భానుప్రీతి మృతి కేసులో కీలక సమాచారం
విజయవాడలోని మేరీ స్టెల్లా విద్యార్థిని భాను ప్రీతి అనుమానాస్పద మృతి కేసులో కీలక సమాచారం లభ్యమైంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన భానుప్రీతి చేతి రాతతో ఉన్న మూడు పేర్లు, నాలుగు ఫోన్ నంబర్లు ఉన్న పేపర్ ఒకదాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది డస్ట్‌బిన్‌లో దొరికింది. అయితే రూంలో మరో ముగ్గురు కూడా ఉంటారు. దాంతో ఈ ఫోన్ నంబర్లున్న కాగితాన్ని భానుప్రీతే రాసిందా, మరెవరైనా రాశారా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, ఆ ఫోన్ నెంబర్లు ఎవరివన్న సమాచారాన్ని ఇంకా బయటపెట్టలేదు.
ఆమె తన తెలుగు పుస్తకంలో రాసుకున్న ఒక వాక్యాన్ని కూడా పోలీసులు గుర్తించారు. వీటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మరో వైపు మంగళవారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో భానుప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
కాలేజి యాజమాన్యం, పోలీసులు దీన్ని ఆత్మహత్యగా చెబుతున్నా, తమ కూతురు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇందులో ఏదో కుట్ర ఉందని ఆమె తండ్రి సుబ్బారావు అంటున్నారు. దీనిపై సీఐడీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.