హాంకాంగ్ బుద్ధ విగ్రహాన్ని దర్శించిన కమిటీ
హైదరాబాద్ రాగానే సీఎంకు నివేదిక: కడియం
సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా చైనాలో పర్యటిస్తున్న అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కమిటీ మంగళవారం హాంకాంగ్‌లో బుద్ధ విగ్రహాలున్న ప్రదేశాల్లో పర్యటిం చింది. గ్యుయాన్‌ఇన్ బుద్ధ విగ్రహాన్ని సందర్శించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. దాదాపు 70 మీటర్ల ఎత్తైన బుద్ధ విగ్రహం (220 అడుగులు) అక్కడ నెలకొల్పినట్లు పేర్కొన్నారు. చైనాకు చెందిన ఏరోసన్ కంపెనీ దీనిని ఏర్పాటు చేసిందని చెప్పారు. భారీ విగ్రహాలను ఏర్పాటు చేయ డానికి కావాల్సిన మొత్తం సమాచారాన్ని, అన్ని అంశాలను, సాంకేతికంగా, తయారీ పరంగా అన్ని విషయాలను ఆ కంపెనీ ద్వారా తెలుసుకున్నామన్నారు.
భారీ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన నైపుణ్యం, మానవ వనరులు ఆ కంపెనీకి ఉన్నాయన్నారు. దీనిపై హైదరాబాద్‌కు వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక అందిస్తామన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఇచ్చే ఆదేశాలను బట్టి వీలైనంత త్వరగా హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ బృందంలో కడియం శ్రీహరితోపాటు విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆరూరి రమేశ్ ఇతర అధికారులు ఉన్నారు.