T-20 cricket
-
దక్షిణాఫ్రికాదే సిరీస్
ప్రిటోరియా: శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌ను 5–0తో క్లీన్ స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా టి20 సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. రెండో టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 16 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్కించుకుంది. మొదట దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 180 పరుగులు చేసింది. హెండ్రిక్స్ (46 బంతుల్లో 65; 9 ఫోర్లు), వాన్ డర్ డసెన్ (44 బంతుల్లో 64; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 164 పరుగులు చేసి ఓడిపోయింది. 83 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో శ్రీలంక ఆటగాడు ఇసురు ఉదాన (48 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అయినా శ్రీలంకను గట్టెక్కించలేకపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోరిస్ (3/32), స్టెయిన్ (2/34), షమ్సీ (2/16) రాణించారు. -
గెలుపు గోవిందా
మ్యాచ్‌కు ముందు పుల్వామా ఘటనకు సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు రెండు నిమిషాల మౌనం పాటించారు. కానీ మ్యాచ్‌లో కూడా ఎక్కువ భాగం మైదానంలో ఇలాంటి నిశ్శబ్ద వాతావరణమే కనిపించింది. భారత్ బ్యాటింగ్ చేసినంత సేపు మెరుపులు లేకపోగా... ఫీల్డింగ్ సమయంలో ఒక దశలో ఓటమి వెంటాడుతుండగా వైజాగ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చివర్లో కొంత ఉత్సాహం వచ్చినా ఆఖరికి ఓటమితోనే విశాఖ ప్రేక్షకులు వెనుదిరగాల్సి వచ్చింది. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 14 పరుగులు కావాలి. టెయిలెండర్లు క్రీజ్‌లో ఉండగా ఉమేశ్ చేతిలో బంతి. అంతకుముందు ఓవర్లో 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన బుమ్రా తానేమిటో చూపిస్తే ఉమేశ్ తాను ఏం చేయగలడో అదే తప్పు చేశాడు. అతని పేలవ బౌలింగ్‌లో కమిన్స్, రిచర్డ్సన్ చెరో ఫోర్ బాదారు. చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా, రాహుల్ త్రో సరైన వైపు వెళ్లకపోవడంతో ఆసీస్ రెండో పరుగును విజయవంతంగా పూర్తి చేసుకొని విజయతీరాలకు చేరింది. విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి : టి20ల్లో వరుసగా 61 బంతుల పాటు భారత్ బౌండరీని బాదకపోవడం చాలా అరుదు. ఆదివారం ఇలాంటి ఇన్నింగ్సే ఆడిన టీమిండియా ముందే ఓటమిని ఆçహ్వానించింది. చివర్లో కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఫలితంగా తొలి టి20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులే చేయగలిగింది. రాహుల్ (36 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... ధోని (37 బంతుల్లో 29 నాటౌట్; 1 సిక్స్), కోహ్లి (17 బంతుల్లో 24; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రాహుల్, కోహ్లి కలిసి రెండో వికెట్‌కు 37 బంతుల్లో 55 పరుగులు జోడించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కూల్టర్ నీల్ 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (43 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డార్సీ షార్ట్ (37 బంతుల్లో 37; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 68 బంతుల్లో 84 పరుగులు జత చేశారు. రెండో టి20 బుధవారం బెంగళూరులో జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో పంజాబ్ ఆటగాడు మయాంక్ మార్కండే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున టి20లు ఆడిన 79వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. మిడిలార్డర్ విఫలం... బెహ్రన్‌డార్ఫ్ వేసిన తొలి ఓవర్లో చేసిన ఒకే పరుగుతో భారత్ ఇన్నింగ్స్ ప్రారంభం కాగా... రిచర్డ్సన్ తర్వాతి రెండు ఓవర్లలో రాహుల్ రెండేసి ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. మరోవైపు రోహిత్ (5) ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. ఆ తర్వాత కోహ్లి ఐదు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు బాది జోరును ప్రదర్శించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ స్కోరు 49 పరుగులకు చేరింది. అనంతరం ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చాడు. అనంతరం తన స్వీయ తప్పిదం, బెహ్రన్‌డార్ఫ్ అద్భుత ఫీల్డింగ్ కలగలిసి రిషభ్ పంత్ (3) రనౌట్‌కు కారణమయ్యాయి. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ తడబాటు కొనసాగింది. 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్‌తో పాటు దినేశ్ కార్తీక్ (1)ను ఒకే ఓవర్లో కూల్టర్ నీల్ ఔట్ చేశాడు. కృనాల్ పాండ్యా (1) విఫలం కాగా, ఉమేశ్ యాదవ్ (2) కూడా నిలవలేదు. మరో ఎండ్‌లో ధోని కొంత పోరాడే ప్రయత్నం చేసినా అందులోనూ దూకుడు కనిపించలేదు. ఎన్నో సార్లు భారీ షాట్లకు ప్రయత్నించి అతను విఫలమయ్యాడు. సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా... చహల్ (0 నాటౌట్)ను వారించి తనే బాధ్యత తీసుకోబోయాడు. ఎట్టకేలకు తాను ఎదుర్కొన్న 33వ బంతికి ధోని సిక్సర్ కొట్టినా... అది జట్టు భారీ స్కోరుకు సరిపోలేదు. తొమ్మిదో ఓవర్ చివరి బంతికి రాహుల్ సిక్సర్ కొడితే... చివరి ఓవర్ రెండో బంతిని ధోని సిక్స్‌గా మలచే వరకు భారత్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేదంటే పరిస్థితి అర్థమవుతుంది. భారీ భాగస్వామ్యం... స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు పేలవ ఆరంభం లభించింది. చహల్ ఫీల్డింగ్‌కు స్టొయినిస్ (1) రనౌట్ కాగా, బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికే ఫించ్ (0) ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూలో కూడా ఫలితం లేకపోవడంతో 5 పరుగుల వద్దే ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. అయితే కొద్ది సేపట్లోనే భారత్‌కు ఈ ఆనందం దూరమైంది. షార్ట్, మ్యాక్స్‌వెల్ కలిసి భారత బౌలర్లపై చెలరేగారు. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. ఉమేశ్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను చహల్ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. అదే జోరులో 40 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చహల్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి మ్యాక్స్‌వెల్ లాంగాఫ్‌లో క్యాచ్ ఇవ్వడంతో భారీ భాగస్వామ్యం ముగిసింది. కొద్ది సేపటితో హ్యండ్స్‌కోంబ్ (13)తో సమన్వయ లోపంతో షార్ట్ కూడా వెనుదిరిగాడు. ఛేదనలో తడబాటుకు గురై 12 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఓటమి ఖాయమనిపించింది. అయితే చివరి బంతికి విజయంతో ఆసీస్ గట్టెక్కింది. ► 4 టి20ల్లో భారత్‌పై చివరి బంతికి ప్రత్యర్థి జట్టు నెగ్గడం ఇది నాలుగోసారి. న్యూజిలాండ్ (2009లో; లక్ష్యం 150), శ్రీలంక (2010లో; లక్ష్యం 164), ఇంగ్లండ్ (2014లో; లక్ష్యం 178), ఆస్ట్రేలియా (2019లో; లక్ష్యం 127) ఈ ఘనత సాధించాయి. -
ఎదురుందా మనకు?
3–0తో టి20 సిరీస్ విజయం. అదీ విదేశీ గడ్డపై... మేటి ఆటగాళ్లున్న జట్టు మీద! ఈ ఘనతను టీమిండియా 2016లో ఆస్ట్రేలియాలోనే సాధించింది. మళ్లీ అదే చోట... గతానికి మించిన బలంతో బరిలో దిగనుందిప్పుడు. మరోవైపు నాటి నుంచి ప్రదర్శన నానాటికీ దిగజారి... ప్రధాన ఆటగాళ్లు దూరమై... పరాజయాలతో కుదేలై... అప్పుడప్పుడు మాత్రమే గెలుస్తోంది కంగారూ జట్టు! రికార్డులు, బలాబలాలు, ప్రస్తుత ఫామ్... ఇలా అన్నింట్లో ప్రత్యర్థిపై ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది కోహ్లి సేన. కాస్తోకూస్తో కలిసొచ్చే సొంతగడ్డ అనుకూలత తప్ప ఏ అంశంలోనూ ఆశావహంగా లేదు ఫించ్ బృందం. ఈ నేపథ్యంలో సుదీర్ఘ పర్యటనను విజయంతో ప్రారంభించేందుకు భారత్‌కు ఇదే సరైన సమయం. బ్రిస్బేన్: అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియా పర్యటనకు నేటితో తెరలేవనుంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో బుధవారం జరుగనున్న తొలి పోరులో భారత్... ఆసీస్‌ను ఢీ కొననుంది. ఇటీవలి కాలంలో మ్యాచ్‌కు ముందు రోజే జట్టును ప్రకటిస్తున్న టీమిండియా మరోసారి అదే పద్ధతి పాటించింది. ఓవైపు విరాట్ కోహ్లి సేన పూర్తిస్థాయి బలగంతో సంసిద్ధంగా ఉండగా, రాబోయే టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా పలువురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. ఈ లెక్కన చూస్తే ఫించ్ నేతృత్వంలోని ఆతిథ్య జట్టుకు ఇది కఠిన పరీక్షే. ఆ ఒక్కరు ఎవరు? తుది జట్టుపై దాదాపు స్పష్టతతో ఉంది టీమిండియా. వెస్టిండీస్‌తో టి20 సిరీస్ నుంచి తప్పుకొన్న కెప్టెన్ కోహ్లి తిరిగి రావడంతో మనీశ్ పాండేను తప్పించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌లతో బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉంది. అయితే... ఇన్స్వింగర్లు, షార్ట్ బంతులతో రోహిత్‌ను పరీక్షించాలని ఆసీస్ భావిస్తోంది. ఈ సవాల్‌ను ‘హిట్‌మ్యాన్’ ఏ మేరకు ఛేదిస్తాడో చూడాలి. ధావన్‌తో కలిసి అతడు శుభారంభం అందిస్తే తర్వాత వచ్చేవారి పని సులభం అవుతుంది. పిచ్ పరిస్థితులరీత్యా భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్‌ల పేస్ త్రయం బరిలో దిగడం ఖాయం. స్పిన్ ద్వయం ఎవరనేదే తేలాల్సి ఉంది. కృనాల్ పాండ్యాను ఆల్‌రౌండర్ కోటాలో పరిగణిస్తే, మిగిలిన ఒక్క బెర్తుకు కుల్దీప్, చహల్‌లలో ఒకరిని ఎంచుకోవాలి. వైవిధ్యంరీత్యా కుల్దీప్ వైపే మొగ్గు చూపొచ్చు. ఆసీస్... స్పిన్నర్ లేకుండానే? ఇటీవల టి20ల్లో ఏ జట్టూ ఎదుర్కోనన్ని పరాజయాలను చవిచూసింది ఆస్ట్రేలియా. ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓటమి పాలైంది. ఒక స్వరూపమే లేదన్నట్లుందా జట్టు. దీనికి తగ్గట్లు ఈ సిరీస్ నుంచి పేసర్లు మిషెల్ స్టార్క్, హాజిల్‌వుడ్, కమ్మిన్స్‌తో పాటు స్పిన్నర్ నాథన్ లయన్‌కు విశ్రాంతినిచ్చింది. ఇక డీ ఆర్సీ షార్ట్, క్రిస్ లిన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్... వీరంతా మెరుపు ఇన్నింగ్స్ ఆడగలవారే అయినా ఒక్కరికీ నిలకడ లేదు. ఫించ్ మినహా ఎవరిపైనా భరోసా పెట్టుకోలేని పరిస్థితి. ఈ బ్యాటింగ్ లైనప్‌కు భారత బౌలింగ్‌ను ఎదుర్కొనడం సవాలే. ‘గబ్బా’ పిచ్ బౌన్స్ కారణంగా పేస్‌నే నమ్ము కుని స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే ఆడనున్నట్లు కనిపిస్తోంది. మ్యాక్స్‌వెల్ మాత్రమే ఏకైక స్పిన్నర్. బుమ్రాకిది ప్రత్యేకం దాదాపు మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపైనే అంతర్జాతీయ టి20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా. మూడు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు. అప్పటి నుం చి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదతడికి. తర్వాత వన్డే, టెస్టు జట్లలో కీలకమయ్యాడు. అహో! ఆ సిరీస్.. 2016 పర్యటనలో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని భారత్ మూడు టి20ల సిరీస్‌లో ఆస్ట్రేలియాను క్లీన్‌స్వీప్ చేసింది. స్టార్ ఆటగాళ్లైన స్మిత్, వార్నర్, వాట్సన్‌లు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాపై టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. కోహ్లి 199 పరుగులతో మెరిశాడు. దూకుడు అనేది మైదానంలో పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రత్యర్థి కవ్వింపులతో మా ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందని అనిపిస్తే తగినట్లు ప్రతిస్పందిస్తాం. మేం మాత్రం ముందుగా అలాంటివి చేయం. అయినా, విజయం కోసం ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం అనేదే దూకుడంటే. నా దృష్టిలో జట్టు గెలుపు కోసం 120 శాతం శ్రమించడం కూడా ఇలాంటిదే. దీనిని బాడీ లాంగ్వేజ్‌లోనూ చూపొచ్చు. –భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కొంతకాలంగా భారత్ అన్ని ఫార్మాట్లలో బలంగా ఉంది. అయినా, వారి నుంచి మ్యాచ్‌లను లాగేసుకోగలం. ఈ సిరీస్ మా సత్తా చాటేందుకు వేదిక. పరిస్థితులరీత్యానే స్పిన్నర్లు లేకుండా ఆడుతున్నాం. అయినా, మాకు ఆగర్, జంపా రూపంలో ప్రత్యామ్నాయాలున్నాయి. మేం ఎప్పుడూ విజయాన్ని కోరకుంటాం. దూకుడుగా ఆడటం ఆస్ట్రేలియన్ల లక్షణం. దానికి ప్రజలు వేర్వేరు భాష్యాలు చెప్పుకొంటారు. –అరోన్ ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్ తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి (కెప్టెన్), రాహుల్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, చహల్/కుల్దీప్, బుమ్రా, ఖలీల్. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), షార్ట్, లిన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, మెక్‌డెర్మట్, క్యారీ, కూల్టర్‌నీల్, ఆండ్రూ టై, బెహ్రెన్‌డార్ఫ్, స్టాన్లేక్. పిచ్, వాతావరణం గబ్బా పిచ్ అదనపు బౌన్స్‌కు పెట్టింది పేరు. బౌండరీలు పెద్దవి. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. మధ్యాహ్నం గం.1.20 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం -
టి20ల్లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకుకు కుల్దీప్
దుబాయ్: తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన టి20 సిరీస్... భారత ఆటగాళ్ల ర్యాంకులను మెరుగుపర్చింది. ఐసీసీ సోమవారం విడుదల చేసిన జాబితాలో బౌలర్ల విభాగంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కెరీర్ అత్యుత్తమ (23) ర్యాంకులో నిలిచాడు. అతడు 14 స్థానాలు ఎగబాకాడు. పేసర్ భువనేశ్వర్ (19వ ర్యాంకు) టాప్20లోకి వచ్చాడు. బుమ్రాకు 21వ స్థానం దక్కింది. బ్యాట్స్‌మెన్‌లో రోహిత్‌శర్మ మూడు స్థానాలు మెరుగు పర్చుకుని 7వ ర్యాంకులో, ధావన్ ఐదు స్థానాలు దాటుకుని 16వ ర్యాంకుకు చేరుకున్నారు. జట్లలో పాకిస్తాన్ (138), భారత్ (127) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
విండీస్ దెబ్బకు బంగ్లా బేజారు
ప్రావిడెన్స్ (గయానా): డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్... బంగ్లాదేశ్‌ను గడగడలాడించింది. తాము తక్కువ స్కోరుకే పరిమితమైనా, ప్రత్యర్థిని మరింత దారుణంగా కుప్పకూల్చింది. మహిళల టి20 ప్రపంచ కప్‌లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ డిండ్రా డాటిన్ (5/5) మెరుపు బౌలింగ్‌తో వెస్టిండీస్ 60 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్... నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కిసియా నైట్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (29) ఫర్వాలేదనిపించింది. స్వల్ప లక్ష్యమే అయినా... బంగ్లాకు అదే కొండలా కనిపించింది. డాటిన్, షకీరా సెల్మన్ (2/12) జోరుకు ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఫర్జానా హక్ (8) చేసిన స్కోరే అత్యధికం కావడం గమనార్హం. డాటిన్ 3.4 ఓవర్లు వేసి ఐదు పరుగులే ఇచ్చి... మిడిలార్డర్‌ను చెల్లాచెదురు చేసింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 52 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు అలీసా హీలీ (29 బంతుల్లో 48; 8 ఫోర్లు, 1 సిక్స్), బెథానీ మూనీ (39 బంతుల్లో 48; 6 ఫోర్లు) చక్కటి ఆరంభాన్నిచ్చారు. కెప్టెన్ మేఘన్ లానింగ్ (34 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఐదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఛేదనలో ఆసీస్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పాక్ 8 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉమామియా సొహైల్ (20), బిస్మా మహరూఫ్ (26) మినహా మరెవరూ నిలవలేకపోయారు. -
విండీస్‌ను కొట్టేందుకు..
దాదాపు ఏకపక్షంగానే సాగిన సిరీస్‌లో తుది అంకం. రెండు టెస్టులనూ అలవోకగా గెలిచేసి, ఐదు వన్డేల సిరీస్‌ను ఒడిసి పట్టేసిన టీమిండియాకు టి20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే అవకాశం. విజయాల ఊపులో ఉన్న రోహిత్ బృందానికిది నల్లేరుపై నడకే! అటు ఆటలో, ఇటు దృక్పథంలో తేలిపోతున్న కరీబియన్లు విజయం అందుకోవాలంటే శక్తికి మించి ఆడాల్సిందే! చెన్నై: పెద్దగా శ్రమించకుండానే వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌కు... దానిని సంపూర్ణ విజయంగా మార్చుకునే సందర్భం వచ్చింది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా ఆదివారం జరుగనున్న మూడో టి20 ఇందుకు వేదిక కానుంది. ఇప్పటికే సిరీస్ వశమైనందున టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. మరోవైపు పర్యాటక జట్టు పరాభవం తప్పించుకునే ప్రయత్నం చేయనుంది. తుది జట్టులోకి చహల్, సుందర్... బుమ్రా, కుల్దీప్లకు విశ్రాంతి ఇవ్వడంతో ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. వీరి స్థానాల్లో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్, స్థానిక కుర్రాడు వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు. గత మ్యాచ్‌ల్లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో దిగిన టీమిండియా... చెన్నై పిచ్ స్వభావంరీత్యా ఇద్దరు పేసర్లు, ఆల్‌రౌండర్ సహా ముగ్గురు స్పిన్నర్ల వ్యూహానికి మొగ్గు చూపుతున్నట్లుంది. దీంతో సిద్ధార్థ్ కౌల్, ఎడంచేతి వాటం స్పిన్నర్ షాబాజ్ నదీమ్‌కు అవకాశం లేనట్లైంది. చివర్లో నిర్ణయం మారితే... నదీమ్ అరంగేట్రం చేయొచ్చు. కెప్టెన్ రోహిత్ గత మ్యాచ్‌లోలానే చెలరేగాలని జట్టు ఆశిస్తోంది. ఓపెనర్ ధావన్ ఫామ్‌లోకి రావడం మరింత బలం కానుంది. కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్‌లతో బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉంది. భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్ పేస్ బాధ్యతలు చూసుకుంటారు. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాతో పాటు చహల్, సుందర్ స్పిన్ భారం పంచుకుంటారు. విండీస్... ఈ ఒక్కటైనా! ప్రధాన ఆటగాళ్లు దూరమై... ముందే డీలాపడిన వెస్టిండీస్ టి20 సిరీస్‌లో మరీ తేలిపోయింది. లక్నోలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆ జట్టు అత్యంత పేలవంగా ఆడింది. హెట్‌మైర్, బ్రేవో, పొలార్డ్ వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. బౌలింగ్‌లో ఒషేన్ థామస్ పేస్ మినహా చెప్పుకొనేదేమీ లేదు. చెన్నైలోనైనా గెలిస్తే జట్టుకు కొంత ఉపశమనం దక్కుతుంది. ఈ మ్యాచ్‌కు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ రామ్‌దిన్‌ను తప్పించి రావ్మన్ పావెల్‌ను తీసుకోనుంది. నికొలస్ పూరన్ కీపింగ్ చేస్తాడు. సరైన వ్యవస్థ లేకే... విండీస్ క్రికెట్ దుస్థితిపై బ్రియాన్ లారా ఆవేదన సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ దుస్థితికి కారణం తమ దేశంలో యువతరాన్ని తీర్చిదిద్దే సరైన వ్యవస్థ లేకపోవడమేనని దిగ్గజ క్రికెటర్, విండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా ఆవేదన వ్యక్తం చేశాడు. కృష్ణపట్నం పోర్టు గోల్డెన్ ఈగల్స్ గోల్ఫ్ చాంపియన్ షిప్ కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన లారా తమ దేశ క్రికెట్‌కు సంబంధించిన పలు అంశాలపై మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. విండీస్ క్రికెట్ బోర్డు శక్తిమంతంగా లేకపోవడం కూడా తమ స్థితికి కారణమన్నాడు. క్రికెట్ భవిష్యత్‌కు ఆధారమైన యువతరాన్ని చేరదీయడంలో తమ బోర్డు విఫలమైందని విమర్శించాడు. మౌలిక వసతులు, స్టేడియాలు బాగున్నప్పటికీ యువ క్రికెటర్లను తీర్చిదిద్దే సరైన వ్యవస్థ లేకపోవడంతో క్రికెట్ అభివృద్ధి కుంటుపడిందని వివరించాడు. ‘భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల తరహాలో దేశవాళీ క్రికెట్ అభివృద్ధి కోసం మా బోర్డు కృషి చేయడంలేదు. ఫలితంగా గత మూడు, నాలుగేళ్లుగా ప్రతిభ గల యువ క్రికెటర్లు వెలుగులోకి రాలేకపోతున్నారు. వారిని సానబెట్టే వ్యవస్థ ప్రస్తుతం మా దగ్గర లేదు’ అని పేర్కొన్నాడు. భారత పర్యటనలో టెస్టుల్లో విండీస్ విఫలమైన తీరుపై లారా విచారం వ్యక్తం చేశాడు. ‘టెస్టుల్లో ప్రదర్శనే ఒక జట్టు స్థాయిని నిర్ణయిస్తుంది. కానీ భారత్‌పై తొలి రెండు టెస్టులను విండీస్ మూడు రోజుల్లోనే ముగించింది. ఇది ఆశించదగినది కాదు. మూడు రోజులకు మించి విండీస్ టెస్టు ఆడలేకపోతోంది. ఈ అంశం నాకు చాలా నిరాశ కలిగించింది’ అని వివరించాడు. యువతరాన్ని తీర్చిదిద్దితేనే