సర్కారు కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.6వేల కోట్లు
రాజధానిలో 900 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణానికి సుమారు రూ.6,000 కోట్ల వ్యయం అవుతుందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) పేర్కొంది. గుంటూరు జిల్లా రాయపూడి సమీపంలో 900 ఎకరాల్లో సర్కారు భవనాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. శాశ్వత సచివాలయాన్ని 9.22 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు.
శాఖాధిపతుల కార్యాలయాలు, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసం, మంత్రుల నివాసం, హైకోర్టు, శాసనసభ, శాసన మండలి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసం, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస క్వార్టర్లు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస క్వార్టర్ల నిర్మాణాలకు ఎన్ని చదరపు అడుగులు అవసరమో సీఆర్డీఏ నిర్ధారించింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలకు కూడా ఎన్ని చదరపు అడుగులు కావాలో తేల్చింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు ఐకానిక్ డిజైన్ రూపొందించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు మొత్తం 1,60,41,863 చదరపు అడుగుల్లో ఉంటాయని సీఆర్డీఏ పేర్కొంది.