బీటీపీఎస్ రెడీ
700 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు రంగం సిద్ధం
పూర్తి కావస్తున్న మూడవ స్టేజ్ పనులు
జూన్ నుంచి విద్యుత్ ఉత్పాదన
1200 మందికి పైగా ఉద్యోగావకాశాలు
బళ్లారి : స్టీల్ సిటీ బళ్లారిలో మరో 700 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదనకు రంగం సిద్ధమవుతోంది. కుడితిని వద్ద ఉన్న బళ్లారి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్) విద్యుత్ ప్లాంట్‌లో 2010లో అప్పటి బీజేపీ ప్రభుత్వ హయాంలో బీటీపీఎస్‌లో రూ.3750 కోట్ల వ్యయంతో మరో 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు భూమిపూజ చేసింది. ఆ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. జూన్‌లోగా మూడో స్టేజీ విద్యుత్ ఉత్పాదన పనులు పూర్తి కానుండడంతో బళ్లారి జిల్లాకే కాకుండా కర్ణాటక రాష్ట్రానికి విద్యుత్ కొరత తీరేందుకు దోహదం చేస్తుందని అధికారులు చెబున్నారు. ఈ పనులు పూర్తి అయితే మొత్తం 1700 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన అవుతుందని సంబంధిత అధికారి పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ ఉత్పాదన పనుల్లో చిమ్నీ, కూలింగ్ టవర్, బాయిలర్ పనులు జరుగుతున్నాయి. మూడో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయితే బీటీపీఎస్‌లో దాదాపు 1200 మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది. కాగా, 2008లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో ప్రారంభించిన బీటీపీఎస్ 2012లో మరో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు రెండవ స్టేజ్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మొత్తం 1000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.