ఏమేం పన్నులు కడుతున్నాం?
నిజానికి.. దేశంలో పౌరులందరూ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో నిరంతరం పన్ను కడుతుంటారు. ఆదాయం తక్కువున్న వారు, అసలే ఆదాయం లేని వారు ప్రత్యక్షంగా ఆదాయ పన్ను కట్టకపోవచ్చు. కానీ.. వారు దుకాణంలో కొనే వస్తువుల నుంచి రెస్టారెంట్లో భోజనం చేయడం వరకూ అత్యధిక పర్యాయాలు పరోక్ష పన్నులు కడుతుంటారు. ఆధునిక ప్రభుత్వాలు చాలా వరకూ పన్నుల ద్వారానే నడుస్తుంటాయి. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తుంటాయి. అవి ఆదాయపన్ను వంటి ప్రత్యక్ష పన్నులు కావచ్చు. అమ్మకం పన్ను, సేవా పన్ను వంటి పరోక్ష పన్నులు కావచ్చు. స్థానిక ప్రభుత్వాలైన నగర పాలక సంస్థ, పురపాలక సంస్థ, పంచాయతీలు కూడా కొన్ని పన్నులు వసూలు చేస్తాయి.
కేంద్ర ప్రభుత్వ పన్నులు: ఆదాయ పన్ను, కస్టమ్స్ సుంకం, కేంద్ర ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను
రాష్ట్ర ప్రభుత్వ పన్నులు: వ్యాట్, స్టాంప్ డ్యూటీ, భూమి శిస్తు, రాష్ట్ర ఎక్సైజ్ సుంకం
స్థానిక సంస్థలు: నీటి పన్ను, ఆస్తి పన్ను, దుకాణం పన్ను వగైరా
ప్రత్యక్ష పన్నులు ఇవీ...
ఆదాయ పన్ను: నిర్దిష్ట పరిమితిని మించి ఆదాయం ఆర్జించే ప్రతి ఒక్కరూ కట్టే పన్ను ఇది. కేంద్ర ప్రభుత్వం ఈ పన్నును వసూలు చేస్తుంది. ఈ పన్నును కేంద్రం తరచుగా సవరిస్తుంటుంది. అలాగే.. ఈ పన్ను విషయంలో కొన్ని రాయితీలు, మినహాయింపులు కూడా ప్రకటిస్తుంటుంది.
పెట్టుబడి రాబడుల పన్ను: ఆస్తులు, షేర్లు, బాండ్లు, విలువైన వస్తువులను ముందుగా నిర్ణయించిన కాలపరిమితి లోపల అమ్మి లాభం గడిస్తే.. ఆ లాభంపై చెల్లించే పన్ను. ఆయా పెట్టుబడుల రకాన్ని బట్టి ఈ పన్ను శాతం మారుతుంది. ప్రస్తుతం షేర్లపై స్వల్ప కాలిక (ఏడాది లోపు) పెట్టుబడి రాబడి పన్ను 10 శాతం, దాని మీద విద్యా సెస్సు వసూలు చేస్తోంది. దీర్ఘకాలిక (ఏడాది కన్నా ఎక్కువ కాలం) పెట్టుబడి రాబడిపై పన్ను లేదు. ఆస్తుల క్రయవిక్రయాల విషయంలో స్వల్పకాలిక పెట్టుబడి రాబడి పన్ను కాలపరిమితి మూడేళ్లు. ఆ కాలం దాటితే పన్ను ఉండదు.
కానుక పన్ను: ఒక వ్యక్తి అందుకునే కానుకల పైనా పన్ను చెల్లించాలి. దానిని ఆదాయం కింద గణిస్తారు. కానుక విలువ ఒక ఏడాదిలో రూ. 50,000 కన్నా మించితే ఈ పన్ను వర్తిస్తుంది.
సంపద పన్ను: ఒక వ్యక్తి మొత్తం సంపద మీద వసూలు చేసే పన్ను. అన్ని ఆస్తుల మొత్తం నుంచి.. ఆ ఆస్తులను పొందడానికి చేసిన రుణాలను తీసివేసి సంపదను విలువకడతారు. విలువకట్టే తేదీ నాటికి సంపద విలువను లెక్కించి ఈ పన్ను విధిస్తారు. సంపద విలువ రూ. 30 లక్షలు దాటితే ఒక శాతం సంపద పన్ను చెల్లించాలి. అయితే.. 2015 బడ్జెట్లో సంపద పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఏటా రూ. 1 కోటి, అంతకు మించి ఆదాయార్జన గల వారిపై 12 శాతం సర్ ఛార్జి వసూలు చేస్తోంది.
సెక్యూరిటీ (షేర్ల) లావాదేవీల పన్ను: స్టాక్ఎక్సేంజీలో జరిపే ప్రతి లావాదేవీ పైనా ఈ పన్ను విధిస్తారు.
ప్రిరిక్విసిట్ పన్ను: ఒక సంస్థ తన ఉద్యోగులకు ఇచ్చే నగదేతర ప్రయోజనాలు- డ్రైవర్‌తో సహా కారు సదుపాయం, క్లబ్ సభ్యత్వం, సంస్థ షేర్లలో వాటా తదితరాలపై పన్ను వసూలు చేస్తారు.
టోల్ పన్ను: ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్లు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడానికి కొన్ని ప్రదేశాలలో టోల్ పన్ను కట్టాల్సి ఉంటుంది.
కార్పొరేట్ పన్ను: భారతదేశంలో పనిచేసే ఏదైనా కార్పొరేట్ సంస్థ తన ఆదాయంపై చెల్లించే వార్షిక పన్ను. పన్నుల విధింపు కోసం దేశంలోని కంపెనీలను దేశీయ, విదేశీ సంస్థలుగా వర్గీకరించారు. ప్రస్తుతం కార్పొరేట్ పన్ను 30 శాతంగా ఉంది. దాని మీద 3 శాతం సెస్సు కూడా ఉంది. అంటే మొత్తం పన్ను 30.9 శాతం. ఇక ఆదాయం రూ. 1 కోటి కన్నా మించితే ప్రాథమిక పన్ను మీద అదనంగా 12 శాతం సర్ చార్జి వసూలు చేస్తారు.
పరోక్ష పన్నులు ఇవీ...
కేంద్ర అమ్మకం పన్ను: దేశంలో వస్తు ఉత్పత్తుల విక్రయాలపై విధించే పన్ను ఇది. అంతర్రాష్ట్ర వస్తు విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుంది. రాష్ట్రంలో అంతర్గత అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను వసూలు చేస్తాయి. కేంద్రం వసూలు చేసే పన్నును కేంద్ర అమ్మకం పన్ను అంటారు. ప్రస్తుతం కేంద్రం 2 శాతం సీఎస్టీ వసూలు చేస్తోంది.
విలువ ఆధారిత పన్ను: రాష్ట్రాలు వసూలు చేసే అమ్మకం పన్నును వ్యాట్(విలువ ఆధారిత పన్ను) అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు ఒకే తరహా వ్యాట్ అమలులో ఉంది. బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్లు వంటి ఖరీదైన వస్తువుల మీద 1 శాతం వ్యాట్ ఉంది. ఆటోమేటిక్ వ్యవసాయ పనిముట్లు, పురుగు మందులు, సిమ్ కార్డుల, మైక్రోఫోన్లు, కాఫీ, ఐస్, పేటెంట్లు వంటి వాటిపై 4 శాతం వ్యాట్ ఉంది. ఈ జాబితాలో సుమారు 125 వస్తువులున్నాయి. ఇక నాలుగో షెడ్యూలులోని వస్తువుల మీద వ్యాట్ 22.5 శాతం నుండి 70 శాతం వరకూ ఉంటుంది. మద్యం మీద అత్యధికంగా 70 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. పెట్రోల్ మీద 33 శాతం, డీజిల్ మీద 22.5 శాతం, పొగాకు మీద 25 శాతం వ్యాట్ ఉంది. ప్రజల, పర్యావరణ ఆరోగ్యం, బాగోగులను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా వస్తువుల మీద వ్యాట్ అధికంగా వసూలు చేస్తున్నారు. పై మూడు రకాలు కాకుండా ఐదో షెడ్యులులో ఉన్న మిగతా వస్తువులన్నింటి మీదా 12.5 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు.
సేవా పన్ను: డబ్బు చెల్లించి పొందే సేవల్లో చాలా సేవలకు పన్ను కట్టాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ వస్తువులు, ఏసీ రైల్వే టికెట్లు, కార్లు, ఇళ్లు, సినిమా టికెట్లు, బ్యాంకు లావాదేవీలు, ఫోన్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు, హోటళ్ల బిల్లులు, వైద్య సేవలు తదితరాలు. ప్రస్తుతం 14 శాతం సేవా పన్ను వసూలు చేస్తున్నారు. స్వచ్ఛభారత్ సెస్సు, కృషి కళ్యాణ్ సెస్సులను కలుపుకుని సేవలపై మొత్తం 15 శాతం పన్ను విధిస్తున్నారు.
స్వచ్ఛ భారత్ సెస్సు: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన సెస్సు ఇది. పన్ను విధించగల సేవలు అన్నిటిపైనా 2015 నవంబర్ 15 నుంచి స్వచ్ఛ భారత్ సెస్సును వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సెస్సు 0.5 శాతంగా ఉంది.
కృషి కళ్యాణ్ సెస్సు: రైతుల సంక్షేమాన్ని విస్తరించడం కోసం 2016 బడ్జెట్లో ప్రవేశపెట్టిన సెస్సు ఇది. పన్ను విధించగల సేవలు అన్నిటిపైనా 2016 జూన్ 1 నుంచి స్వచ్ఛ భారత్ సెస్సు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సెస్సు రేటు 0.5 శాతం.
కస్టమ్స్ సుంకం: విదేశాల నుంచి భారతదేశంలోకి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పరోక్ష పన్ను ఇది. ఈ పన్నును ప్రధానంగా సదరు వస్తువులను దేశంలోకి దిగుమతి చేసుకునే కేంద్రంలో చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకునే వస్తువుల స్వభావాన్ని బట్టి ఈ పన్నులో తేడాలుంటాయి.
ఎక్సైజ్ సుంకం: దేశంలోనే ఉత్పత్తి అయిన వస్తువులపై విధించే మరొక పన్ను. వస్తువులు తయారు చేసేవారు, వస్తువులు తయారు చేయడానికి కార్మికులను నియమించుకునే వారు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
యాంటీ డంపింగ్ సుంకం: ఏదైనా విదేశం ఏవైనా వస్తువులను వాటి సాధారణ విలువ కన్నా తక్కువ ధరకు మన దేశంలోకి భారీగా దిగుమతి చేయడాన్ని నిరోధించడానికి ఈ పన్నును అమలు చేస్తున్నారు.
ఇతర పన్నులు...
వృత్తి పన్ను: ఆదాయాన్ని ఆర్జించే వృత్తి నిపుణుడు ఈ పన్ను చెల్లించాలి. దీనిని సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లు విధిస్తాయి. మన దేశంలో చాలా రాష్ట్రాలు ఈ పన్ను వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగీ ఈ పన్ను చెల్లించాలి. సదరు ఉద్యోగికి సంబంధించిన సంస్థ స్వయంగా ప్రతి నెలా ఈ పన్నును మినహాయించుకుని మున్సిపల్ కార్పొరేషన్లకు జమచేస్తుంది.
డివిడెండ్ పంపిణీ పన్ను: కంపెనీలు తమ పెట్టుబడిదారులకు చెల్లించే డివిడెండ్‌పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్ను. ఏదైనా కంపెనీ డివిడెండును ప్రకటిస్తే.. అలా ప్రకటించిన డివిడెండ్లపై 16.995 శాతం పన్ను కట్టాలి. ఇది కార్పొరేట్ పన్ను 30.9 శాతానికి అదనం.
డివిడెండ్ పన్ను: 2016 బడ్జెట్లో ప్రవేశపెట్టిన పన్ను ఇది. రూ. 10 లక్షలకు మించిన డివిడెండ్ ఆదాయంపై 10 శాతం అదనపు పన్ను విధించారు. 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది వర్తిస్తుంది.
