ఒక్క ఎకరా పంట కూడా ఎండరాదు
అనంతపురం అగ్రికల్చర్ : వర్షాభావం నెలకొన్న ప్రస్తుత తరుణంలో పంట పొలాలకు రక్షక తడులు అందివ్వాలని, ఎక్కడేగాని ఒక్క ఎకరా పంట కూడా ఎండి పోకుండా చర్యలు చేపట్టాలంటూ వ్యవసాయాధికారులకు రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. వ్యవసాయశాఖ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి.విజయకుమార్, డైరెక్టర్ ధనుంజయరెడ్డితో కలిసి ఆయన సమీక్షించారు. గురువారం రాత్రి వారు అమరావతి నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రధానంగా ఖరీఫ్ పంటల వారీగా సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటలు, చిరుధాన్యపు పంటల విస్తీర్ణం పెంపు, వర్షపాతం, పంటల స్థితిగతులు, ఈ–క్రాప్ బుకింగ్, ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనా, భూసార పరీక్షా ఫలితాల పత్రాలు పంపిణీ, యాంత్రీకరణ పథకం గురించి ప్రగతి వివరాలు తెలుసుకున్నారు. అందులోనూ పంట సంజీవిని కింద వేరుశనగ పంట ఎండిపోకుండా రెయిన్గన్ల ద్వారా రక్షకతడుల ప్రణాళిక గురించి ఆరాతీశారు. ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా పంటను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేడీఏ పీవీ శ్రీరామమూర్తితో పాటు డీడీఏలు, ఏడీఏలు, ఏవోలు హాజరయ్యారు.