station master
-
స్టేషన్ మాస్టర్‌కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
రైలు ప్రయాణాన్ని ఇష్టపడని వారెవరూ ఉండరనడంలో అతిశయోక్తి లేదు. మరి రైలు ప్రయాణంలో అనుకోని ఘటన ఏదైనా జరిగితే అది వార్తల్లో నిలుస్తుంది. తాజాగా అటువంటి ఉదంతమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా సమీపంలోని ఉదీ మోడ్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో పట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైలు గ్రీన్ సిగ్నల్ కోసం అరగంట పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్టేషన్ ఆగ్రా డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆగ్రా రైల్వే డివిజన్ అధికారులు ఈ నిర్లక్ష్యానికి కారణాన్ని వివరించాలని స్టేషన్ మాస్టర్‌ను ఆదేశించారు.ఈ ఘటన గురించి ఆగ్రా రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) ప్రశస్తి శ్రీవాస్తవ మాట్లాడుతూ తాము ఈ విషయంలో స్టేషన్ మాస్టర్‌కు ఛార్జ్ షీట్ జారీ చేశామని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ఘటన జరిగిన సమయంలో స్టేషన్ మాస్టర్‌ను నిద్రలేపడానికి రైలులోని లోకో పైలట్ పలుమార్లు హారన్ మోగించారు.అరగంట తరువాత స్టేషన్ మాస్టర్ నిద్రనుంచి మేల్కొని రైలు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించి, క్షమాపణ చెప్పారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డ్యూటీలో ఉన్న ‘పాయింట్‌మెన్’ ట్రాక్‌ను పరిశీలించడానికి వెళ్లాడని, దీంతో ఆ సమయంలో తాను స్టేషన్లో ఒంటరిగా ఉన్నానని ఆ స్టేషన్ మాస్టర్ తెలిపారు. -
తప్పతాగి దర్జాగా నిద్రపోయాడు; రైల్వే సేవలకు అంతరాయం
ఢిల్లీ: అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్(ఏఎస్ఎమ్) నిర్వాకంతో నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఢిల్లీ- హౌరా మధ్య కొన్ని గంటలపాటు సేవలకు అంతరాయం కలిగింది. అధికారులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సదరు వ్యక్తి స్పందించలేదు. దీంతో ఏమైందోనని ఉరుకులు పరుగుల మీద వచ్చిన అధికారులు అక్కడి పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. అప్పటికే ఫూటుగా మద్యం తాగి ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే గాక తప్ప తాగినందుకు అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలకు ఆదేశించింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన అనిరుద్ కుమార్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కాగా గురువారం విధులకు హజరైన అతను డ్యూటీలోనే మద్యం సేవించాడు. కాసేపటికే మత్తులోకి జారుకున్నాడు. అప్పటికే స్టేషన్‌కు ఫరక్కా, మగధ ఎక్స్‌ప్రెస్‌లు వచ్చి సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి. వాటి వెనుకాల చాలా గూడ్స్ రైళ్లు కూడా ఆగి ఉన్నాయి. ఎంతసేపటికి రైళ్లు కదలకపోవడంతో నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు అనిరుద్ కుమార్‌కు ఫోన్ చేశారు. ఎంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో అధికారులు వచ్చి చూడగా.. అధికారులు షాక్ తిన్నారు. అనిరుద్ కుమార్ దర్జాగా నిద్రపోతున్నాడు. అతన్ని లేపే ప్రయత్నం చేయగా.. మద్యం తీసుకున్నట్లు తేలింది. దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసి తుండ్లాలోని మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' ఇలాంటి అధికారులు ఉండడంతోనే దేశం ఇలా తగలడింది..'' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
‘కీ’ కోసం రైలు ఆగిపోయింది