మున్సిపల్ పన్ను: ప్రతి నగరంలోనూ నగరపాలక సంఘం ఆస్తి పన్ను వసూలు చేస్తుంది. ప్రతి ఆస్తి యజమానీ ఈ పన్ను చెల్లించాలి. ఈ పన్ను రేటును ఆయా నగర పాలక సంస్థలు నిర్ణయిస్తాయి. హైదరాబాద్‌లో నివాస గృహం చదరపు అడుగుకు నెల వారీ అద్దె విలువ ఆధారంగా.. ఆ విలువలో 17 శాతం నుంచి 30 శాతం వరకూ ఆస్తి పన్ను కట్టాలి. అందులో సాధారణ పన్ను, కన్జర్వెన్సీ పన్ను, వీధి దీపాల పన్ను, డ్రైనేజీ పన్ను కలిసి ఉంటాయి. అదనంగా లైబ్రరీ సెస్సు కూడా చెల్లించాల్సి ఉంటుంది. చదరపు అడుగుకు నెల వారీ అద్దె విలువ రూ. 50 కన్నా తక్కువగా ఉంటే ఈ పన్ను వర్తించదు.
వినోద పన్ను: వినోదానికీ పన్ను వర్తిస్తుంది. సినిమా టికెట్లు, వాణిజ్య ప్రదర్శనలు, ప్రసార సేవలు, డీటీహెచ్ సేవలు, కేబుల్ సేవలు వంటి వినోదాల ఆర్థిక లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పన్ను విధిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో వినోద పన్ను టికెట్ విలువ మీద 20 శాతంగా ఉంది. అదే తెలుగు సినిమాలకైతే కాస్త తక్కువగా 15 శాతం పన్ను ఉంటుంది.
స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, బదిలీ పన్ను: ఒక స్థిరాస్తి కొన్నపుడు విక్రేతకు చెల్లించే మొత్తానికి అదనంగా.. స్టాంపు సుంకం, రిజిస్ట్రేషన్ ఫీజు, బదిలీ పన్నులు చెల్లించాలి. ఆస్తుల పత్రాలు రూపొందించడానికి ఇవన్నీ అవసరం. సులుభంగా చెప్పాలంటే ఒక ఆస్తి యాజమాన్యాన్ని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మార్చడానికి ఈ పన్నులు వసూలు చేస్తారు. ఈ పన్నులు ఆస్తి రకాన్ని బట్టి, దాని విలువను బట్టి ఉంటుంది.
విద్యా సెస్సు, సర్ చార్జి: దేశంలో పేద ప్రజల విద్య కోసం విద్యా సెస్సును వసూలు చేస్తున్నారు. దేశంలో ప్రధానంగా ఆదాయ పన్ను, ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల మీద విద్యా సెస్సును వసూలు చేస్తున్నారు. అది మొత్తం చెల్లించే పన్ను మీద 3 శాతం ఉంటుంది. సర్ చార్జి అంటే.. అప్పటికే ఉన్న పన్ను రేటుకు అదనంగా కలిపే పన్ను.
మౌలిక సదుపాయాల సెస్సు: కార్లు, యుటిలిటీ వాహనాలపై 2016 బడ్జెట్లో ఈ పన్నును ప్రవేశపెట్టారు. నాలుగు మీటర్ల లోపు నిడివి, 1200 సీసీ లోపు సామర్థ్యం గల ఇంజన్లు గల పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్‌జీలతో నడిచే వాహనాలపై 1 శాతం మౌలికసదుపాయాల సెస్సు వసూలు చేస్తున్నారు. 4 మీటర్లకు పైబడిన, 1500 సీసీ లోపు సామర్థ్యం గల వాహనాలపై ఈ సెస్సు 2.5 శాతంగా ఉంది. ఇక పెద్ద కార్లు, ఎస్‌యూవీల మీద 4 శాతం సెస్సు వసూలు చేస్తున్నారు.
ప్రవేశ పన్ను: గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రవేశ పన్నును వసూలు చేస్తున్నాయి. ఈ-కామర్స్ మార్గంలో ఆయా రాష్ట్రాలలోకి ప్రవేశించే అన్ని వస్తువుల మీదా 5.5 శాతం నుండి 10 శాతం వరకూ ప్రవేశ పన్ను వసూలు చేస్తున్నాయి.
కొసమెరుపు: ఇన్ని రకాలుగా ఉన్న పన్నులకు, వాటిలో గందరగోళానికి త్వరలో ఒక రూపం రానుంది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో దేశ వ్యాప్తంగా ఒకే తరహా పన్ను విధానం అమలులోకి రానుంది.
తప్పక చదవండి:
ఈ ఆదాయాలకు పన్ను లేదు...
మన సంపాదనలో సర్కారు వాటా 30 శాతం!