వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీలోకి జిల్లా నేతలు
రాష్ట్ర కార్యదర్శులుగా ఆరుగురు..
రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా ఐదుగురి నియామకం
ప్రకటించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లా నుంచి 11 మంది నేతలకు పదవులు వరించాయి. ఆరుగురు రాష్ట్ర కార్యదర్శులుగా, మరో ఐదుగురిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. రాష్ట్ర కార్యదర్శులుగా మందడపు వెంకట్రామ్రెడ్డి, ఆలస్యం సుధాకర్, వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మందడపు వెంకటేశ్వర్లు, జిల్లేపల్లి సైదులు, కొల్లు వెంకట్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా బండ్ల సోమిరెడ్డి, తుమాటి నర్సిరెడ్డి, వనమారెడ్డి నాగిరెడ్డి, పుల్లి సైదులు, కుర్సమ్ సత్యనారాయణను నియమించారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ.. రాష్ట్ర కమిటీలోకి జిల్లా నేతలను తీసుకోవడంతో మొదలు పెట్టింది. త్వరలోనే జిల్లా కమిటీ, అనుబంధ సంఘాలను ప్రకటించి.. ప్రజా ఉద్యమంలోకి వెళ్లాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ వీడినంత మాత్రాన ప్రజల్లో వైఎస్సార్ సీపీ, వైఎస్ మీద అభిమానం ఉందని.. ఈ మద్దతుతో పార్టీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర నాయకత్వం కొత్తగా నియమితులైన వారికి సూచించింది. జిల్లా కమిటీ ప్రకటించిన వెంటనే ప్రజా పోరాటాలపై ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్లాని రాష్ట్ర పార్టీ.. జిల్లా నేతలకు చెప్పింది. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన నేతలు మాట్లాడుతూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట పడతామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, ఇందిరమ్మ ఇళ్లు ఇలా ఒక్కో పథకాన్ని పక్కనపెట్టి.. నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. పథకాలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు.