మంత్రి విమర్శల ‘బార్’
బార్‌ను ప్రారంభించిన మంత్రి శిందే
- తీవ్రంగా విమర్శించిన విపక్షాలు
- రాజీనామా చేయాలని పట్టబట్టిన కాంగ్రెస్
- బార్ కాదు..రెస్టారెంట్ ప్రారంభించాన్న మంత్రి
ముంబై: అహ్మద్ నగర్లో ఓ బార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి రామ్‌శిందే తీవ్ర విమర్శల పాలయ్యారు. అహ్మద్‌నగర్ - పుణే రహదారిపై సుపా టోల్‌నాకా సమీపంలో బార్ ప్రారంభోత్సం జరిగింది. కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయక మంత్రి దీపక్ కేసర్కర్, ఎమ్మెల్యే సుధీర్ తాంబే తదితర నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి బార్‌ను ప్రారంభించడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమం చట్ట విరుద్ధం కాకపోయినప్పటికీ ఓ మంత్రి బార్‌ను ప్రారంభించడం సరికాదని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. మద్యం ప్రకటనలపై నిషేధం ఉందని, మంత్రులు ఇలాంటి కార్యక్రమాలకు హాజరైతే మద్యానికి ప్రకటన ఇవ్వడం లాంటిదే అని ఆయన చెప్పారు. మరోవైపు శిందే మాట్లాడుతూ.. అవసరమైన అన్ని అనుమతులు బార్ పొందిదన్నారు. హోటల్ రాయరీ పార్క్ వద్ద కీర్తీ ఫ్యామిలి రెస్టారెంట్‌ను ప్రారంభించానని, అదేమీ చట్ట విరుద్ధం కాదన్నారు. బీర్ బార్ తాను ప్రారంభించిన రెస్టారెంట్ రాయ్రీ పార్క్ యజమానిదే అని తెలిపారు.
బార్ ప్రారంభానికి వెళ్లలేదు: దీపక్
బార్ ప్రారంభించిన మంత్రి రామ్ శిందేపై ప్రతిపక్షాలతోపాటు సొంతపార్టీకి చెందిన నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. శిందే ప్రారంభోత్సవానికి వెళ్లకుండా ఉండాల్సిందని రెవిన్యూ శాఖమంత్రి ఏక్నాథ్ ఖడ్సే అన్నారు. మరోవైపు రామ్ శిందే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇది ఇలా ఉండగా ఇదే ప్రారంభోత్సవం పాల్గొన్న ఆర్థిక శాఖ సహాయక మంత్రి దీపక్ కేసర్కర్ ఈ విషయంపై స్పందించారు. తాను బీర్ బార్ ప్రారంభోత్సవానికి వెళ్లలేదని.. ఫ్యామిలి రెస్టారెంట్ ప్రారంభోత్సవమని వెళ్లానన్నారు.
మద్య నిషేధం జరిగిన మూడో జిల్లా
విదర్భలోని చంద్రపూర్ జిల్లాలో మద్యం నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా మద్యాన్ని నిషేధించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ బీర్ బార్, పర్మిట్ రూమ్‌ను ఇద్దరు సహాయక మంత్రులు ప్రారంభించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా, విదర్భలో వార్దా, గడ్చిరోలి తర్వాత మద్య నిషేధం జరిగిన మూడో జిల్లా చంద్రాపూర్.