Station ghanpur public meeting
-
ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికే కేసీఆర్ పోటీ: రేవంత్ రెడ్డి
జనగాం: ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికి కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఓట్లన్నీ డబ్బాలో వేస్తే కేసీఆర్ మూటగట్టుకుని పోతారని అన్నారు. కేసీఆర్ చుట్టాలొచ్చి కామారెడ్డిలో భూములు గుంజుకుంటారని ఆరోపించారు. కేసీఆర్‌ను తరిమికొట్టడానికే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానని రేవంత్ తెలిపారు. కేసీఆర్‌ను వెంటాడటానికే కాంగ్రెస్ అధిష్ఠానం తనను పంపించిందని పేర్కొన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ మేరకు బీఆర్ఎస్పై నిప్పులు చేరిగారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను బీఆర్ఎస్ నాయకులే నమ్మడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో దళితులకు స్థానం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని ఆవేదన వ్యకం చేశారు. కేసీఆర్ లాంటి దోపిడీదారు దేశంలోనే లేరని దుయ్యబట్టారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రానికి ఏం చేశారని మూడోసారి అధికారం ఇవ్వమని కేసీఆర్ అడుగుతున్నారని దుయ్యబట్టారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ విజయ భేరీ సభలో ఈ మేరకు రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్లో ఆరుగురు మహిళలకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ 12 మందికి అవకాశం కల్పించిందని రేవంత్ చెప్పారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా సాధికారత ఉన్న చోటే అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. వైన్ షాపులు పెట్టి పేదల ఆస్తులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజల సంపదను సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు డిగ్రీ కాలేజీ తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఘన్‌పూర్‌కు 100 పడకల ఆస్పత్రిని తీసుకురాలేకపోయారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బెల్టు షాపులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్.. రాష్ట్రం ఎందులో మొదటి స్థానంలో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: దయాకర్ గెలిస్తే రైతు బంధు రూ. 16వేలు.. పాలకుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ -
కేసీఆర్ మోజు వల్లే ఉప ఎన్నిక
స్టేషన్ ఘన్పూర్ బహిరంగ సభలో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి * టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు * ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి వరంగల్ నుంచి ‘సాక్షి’ప్రతినిధి: మంత్రిమండలిలో తనకు తొత్తుగా ఉండే వ్యక్తిని పెట్టుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మోజుపడి అహంకారంతో తీసుకున్న నిర్ణయం వల్లే వరంగల్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దుయ్యబట్టారు. అందువల్ల ఉప ఎన్నికలో కేసీఆర్, టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం స్టేషన్ ఘన్పూర్ పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడుతూ రైతులకు లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ ఆ హామీని మరచిపోయారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణకు బదులు ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు మండుటెండలో పాదయాత్ర చేశారని పొంగులేటి గుర్తుచేశారు. ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రి అయ్యాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ అనే తరహాలో పరిపాలించారన్నారు. 2004 కంటే మందు ఉమ్మడి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరిగేవని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ పాలనలో మళ్లీ రైతు ఆత్మహత్యలు తెరమీదకు వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉందని, ఆయనకు ఓటు అడిగే అర్హతే లేదని పొంగులేటి విమర్శించారు. ప్రాణం పోసిన నేత కుటుంబాన్నే జైలుకు పంపించిన కాంగ్రెస్ పార్టీది భస్మాసుర హస్తమని, ఆ పార్టీకి ప్రజలు ఓటు వేయవద్దని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నేరవేర్చకుండా రాష్ట్రంలో కుటుంబ పాలనను తెచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ అభిమానులకు భరోసా కల్పించడం కోసం వైఎస్ జగన్ వచ్చారని...ఉప ఎన్నికలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని కోరారు.