![Visakha SteelPlant Porata Committee unanimously decided over movement - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/24/ukku.jpg.webp?itok=fYXp6nka)
మాట్లాడుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సి.హెచ్.నరసింగరావు
సీతంపేట (విశాఖ ఉత్తరం): విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సి.హెచ్.నరసింగరావు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఫిబ్రవరి 12 నాటికి 365 రోజులు పూర్తవుతున్న సందర్భంగా వార్షిక నిరసన తెలపడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 12న 365 మందితో 365 ఐక్య జెండాలతో స్టీల్ ప్లాంట్ వద్ద నిరాహార దీక్షతో నిరసన చేపడతామన్నారు. 13న విశాఖ నగర బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. సొంత గనులు కేటాయించాలన్న డిమాండ్‌తో 23న విశాఖ బంద్‌కు పిలుపునిచ్చారు.
ఆ రోజు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని అన్ని రాష్ట్ర రాజకీయపార్టీలను, ప్రజా సంఘాలను కోరుతున్నట్టు తెలిపారు. విశాఖ ప్రజలు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు, అన్ని వర్గాలు కోటి సంతకాల ఉద్యమంలో పాలుపంచుకునేలా చేసి.. భవిష్యత్‌లో జరిగే పోరాటంలో ప్రత్యక్షంగా పా ల్గొనేలా చేస్తామన్నారు. కోటి సంతకాల సేకరణ ద్వారా కేంద్రానికి నిరసన తెలియ జేస్తామన్నారు. ఈ సమావేశంలో పోరాట కమిటీ చైర్మన్, ఇంటక్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, వైఎస్సార్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి వై.మస్తానప్ప, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.రామకృష్ణ, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి, పోరాటకమిటీ సభ్యులు జి.గణపతిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment