ప్రావిడెన్స్ (గయానా): డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్... బంగ్లాదేశ్‌ను గడగడలాడించింది. తాము తక్కువ స్కోరుకే పరిమితమైనా, ప్రత్యర్థిని మరింత దారుణంగా కుప్పకూల్చింది. మహిళల టి20 ప్రపంచ కప్‌లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ డిండ్రా డాటిన్ (5/5) మెరుపు బౌలింగ్‌తో వెస్టిండీస్ 60 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్... నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కిసియా నైట్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (29) ఫర్వాలేదనిపించింది. స్వల్ప లక్ష్యమే అయినా... బంగ్లాకు అదే కొండలా కనిపించింది. డాటిన్, షకీరా సెల్మన్ (2/12) జోరుకు ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
ఫర్జానా హక్ (8) చేసిన స్కోరే అత్యధికం కావడం గమనార్హం. డాటిన్ 3.4 ఓవర్లు వేసి ఐదు పరుగులే ఇచ్చి... మిడిలార్డర్‌ను చెల్లాచెదురు చేసింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 52 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు అలీసా హీలీ (29 బంతుల్లో 48; 8 ఫోర్లు, 1 సిక్స్), బెథానీ మూనీ (39 బంతుల్లో 48; 6 ఫోర్లు) చక్కటి ఆరంభాన్నిచ్చారు. కెప్టెన్ మేఘన్ లానింగ్ (34 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఐదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఛేదనలో ఆసీస్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పాక్ 8 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉమామియా సొహైల్ (20), బిస్మా మహరూఫ్ (26) మినహా మరెవరూ నిలవలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment