- కర్మాగారం స్థాపనకు కృషి చేయాలని వినతి
హైదరాబాద్ : వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపన కోసం పోరాటం చేస్తున్న స్టీల్ ప్లాంట్ సాధన సమితి (ఎస్‌పిఎస్‌ఎస్) నేతలు గురువారం హైదరాబాద్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో ఈ కర్మాగారం స్థాపించాల్సిన అవశ్యకత గురించి ఆయనకు వివరించారు. ఈ మేరకు వైఎస్ జగన్‌కు సమితి నేతలు ఓ వినతిపత్రం సమర్పించారు.
2014లో ఆంధ్రప్రదేశ్‌ను విభజించేటపుడు చేసిన చట్టంలోనే ఆరు నెలల్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని పొందుపర్చారని, రాష్ట్రం ఏర్పడి 24 నెలలు దాటుతున్నా ఆ ఊసే లేదని ఇందులో పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కడపలో ఈ ఫ్యాక్టరీ వస్తే విస్తృతస్థాయిలో అక్కడ ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరం అవుతాయని, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందనీ పేర్కొన్నారు.
ఓ రకంగా రాయలసీమ వెనుకబాటుతనాన్ని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలదని వినతిపత్రంలో సమితి నేతలు అభిప్రాయపడ్డారు. కర్మాగారం ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు జగన్‌ను కోరారు. అందుకు జగన్ వారితో ఏకీభవిస్తూ కర్మాగారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.