Stephanie Taylor
-
విండీస్ దెబ్బకు బంగ్లా బేజారు
ప్రావిడెన్స్ (గయానా): డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్... బంగ్లాదేశ్‌ను గడగడలాడించింది. తాము తక్కువ స్కోరుకే పరిమితమైనా, ప్రత్యర్థిని మరింత దారుణంగా కుప్పకూల్చింది. మహిళల టి20 ప్రపంచ కప్‌లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ డిండ్రా డాటిన్ (5/5) మెరుపు బౌలింగ్‌తో వెస్టిండీస్ 60 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్... నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కిసియా నైట్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (29) ఫర్వాలేదనిపించింది. స్వల్ప లక్ష్యమే అయినా... బంగ్లాకు అదే కొండలా కనిపించింది. డాటిన్, షకీరా సెల్మన్ (2/12) జోరుకు ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఫర్జానా హక్ (8) చేసిన స్కోరే అత్యధికం కావడం గమనార్హం. డాటిన్ 3.4 ఓవర్లు వేసి ఐదు పరుగులే ఇచ్చి... మిడిలార్డర్‌ను చెల్లాచెదురు చేసింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 52 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు అలీసా హీలీ (29 బంతుల్లో 48; 8 ఫోర్లు, 1 సిక్స్), బెథానీ మూనీ (39 బంతుల్లో 48; 6 ఫోర్లు) చక్కటి ఆరంభాన్నిచ్చారు. కెప్టెన్ మేఘన్ లానింగ్ (34 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఐదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఛేదనలో ఆసీస్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పాక్ 8 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉమామియా సొహైల్ (20), బిస్మా మహరూఫ్ (26) మినహా మరెవరూ నిలవలేకపోయారు. -
చాంపియన్... షాంపేన్
► మిన్నంటిన వెస్టిండీస్ క్రికెటర్ల సంబరాలు విజయాన్ని ఎలా వేడుకగా జరుపుకోవాలో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. అదే ప్రపంచకప్ గెలిస్తే ఇక వారి సంబరాలకు పట్టపగ్గాలు ఉండవు. 2012లో గంగ్నమ్ డ్యాన్స్‌తో విండీస్ హోరెత్తిస్తే ఈ సారి చాంపియన్ పాట వారితో నాట్యమాడించింది. మైదానంలో గెలుపు తర్వాత మొదలైన సంబరాలు సోమవారం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కొనసాగాయి. స్టేడియంలో ఫైనల్ ముగిసిన తర్వాతే విండీస్ క్రికెటర్లు పట్టరాని ఆనందంతో చిందులు వేశారు. అక్కడ అలసిపోయేంత వరకు ఆడిపాడిన బృందం హోటల్‌కు చేరగానే మళ్లీ కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుంది. ఎంట్రన్స్నుంచే చాంపియన్ డ్యాన్స్ చేసుకుంటూ వారు లోపలికి వచ్చారు. అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరిన అభిమానులు కూడా డ్యాన్స్ చేస్తూ ఉత్సాహపరచడంతో స్యామీ, బ్రేవో చెలరేగిపోయారు. మధ్యలో సెల్ఫీల కోసం సంబరపడిన ఎవరినీ వారు నిరాశ పర్చలేదు. స్పెషల్ నైట్ వేడుకలకు విరామం ఇవ్వకుండా హోటళ్లో మళ్లీ అంతా ఒక్కచోటికి చేరారు. అక్కడ షాంపేన్ వరదలా పారింది. అప్పటికే హోటల్ ప్రతినిధులు సిద్ధం చేసిన కేక్‌ను కట్ చేయడంతో మరో రౌండ్ సంబరాలు మొదలయ్యాయి. చాంపియన్ పాటతో జోష్ మొదలైనా... తర్వాత హాలీవుడ్ సంగీతం అక్కడ హోరెత్తింది. ప్రపంచ విజేతలు ఈ ప్రపంచాన్ని మరచిపోయి డ్యాన్స్‌తో చెలరేగిపోయారు. మధ్యలో విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ కూడా వారితో జత కలవడం ఆటగాళ్ల ఉత్సాహాన్ని మరింత పెంచింది. అభినందించేందుకు రూమ్‌కు వచ్చిన లాయిడ్ కూడా చాంపియన్ డ్యాన్స్ చేయడం విశేషం. విండీస్ ఫైనల్‌ను టీవీలో వీక్షించిన అనంతరం ఇదే డ్యాన్స్ చేసి జట్టుకు అభినందనలు పలికిన విఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఆ వీడియోను జట్టు సభ్యులకు పంపించగా... వారంతా ఆసక్తిగా తిలకించారు. సోమవారం మధ్యాహ్నం విక్టోరియా ప్యాలెస్ వద్ద ఫోటో సెషన్‌కు స్యామీ, బ్రాత్‌వైట్ హాజరు కాగా, సాయంత్రంనుంచి ఆటగాళ్లు బయల్దేరి వెళ్లారు. వీరిలో కొందరు నేరుగా తమ ఐపీఎల్ జట్లతో చేరగా, ఇతర ఆటగాళ్లు విండీస్ పయనమయ్యారు. ► కోల్‌కతాలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్ భవనం ముందు ప్రపంచకప్ ట్రోఫీలతో వెస్టిండీస్ మహిళల కెప్టెన్ స్టెఫానీ టేలర్, పురుషుల జట్టు కెప్టెన్ స్యామీ చూస్తున్నవాళ్లం అలసిపోయాం మామూలుగానే విండీస్ క్రికెటర్లు చిన్న చిన్న సంతోషాలను కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఈ విజయం తర్వాత చెప్పేదేముంది. చూస్తున్నవాళ్లం అలసిపోయాం కానీ వారు మాత్రం ఆట, పాటతో అలసిపోలేదు. ప్రాక్టీస్ సమయంలో, ఆడే సమయంలో కూడా వాళ్లు తీవ్రంగా శ్రమిస్తారు. వంద శాతం కష్టపడతారు. అదే మైదానం దాటితే సంబరాలు కూడా అదే తరహాలో రెట్టింపు స్థాయిలో ఉంటాయి. హోటల్లోని టీమ్ రూమ్‌లో అడుగు పెట్టిన తర్వాత వారో కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో గేల్ అయినా, మరే జూనియర్ ఆటగాడైనా ఒక్కటే. ఇలాంటి గొప్ప జట్టుతో టోర్నీకి పని చేయడం నా అదృష్టం - విక్రమ్ మాన్సింగ్, వెస్టిండీస్ టీమ్ లైజన్ మేనేజర్ -