రివారి : రాకపోకలు రద్దీగా ఉన్నాయనో, వాతావవరణం అనుకూలించడం లేదనో రైళ్లు నిలిచిపోవడం చూస్తుంటాం. కానీ తాళం చెవి మిస్ కావడంతో, ఓ గూడ్స్ రైలు గంటల పాటు రైల్వే స్టేషన్లోనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మథుర నుంచి రివారికి వెళ్తున్న బొగ్గుతో నిండిన ఓ రైలు గుర్గావ్కు దగ్గరిలో బవల్ స్టేషన్లో దాదాపు ఎనిమిది గంటలకు పైగా ఆగిపోయింది. ఈ గూడ్స్ రైలును నడుపుతున్న సిబ్బంది స్విఫ్ట్‌లు మారే క్రమంలో రైలుకు సంబంధించిన తాళం చెవి మిస్ కావడంతో ఇలా వేచిచూడాల్సి వచ్చింది. దీంతో భారీ మొత్తంలో ట్రాఫిక్ జామ్‌ఏర్పడి, వేరే మార్గాల్లో రైళ్లు ప్రయాణించాల్సి వచ్చింది. మథురలో ప్రారంభమైన ఈ రైలు, రివారికి చేరుకోవాల్సి ఉంది. మార్గం మధ్యలో డ్రైవర్, గార్డులు మారతారు. రైలును స్టేషన్లో ఆపిన తర్వాత కొత్త సిబ్బంది ఛార్జ్ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త సిబ్బంది స్విఫ్ట్‌ను తీసుకునే సమయంలో స్టేషన్ మాస్టర్ కీస్ అడిగాడు. ముందు స్విఫ్ట్‌లో ఉన్న సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కావడంతో, తెలియక వారు తాళం చెవి ఇవ్వకుండా వెళ్లిపోయారు. అంతేకాక వారు మొబైల్ నెంబర్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి, జైపూర్ నుంచి కొత్త తాళం చెవిని తెప్పించేంత వరకు రైలును కదలలేదు. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు ఎనిమిది గంటలకు పైగా సమయం పట్టింది. -
రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం
– మృతిపై పలు అనుమానాలు ఆలూరు రూరల్: మొలగవళ్లి రైల్వేస్టేషన్ సమీపంలో (సిగ్నల్ పాయింట్ వద్ద ఆస్పరి రైల్వేస్టేషన్ నుంచి మొలగవళ్లి మీదుగా వెళ్లే మార్గం) సోమవారం ఉదయం 9 గంటల సమయంలో 20 ఏళ్ల వయస్సు ఉన్న యువతి మృతదేహాన్ని గొర్రెల కాపరులు గుర్తించారు. స్థానిక రైల్వే స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్టేషన్ మాస్టర్, గ్యాంగ్మెన్లు అక్కడికి వెళ్లి రైల్వే ట్రాక్ మధ్య పడి ఉన్న యువతి మృతదేహాన్ని పరిశీలించారు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల్లోపు ముంబాయి నుంచి చెన్నై, ముంబాయి నుంచి కోల్హాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..యువతి పడి ఉన్న మృతదేహం పక్కనున్న ట్రాక్‌పై వెళ్లాయి. ఆ యువతి ప్రమాదవశాత్తు ఆ రైళ్ల నుంచి కిందపడి మృతిచెందిందేమోనని మొలగవళ్లి రైల్వేస్టేషన్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదోని జీఆర్పీ పోలీసులకు సమాచారం అందిచగా..సాయంత్రం 6 గంటలకు కూడా వారు రాలేదు. మృతదేహానికి కొద్ది దూరంలో మందుబాటిళ్లు , వాటర్‌బాటిళ్లు పడి ఉన్నాయి. ఆ యువతిని ఎవరైనా అక్కడికి తీసుకొచ్చి చంపి పడేశారా, లేక ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి మృతిచెందిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే ట్రాక్ మధ్యలో ఆమె కుడికాలు తెగి పడి ఉంది. ముఖం కూడా గుర్తుపట్టని విధంగా ఉంది. -
నిలిచిపోయిన సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్
దొరవారిసత్రం(నెల్లూరు): పాట్నా నుంచి బెంగళూరు వెళ్లే.. సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ నెల్లూరు జిల్లా దొరవారిసత్రం రైల్వేస్టేషన్లో ఆగిపోయింది. దొరవారిసత్రం, పోలీరెడ్డిపాలెం గ్రామాల మధ్య అప్‌లైన్ మార్చుతుండటంతో.. ఈ అసౌకర్యం కలిగినట్టు స్టేషన్ మాస్టర్ తెలిపారు. రైలు రెండుగంటలకు పైగా నిలిచిపోవడంతో.. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
స్టేషన్‌మాస్టర్‌గా పనిచేసిన పిల్లి..ఇక లేదు
-
రైల్వే మంత్రి తమ్ముడు.. ఓ స్టేషన్ మాస్టర్!!
డీవీ సురేష్ గౌడ.. ఈయన కర్ణాటకలో ఓ రైల్వే స్టేషన్ మాస్టర్. నిన్న మొన్నటి వరకు అంతే. కానీ, ఇప్పుడు ఆయన స్వయానా రైల్వే మంత్రి సదానంద గౌడకు తమ్ముడు. తమ సొంత రాష్ట్రంలో, అందునా దక్షిణ కన్నడ ప్రాంతంలో రైల్వేలలో భద్రతా వ్యవస్థను తన అన్నయ్య మెరుగు పరచాలని ఆయన కోరుకుంటున్నారు. మంగళూరు సమీపంలోని నందికూర్ అనే స్టేషన్లో ఈయన పనిచేస్తున్నారు. తనకోసం అన్నయ్య ఏమీ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పుడు కూడా తన కోసం ఆయన్ను ఏమీ అడగలేదని సురేష్ గౌడ తెలిపారు. తన అన్నకు కేబినెట్ హోదా లభిస్తుందని అనుకున్నాను గానీ, ఏకంగా రైల్వేల లాంటి మంచి శాఖ వస్తుందనుకోలేదని అన్నారు. ఆర్ఆర్బీ పరీక్షలు రాసి 1985లో హుబ్లీలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌గా ఈయన తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. -
రైలును ఆపి డ్రైవర్ పరార్
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: పనిభారాన్ని తట్టుకోలేక కడంబత్తూరు రైల్వేస్టేషన్లో రైలును నిలిపి డ్రైవర్ పరారవడంతో దాదాపు 45 నిమిషాల పాటు రైలు నిలిచిపోరుుంది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు కడంబత్తూరు స్టేషన్‌మాస్టర్ రామరాజమీనన్పై చేయి చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. చెన్నై నుంచి అరక్కోణం వరకు నడిచే (నంబర్ 43409) రైలు ఉదయం 10.20 గంటలకు కడంబత్తూరు రైల్వేస్టేషన్‌కు రావాల్సి వుండగా 10.45 గంటలకు చేరింది. రైలును మొదటి ప్లాట్‌ఫాంపై నిలిపిన డ్రైవర్ ఇంటికి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. దాదాపు 25 నిమిషాల పాటు రైలు కదలకపోవడంతో ఆగ్రహించిన ప్రయాణికులు ఇంజిన్ వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే డ్రైవర్ ఇంటికి వెళ్లిపోయి ఉండడంతో ప్రయాణికులు స్టేషన్ మాస్టర్ గది వద్దకు వెళ్లారు. దాదాపు అరగంట దాటుతున్నా రైలు ఎందుకు బయలుదేరడం లేదని వారు ప్రశ్నించారు. ఇందుకు స్టేషన్ మాస్టర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహించిన ప్రయాణికులు, స్టేషన్ మాస్టర్ రామరాజమీనన్ తో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌పై దాడికి యత్నించారు. ఈ తతంగాన్ని తిరువళ్లూరు, అరక్కోణం ప్రాంతాలకు వాకీటాకీ ద్వారా సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎల్ఆర్ఎస్(లీవ్ రిజర్వ్డ్ సర్వీసు)లో ఉన్న డ్రైవర్‌ను అరక్కోణం నుంచి వస్తున్న లాల్బాగ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా పిలిపించి సర్దుబాటు చేశారు. దీంతో అరక్కోణం నుంచి వచ్చిన డ్రైవర్‌తో దాదాపు 45 నిమిషాల తరువాత రైలును ముందుకు నడిపించారు. పని ఒత్తిడే కారణమా? కడంబత్తూరు రైల్వేస్టేషన్లో రైలును నిలిపి వేసి డ్రైవర్ ఇంటికి వెళ్లిపోవడానికి పని ఒత్తిడే కారణమని తెలుస్తుంది. బుధవారం డ్యూటీలోకి చేరిన డ్రైవర్‌ను గురువారం ఉదయం లోపు రిలీవ్ చేయాల్సి ఉంది. అయితే గురువారం ఉదయం చెన్నై వరకు వె ళ్లిన డ్రైవర్ తిరువళ్లూరుకు చేరుకున్న తరువాత తనను డ్యూటీ మార్చాలని కోరారు. అయితే అప్పుడు రావాల్సిన డ్రైవర్ రాకపోవడంతో రైలు కడంబత్తూరు వరకు నడపాలని, అక్కడే ఉన్న డ్రైవర్ రిలీవ్ చేస్తారని సర్దిచెప్పి పంపిం చారు. అయితే కడంబత్తూరుకు చేరుకున్నాక కూడా డ్రైవర్‌ను రిలీవ్ చేసే వారు లేకపోవడంతో ఆగ్రహించిన డ్రైవర్ రైలును కడంబత్తూరులో నిలిపివేసి ఇంటికి వెళ్లిపోయారని రైల్వేలో పని చేస్తున్న అధికారి వెల్లడించారు. -
రైల్వే రిజర్వేషన్ ప్రయాణికులకు శుభవార్త!
విజయవాడ, న్యూస్‌లైన్: రైళ్లలో కన్ఫర్మ్ అయిన రిజర్వేషన్ టికెట్‌పై ప్రయాణించే వ్యక్తికి బదులు సంబంధిత కుటుంబసభ్యుల్లో ఎవరైనా ప్రయాణం చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతిచ్చినట్లు తెలిసింది. అయితే అధికారికంగా సమాచారం అందలేదని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్ టికెట్ కన్ఫర్మ్ అయిన వ్యక్తి ఏదైనా కారణాలతో చివరి క్షణంలో ప్రయాణం చేయలేకపోతే అతని కుటుంబానికి చెందిన ఇతరులెవరైనా అంటే భార్య, కుమారుడు, కుమార్తె దానిపై వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇలా ప్రయాణ ం చేయడానికి ముందు సంబంధిత వ్యక్తులు ఆ టికెట్ తీసుకుని రిజర్వేషన్ విభాగం సూపర్వైజర్ లేదా స్టేషన్ మాస్టర్ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అదే విధంగా ఆ కుటుంబసభ్యులనే విషయాన్ని ధ్రువీకరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీనిపై రెండు,మూడు రోజుల్లో ఉత్తర్వులు అందే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని దళారులు తమకు అనుకూలంగా మలచుకునే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్ల ఆ టికెట్‌దారుల కన్నా బ్రోకర్లకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉందని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త నిబంధనలు ఏ మేరకు అమలవుతాయో వేచి చూడాల్సిందే!