పోటీ పరీక్షల్లో మార్పులు.. వచ్చే ఏడాదే
రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్ పీఎస్సీ ప్రతిపాదనలు
హరగోపాల్ కమిటీ సిఫారసులకు యథాతథంగా ఆమోదం
పరీక్షల విధానంలో ఇప్పటికిప్పుడు మార్పులు చేస్తే విద్యార్థులకు నష్టం
సిలబస్‌లో మాత్రం తెలంగాణకు అనుగుణంగా సవరణలు
గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనం వాయిదా వేయాలి
అధ్యాపక పోటీ పరీక్షల్లో విద్యా సంబంధ అంశాలతోనే జనరల్ స్టడీస్
రాష్ట్ర స్థాయిలో స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు చేయాలని సూచన
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనందున పోటీ పరీక్షల విధానంలో ఇప్పటికిప్పుడు మార్పులు చేయవద్దని, తెలంగాణ రాష్ట్రానికి తగిన విధంగా సిలబస్‌ను మాత్రం మార్చి ఉద్యోగ భర్తీ పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రభుత్వానికి సూచించింది. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో విలీనం చేయాలన్న జీవో అమలును వాయిదా వేయాలని ప్రతిపాదించింది. లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్-1ను, గ్రూప్-1 మెయిన్స్ ఐదోపేపర్లోనూ పూర్తిగా మార్పులు చేయాలని పేర్కొంది. దీంతోపాటు స్టేట్ సివిల్ సర్వీసెస్ ఉండాలని సూచించింది.
ఈ మేరకు ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలోని పోటీ పరీక్షల సమీక్ష కమిటీ చేసిన సిఫారసులను టీఎస్పీఎస్సీ యథాతథంగా ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. టీఎస్పీఎస్సీ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల విధానంలో మార్పులపై సర్వీసు కమిషన్ శనివారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రొ.హరగోపాల్ నేతృత్వంలోని కమిటీ ఇటీవలే ఈ ప్రతిపాదనలను రూపొందించి, టీఎస్పీఎస్సీకి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.
అందులోని సిఫారసులపై కమిషన్ శనివారం సమావేశమై చర్చించింది. చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠ ల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఇందులో పాల్గొన్నారు. ఈ భేటీలో హరగోపాల్ కమిటీ సిఫారసులను ఆమోదించి ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. వీటిని ప్రభుత్వం ఆమోదించి, ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సిలబస్‌ను ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు.
రెండింటికి వేర్వేరుగా..
గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బీగా మార్చుతూ గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును... ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఒక్కసారికి వాయిదా వేయాలని సమీక్ష కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం పాత పద్ధతిలోనే పరీక్షలను నిర్వహించాలని పేర్కొంది. గ్రూప్-1, గ్రూప్-2లను విడివిడిగానే కొనసాగించాలని తెలిపింది. రెండింటికి వేర్వేరుగా పరీక్షల విధానాన్ని రూపొందించి, అందజేసింది. ఈ సిఫారసులనే టీఎస్పీఎస్సీ ప్రభుత్వ ఆమోదానికి పంపింది.
మెయిన్స్ ఐదో పేపర్లో మార్పులు..
గ్రూప్-1 మెయిన్స్‌లో ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ ఐదో పేపర్‌గా ఉంది. దీని స్థానంలో కొంత గణితంతో పాటు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌ను ప్రవేశపెట్టాలని కమిటీ సూచించింది. తెలుగు మీడియం, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారితో పాటు సాంఘికశాస్త్రాలను సబ్జెక్టుగా చదువుకున్న వారు మొత్తం గణితం పేపర్ వల్ల అర్హత పొందలేకపోతున్నారని కమిటీ అధ్యయనంలో తేలిన నేపథ్యంలో ఈ మార్పును సూచించారు.
అధ్యాపకుల ‘జనరల్ స్టడీస్’లో మార్పులు
గతంలో గెజిటెడ్ అధికారుల నోటిఫికేషన్లలో భాగంగానే జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ తదితర పోస్టుల భర్తీ చేపట్టేవారు. అయితే ఇకపై అధ్యాపకుల నియామకాలకు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇవ్వాలని సమీక్ష కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం లెక్చరర్ పోస్టుల భర్తీలో పేపర్-1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ సిలబస్‌లో సమకాలిన అంశాలు, చరిత్ర, అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, రీజనింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. ఇకపై లెక్చరర్ పోస్టుల భర్తీ పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్-1లో విద్యా విధానం, విద్యా సంబంధ విషయాలు, విద్య, మౌలిక సూత్రాలు, విద్య ప్రాధాన్యం, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ, ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలను చేర్చుతారు. అధ్యాపకుడిగా వెళ్లాల్సిన వారికి విద్య సంబంధ అంశాలన్నింటిపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని కమిటీ ఈ మార్పులను సిఫారసు చేసింది.
అవసరమైతే మార్పులు: చక్రపాణి
గ్రూప్-1లో ఎప్పటిలాగానే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూ విధానం ఉంటుందని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. గ్రూప్-2, గ్రూప్-4 ఆబ్జెక్టివ్ విధానంలోని ఉంటాయన్నారు. ప్రతి పరీక్షకు స్కీమ్‌ను, సిలబస్‌ను మార్చే హక్కు టీఎస్ పీఎస్సీకి ఉందని.. పరీక్ష విధానం, సిలబస్‌ను యూపీఎస్సీ తరహాలో నోటిఫికేషన్లోనే ప్రకటిస్తామని చక్రపాణి చెప్పారు. ప్రభుత్వోద్యోగుల డిపార్ట్మెంటల్ పరీక్షలకు పది రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. డీఎస్సీ తదితర ఏ పరీక్ష అయినా ప్రభుత్వం నిర్ణయిస్తే నిర్వహించడానికి తాము సిద్ధమేనని, అయితే అది ప్రభుత్వ విధాన నిర్ణయమని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను పది రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. కాగా తాము సిలబస్‌ను ప్రకటించకముందే కొత్త సిలబస్ ప్రకారం శిక్షణ ఇస్తామంటూ కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని, అలాంటివారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.