హోరాహోరీగా రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలు
అనంతపురం సప్తగిరిసర్కిల్: అండర్–14(సబ్–జూనియర్స్) ఫుట్బాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. అనంత క్రీడా గ్రామంలో రెండో రోజు మంగళవారం విశాఖపట్టణం, కర్నూలు జట్ల మధ్య పోరు ఉత్కంఠ రేపింది. చివరి సెషన్లో విశాఖ జట్టు 1–0తో విజయాన్ని అందుకుని సెమీస్లో స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా కర్నూలు క్రీడాకారునికి స్వల్ప గాయం కాగా.. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇకపోతే నెల్లూరు జట్టుతో గతేడాది విజేతగా నిలిచిన అనంత జట్టు మొదటి మ్యాచ్ ఏకపక్షంగా సాగింది.
అనంత క్రీడాకారులు రంగస్వామి–3 గోల్స్ చేయగా.. శ్రీహరి, జట్టు సారథి మధుబాబు, ప్రమీత్, దిలీప్రెడ్డిలు చెరో గోల్ చేసి జట్టుకు విజయాన్నందించారు. మరో మ్యాచ్లో శ్రీకాకుళంతో తలపడాల్సి ఉండగా శ్రీకాకుళం జట్టు గైర్హాజరు కావడంతో అనంత జట్టు సెమీస్ చేరుకుంది. మరో మ్యాచ్లో చిత్తూరు, ప్రకాశం జట్లు తలపడగా ఈ మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది. మ్యాచ్లో చిత్తూరు జట్టు క్రీడాకారులు ప్రకాశం జట్టుపై 17–0తో విజయం సాధించారు. బుధవారం మొదటి సెమీస్లో అనంతపురం, కడప జట్లు, రెండవ సెమీస్లో విశాఖపట్టణం, చిత్తూరు జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుందని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు తెలిపారు.
నేడు ముగింపు
అండర్–14 రాష్ట్రస్థాయి టోర్నీ ముగింపు కార్యక్రమాన్ని బుధవారం స్థానిక అనంత క్రీడా గ్రామంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు తెలిపారు. కార్యక్రమానికి జేసీ–2 ఖాజామోహిద్దీన్, సేల్స్ ట్యాక్స్ జాయింట్ కమీషనర్ శ్రీకల్పనలు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు.