భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి
– రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌లో జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ
కడప ఎడ్యుకేషన్: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి విద్యార్థికి సైన్సుపై అవగాహన కల్పించాలి. విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి సేవలందించే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. కడప నగరం మరియాపురంలోని సెంయిట్ జోసప్ జూనియర్ కళాశాలలో జిల్లా సైన్సు అధికారి డాక్టర్ రవికిరణ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ కార్యక్రమానికి డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సైన్సు అండ్ టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతూ అభివృద్థి పథంలో నడుస్తోందన్నారు. టెక్నాలజీని ప్రతి విద్యార్థి అందిపుచ్చుకుని ఉత్తమ శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించి మానవుడి మనుగడకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పర్యావరాణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మునుముందు మానవుడు భూమిపై మనుగడను సా«గించడం చాలా కష్టం అవుతుందన్నారు. ఇప్పటికే గాలిలో నత్రజని శాతం ఎక్కువై అక్సిజన్ శాతం తగ్గిపోతోందన్నారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజల్లో ప్రతి ఒక్కరూ అక్సిజన్ సిలిండర్‌ను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు పుస్తకాల్లో ఉండేది కాకుండా బయట ప్రపంచం గురించి అవగాహన పెంచాలన్నారు. వీటితోపాటు పర్యావరణపై కూడా అవగాహనను పెంచి మొక్కల పెంపకాన్ని చేపట్టే విధంగా కృషి చేయాలన్నారు. విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్‌పైనే కాకుండా సైన్సు కోర్సులపై కూడా ఆసక్తిని పెంచుకోవాలన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో ఉండే నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై సంపూర్ణ అవగాహనను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర ఇన్స్పైర్ పరీశీలకులు, ఎస్సీఆర్టీ ప్రొఫెసర్లు లక్ష్మివాట్స్, వనజాక్షిలు మాట్లాడుతూ నేడు సైన్సు చాలా అడ్వాన్స్‌గా ఉందని దానిని అందుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపిక కావడం చాలా సంతోషకరం అన్నారు. ఇక్కడ నుంచి జాతీయస్థాయికి వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి. పులివెందుల విద్యార్థి నారాయణ. దువ్వూరు కేవీబీవీ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టర్ ఇన్స్పైర్ స్టాల్స్‌ను ప్రారంభించి పలు ఎగ్జిబిట్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు జిల్లాస్థాయి అధికారులతోపాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.