గ్రీన్‌సిగ్నల్
సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్ : ప్రభుత్వ స్థలాల్లో దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసుకున్న ‘గూడు’ను పేదలు క్రమబద్ధీకరించుకునే ప్రక్రియకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి విడతగా దాదాపు 443మంది పేదలకు భూ క్రమబద్ధీకరణ కింద పట్టాలు మంజూరు చేసింది. వీటిని ఈ నెల 7వ తేదీన జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాల ముగింపు సభలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు సమాయత్తమవుతున్నారు.
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి తదితరులు లబ్ధిదారులకు ఈ పట్టాలు పంపిణీ చేయనున్నారు. అయితే జీఓ 58 కింద జిల్లాలోని 64 మండలాలకు చెందిన 5226 మంది 125గజాల్లోపు గల తమ స్థలాలను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీటిపై దాదాపు 7 నెలలుగా వివిధ దశలుగా విచారణ జరిపిన అధికారులు వీటిలో 443 మంది లబ్ధిదారులు అర్హులుగా గుర్తించి మండలాల వారిగా పట్టాలు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు.
జీఓ 58 కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ప్రభుత్వ స్థలాలకు సంబంధించి పలు ప్రభుత్వపరమైన అంశాలు కొన్ని శాఖలకు అభ్యంతరాలు ఉండడం వంటి సాంకేతిక అంశాలు ముడిపడి ఉండడంతో 3,764 దరఖాస్తులను ఇప్పటికిప్పుడు పరిష్కరించే పరిస్థితి లేదని వీటిపై సమగ్ర విచారణతో పాటు ఆయా ప్రభుత్వ శాఖలతో సంప్రదించాల్సి ఉందన్న పేరుతో ఆ దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు చేతులెత్తేశారు. మిగిలి ఉన్న 1013 దరఖాస్తులను అధికారులు విచారణ చేయాల్సి ఉంది.
ఇది ఎప్పటికి పూర్తవుతుందోనని ఇందులో ఎంతమందిని లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తిస్తుందనే ఆందోళన నెలకొంది. 7 నెలల నిరీక్షణ అనంతరం కనీసం 443 మందికైనా ప్రభుత్వం భూ క్రమబద్ధీకరణ చేయడం దరఖాస్తుదారుల్లో కొంత ఊరట కలిగిస్తున్న మొత్తం దరఖాస్తులను విచారణ జరిపి భూ క్రమబద్ధీకరణను పూర్తిచేయడం ఎప్పటికి అవుతుందోనని నిరాశ, నిస్పృహలు దరఖాస్తుదారుల్లో అలుముకున్నాయి.
ఆందోళనలో జీఓ 59 దరఖాస్తుదారులు...
250గజాలకు మించి ప్రభుత్వ స్థలాలను ఆధీనంలో ఉంచుకున్న వాటిని క్రమబద్ధీకరించడం కోసం జీఓ నెం.59 పేరుతో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ జీఓ ప్రకారం జిల్లాకు చెందిన 424మంది దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం సూచించిన విధంగా రుసుము సైతం చెల్లించారు. అందువల్ల ప్రభుత్వానికి రూ.11 కోట్లకు పైగా ఆదాయం లభించింది. అయితే ఈ దరఖాస్తుదారులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి విచారణ జరుపకపోవడం.. అర్హులెవరో గుర్తించకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేవన్న కారణంతో జిల్లాలో అధికారులు ఇప్పటి వరకు కనీసం విచారణ సైతం జరుపకపోవడంతో 59 జీఓ కింద దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.