Steel plant sadhana samiti
-
స్టీల్‌ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతం
సీతంపేట (విశాఖ ఉత్తరం): విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సి.హెచ్.నరసింగరావు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఫిబ్రవరి 12 నాటికి 365 రోజులు పూర్తవుతున్న సందర్భంగా వార్షిక నిరసన తెలపడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 12న 365 మందితో 365 ఐక్య జెండాలతో స్టీల్ ప్లాంట్ వద్ద నిరాహార దీక్షతో నిరసన చేపడతామన్నారు. 13న విశాఖ నగర బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. సొంత గనులు కేటాయించాలన్న డిమాండ్‌తో 23న విశాఖ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆ రోజు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని అన్ని రాష్ట్ర రాజకీయపార్టీలను, ప్రజా సంఘాలను కోరుతున్నట్టు తెలిపారు. విశాఖ ప్రజలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు, అన్ని వర్గాలు కోటి సంతకాల ఉద్యమంలో పాలుపంచుకునేలా చేసి.. భవిష్యత్‌లో జరిగే పోరాటంలో ప్రత్యక్షంగా పా ల్గొనేలా చేస్తామన్నారు. కోటి సంతకాల సేకరణ ద్వారా కేంద్రానికి నిరసన తెలియ జేస్తామన్నారు. ఈ సమావేశంలో పోరాట కమిటీ చైర్మన్, ఇంటక్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, వైఎస్సార్టీయూసీ ప్రధాన కార్యదర్శి వై.మస్తానప్ప, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.రామకృష్ణ, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి, పోరాటకమిటీ సభ్యులు జి.గణపతిరెడ్డి పాల్గొన్నారు. -
ఈ నెల 25న వైఎస్ఆర్ జిల్లా బంద్
సాక్షి, కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 25న జిల్లా బంద్‌కు స్టీల్‌ప్లాంట్ సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సాధన సమితి తలపెట్టిన బంద్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. వైఎస్ఆర్పీపీ శ్రేణులంతా బంద్‌లో పాల్గొనాలని పార్టీ నేతలు అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, సురేష్‌బాబులు తెలిపారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఎస్‌పిఎస్‌ఎస్ నేతలు
- కర్మాగారం స్థాపనకు కృషి చేయాలని వినతి హైదరాబాద్ : వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపన కోసం పోరాటం చేస్తున్న స్టీల్ ప్లాంట్ సాధన సమితి (ఎస్‌పిఎస్‌ఎస్) నేతలు గురువారం హైదరాబాద్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో ఈ కర్మాగారం స్థాపించాల్సిన అవశ్యకత గురించి ఆయనకు వివరించారు. ఈ మేరకు వైఎస్ జగన్‌కు సమితి నేతలు ఓ వినతిపత్రం సమర్పించారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌ను విభజించేటపుడు చేసిన చట్టంలోనే ఆరు నెలల్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని పొందుపర్చారని, రాష్ట్రం ఏర్పడి 24 నెలలు దాటుతున్నా ఆ ఊసే లేదని ఇందులో పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కడపలో ఈ ఫ్యాక్టరీ వస్తే విస్తృతస్థాయిలో అక్కడ ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరం అవుతాయని, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందనీ పేర్కొన్నారు. ఓ రకంగా రాయలసీమ వెనుకబాటుతనాన్ని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలదని వినతిపత్రంలో సమితి నేతలు అభిప్రాయపడ్డారు. కర్మాగారం ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు జగన్‌ను కోరారు. అందుకు జగన్ వారితో ఏకీభవిస్తూ కర్మాగారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.