కరీబియన్ మహిళలు తొలిసారి...
► ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్ ► సెమీస్‌లో 6 పరుగులతో న్యూజిలాండ్ ఓటమి ముంబై నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ మహిళల జట్టు తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించింది. అంచనాలకు మించి రాణించిన ఆ జట్టు గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీ ఫైనల్లో పటిష్టమైన న్యూజిలాండ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. బ్రిట్నీ కూపర్ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, స్టెఫానీ టేలర్ (26 బంతుల్లో 25; 2 ఫోర్లు) రాణించింది. కివీస్ బౌలర్లలో సోఫీ డెవిన్ 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. సారా మెక్‌గ్లాషన్ (30 బంతుల్లో 38; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. సాటర్‌వెయిట్ (24), డెవిన్ (22) ఫ ర్వాలేదనిపించారు. స్టెఫానీ టేలర్‌కు 3 వికెట్లు దక్కా యి. విండీస్ చక్కటి బౌలింగ్, అద్భుత ఫీల్డింగ్‌తో కివీస్‌ను కట్టి పడేసింది. ఆదివారం కోల్‌కతాలో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడుతుంది. -
మహిళల పోరాటం ముగిసింది
మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: టి20 ప్రపంచకప్‌నుంచి భారత మహిళల జట్టు నిష్ర్కమించింది. సెమీస్ చేరే ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు పోరాడిన భారత్... 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 114 పరుగులు చేయగా, భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 111 పరుగులు చేయగలిగింది. ఆఖరి ఓవర్లో విజయానికి 10 పరుగులు అవసరం కాగా, భారత్ 2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో వెస్టిండీస్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. టోర్నీలో ఒక్క బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలిచి పాకిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్ చేతిలో ఓడిన భారత్ లీగ్ దశలోనే నిష్ర్కమించింది. కీలక భాగస్వామ్యం: టాస్ గెలిచిన భారత్ వెస్టిండీస్‌కు బ్యాటింగ్ అప్పగించింది. 26 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయి ఆ జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ స్టెఫానీ టేలర్ (45 బంతుల్లో 47; 5 ఫోర్లు), డాటిన్ (40 బంతుల్లో 45; 5 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 65 బంతుల్లో 77 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే భారత బౌలర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ (4/23), అనూజ (3/16) చెలరేగడంతో విండీస్ 11 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. తొలి బంతితోనే..: లక్ష్యఛేదనలో తొలి బంతికే భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ మిథాలీరాజ్ (0) తొలి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో జట్టు పతనం ప్రారంభమైంది. స్మృతి మందన (27 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించినా, తక్కువ వ్యవధిలో మరో 3 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత అనూజ పాటిల్ (27 బంతుల్లో 26; 1 ఫోర్), జులన్ గోస్వామి (19 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన డాటిన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇంగ్లండ్ విజయం చెన్నై: టి20 మహిళల ప్రపంచకప్‌లో లీగ్ దశను ఇంగ్లండ్ జట్టు అజేయంగా ముగించింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో నెగ్గింది. ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 148 పరుగులు చేసింది. చార్లెట్ ఎడ్వర్డ్స్ (77) రాణించింది. పాకిస్తాన్ 17.5 ఓవర్లలో 80 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సెమీఫైనల్స్‌లో ఆసీస్‌తో ఇంగ్లండ్.. న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడుతాయి.