అతని కోసం రిస్క్ చేశాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
ముంబై: గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా అరంగేట్రం చేసినప్పటికీ ఆ సీజన్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం చాలా నిరాశకు గురి చేసిందని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. తమ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ అది కేవలం కాగితాల వరకే పరిమితం కావడంతో అప్పుడు ఘోరంగా వెనుకబడిపోవడానికి కారణమైందని ఫ్లెమింగ్ తెలిపాడు.
ఐపీఎల్ -10 సీజన్ ఆటగాళ్ల వేలం సందర్భంగా బెన్ స్టోక్స్ ను అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసిన తరువాత ఫ్లెమింగ్ స్పందించాడు. 'ఇది కచ్చితంగా రిస్క్ తో కూడిన అంశమే. బెన్ స్టోక్స్ కు రూ.14.5 కోట్లు పెట్టడం అంటే అది చాలా పెద్ద సాహసమే. ఇక్కడ మా ఫ్రాంచైజీ యాజమాన్యం స్టోక్స్ కొనుగోలు విషయంలో భారీ రిస్క్ చేసింది. కొంతమంది కీలక ఆటగాళ్లు అవసరమని భావించే రిస్క్ చేశాం. మా జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. దాంతో సీనియర్ ఆటగాళ్లు అవసరం కూడా ఉంది. జట్టును సమతుల్యం చేయడం కోసమే ఆటగాళ్ల కొనుగోలులో కొంతవరకూ రిస్క్ చేయాల్సి వచ్చింది. అత్యధికంగా డబ్బు పెట్టడం అంటే రిస్క్ కదా. ఆ రిస్క్ చేయడానికి పుణె సిద్ధంగా ఉంది కాబట్టే అలా చేసింది'అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.