియను బ్యాంకులు వేగవంతం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
రెండు సార్లు..
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం మొత్తంగా 35.82 లక్షల రైతులకు చెందిన రూ.17 వేల కోట్ల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేయనున్నట్లు సర్కారు గత ఏడాది తెలిపింది. మొదటి విడతగా గత ఏడాది రూ.4,230 కోట్లను జిల్లాల్లోని బ్యాంకులకు అందజేసింది. ఆ సొమ్ములో రూ.4,086.22 కోట్లను రైతుల ఖాతాల్లోంచి మాఫీ చేసిన బ్యాంకులు.. మిగతా సుమారు రూ.143 కోట్లను వెనక్కి ఇస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతనే ప్రామాణికంగా తీసుకొని రెండో విడత సొమ్ము విడుదలకు ఏర్పాట్లు చేసింది. రెండో విడతకు సంబంధించి సగం రూ.2,043 కోట్లను గత నెలలో విడుదల చేసింది కూడా. కానీ మిగతా సగం నిధులను విడుదల చేయకపోవడంతో.. రైతుల ఖాతాల్లోంచి రెండో విడత రుణమాఫీ కాలేదు. దీంతో రైతులకు కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు తిరస్కరించాయి. దీనిపై ఆందోళన చెలరేగడంతో రెండో విడత రుణమాఫీలోని మిగతా సగం రూ.2,043కోట్లను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పా ట్లు చేసింది. సంబంధిత ఫైలు ఆర్థికశాఖకు చేరినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.
మూడో వంతుకే పరిమితం
ఈ ఏడాది ఖరీఫ్ పంట రుణాల లక్ష్యం రూ.15,087కోట్లుకాగా బ్యాంకులు ఇప్పటివరకు రూ.5వేల కోట్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. అయితే ఖరీఫ్ పంటల సాగు 60 శాతానికి చేరగా.. కొత్త రుణాల మంజూరు మాత్రం 33 శాతానికే పరిమితమైంది. మరోవైపు మొదటి విడత రుణమాఫీలో అక్రమాలు, బోగస్ రైతులు, బినామీలకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం విచారణ పూర్తయినట్లు తెలిసింది. అయితే ఎందరు అక్రమాలకు పాల్పడ్డారన్న విషయాన్ని సర్కారు బయటకు వెల్లడించలేదు.