‘ఉపాధి’లో జిల్లాకు ప్రథమ స్థానం
విజయనగరం కంటోన్మెంట్: జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పని దినాలు కల్పించడంలో రాష్ర్టస్థాయిలో జిల్లా ప్రథమ స్థానం సాధించిందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్పీ టక్కర్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1.98 లక్షల పనిదినాలు కల్పించడంతో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఎం నాయక్‌ను ఆయన అభినందించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కూడా బాగుందని కితాబునిచ్చారు. జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.65 వేల కోట్లు కేటాయించినందున అవసరమయిన భూ సేకరణ ప్రక్రియను మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.
ఈ-ఆఫీసు అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం గ్రోత్‌రేటు సాధన దిశలో ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట సంజీవని కార్యక్రమం వేగం పుంజుకోవాలన్నారు. తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. క్రాస్ ప్రోగ్రాం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పట్టణ గృహ నిర్మాణ పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించి లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీఎస్‌తో మాట్లాడుతూ నాలుగు మున్సిపాలిటీల్లో 200 ఎకరాల భూమి లభ్యంగా ఉందన్నారు.
లబ్ధిదారుల ఎంపిక చేపడతామని చెప్పారు. వ్యక్తిగత పార్శిళ్ల కింద 80 ఎకరాలు ఉందని తెలిపారు. జిల్లాలో రోజుకు 4.98 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. ఇప్పటివరకూ 210 కిలోమీటర్ల మేర రహదారులు పూర్తి చేశామన్నారు. సమీక్షలో సీసీఎల్ఏ జవహర్ రెడ్డి, పీఆర్ సెక్రటరీ లవ్ అగర్వాల్, కమిషనర్ బి.రామాంజనేయులు, జేసీ శ్రీకేశ్ బి లట్కర్, సీపీఓ విజయలక్ష్మి, డ్వామా పీడీ ప్రశాంతి, పరిశ్రమల శాఖ మేనేజర్ ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.