విండీస్ క్రికెట్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది తన బయోగ్రఫీని విడుదల చేస్తానని లారా ప్రకటించాడు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాహుల్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, పంత్, కృనాల్, సుందర్, చహల్, భువనేశ్వర్, ఖలీల్. వెస్టిండీస్: షై హోప్, పూరన్, హెట్‌మైర్, డారెన్ బ్రేవో, పొలార్డ్, బ్రాత్‌వైట్ (కెప్టెన్), రావ్మన్ పావెల్, కీమో పాల్, అలెన్, పియర్, థామస్. పిచ్, వాతావరణ చెపాక్ మైదానం స్పిన్‌కు అనుకూలిస్తుంది. రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఇది రెండో టి20. ఆరేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో ఓడించింది.చెపాక్ మైదానం స్పిన్‌కు అనుకూలిస్తుంది. రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఇది రెండో టి20. ఆరేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో ఓడించింది. రాత్రి గం.7 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
రోహితారాజువ్వ
అతడి ధాటైన ఆటకు పెద్ద మైదానం చిన్నబోయింది. 50 వేల మందితో నిండిన స్టేడియం హోరెత్తింది. లాంగాఫ్, లాంగాన్‌లో రాకెట్లలాంటి సిక్స్‌లను చూసి మిన్నంటింది. మిడాన్‌లో చిచ్చుబుడ్డిలా ఎగసిన షాట్లకు మురిసిపోయింది. కవర్స్, పాయింట్ దిశగా కొట్టిన బౌండరీలతో మతాబులా వెలిగిపోయింది. ప్రేక్షకులు, అభిమానులకు దీపావళి ఒక రోజు ముందే వచ్చినట్లైంది. వెరసి... రోహిత్ శర్మ సొగసైన ఇన్నింగ్స్‌కు మరో శతకం దాసోహమైంది. భారత్‌కు విజయం...విండీస్ కు పరాజయం ఖాయమైంది. లక్నో: రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను నిదానంగా మొదలు పెట్టాడంటే, అది కచ్చితంగా తుపానుకు ముందు ప్రశాంతతే అనుకోవాలి! మరో భారీ స్కోరుకు క్రీజులో బలమైన పునాది వేస్తున్నాడని భావించాలి! తానేదో బీభత్సం సృష్టించబోతున్నాడని అర్థం చేసుకోవాలి! అతడి రికార్డులు, ఘనతలు చూసి అద్భుతం చేయబోతున్నాడని ఊహించాలి! మంగళవారం వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన రెండో టి20లో సరిగ్గా ఇవన్నీ అలా... అలా... ఓ కలలా సాగిపోయాయి. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ (61 బంతుల్లో 111 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) బ్యాట్ నుంచి హీరోచిత శతకం జాలువారిన వేళ... టీమిండియా వెస్టిండీస్‌ను 71 పరుగుల తేడాతో చిత్తు చేసి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. కెప్టెన్ విధ్వంసానికి ఓపెనర్ శిఖర్ ధావన్ (41 బంతుల్లో 43; 3 ఫోర్లు), కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. ఫలితంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కుర్ర పేసర్ ఖలీల్ అహ్మద్ (2/30)... ‘చైనామన్’ కుల్దీప్ యాదవ్ (2/32) ధాటికి ఛేదనలో విండీస్ ముందే కుదేలైంది. భువనేశ్వర్ (2/12), బుమ్రా (2/20) దెబ్బకు 124/9 వద్దే ఆగిపోయింది. డారెన్ బ్రావో (23) స్కోరే అత్యధికం కావడం ఆ జట్టు ప్రదర్శనను చెబుతోంది. రోహిత్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్ ఈ నెల 11న చెన్నైలో జరుగుతుంది. ధావన్ నిలిచాడు... రోహిత్ దంచాడు ఒషాన్ థామస్ బుల్లెట్ బంతులను కాచుకుంటూ ఇన్నింగ్స్‌ను ఆచితూచి ప్రారంభించారు రోహిత్, ధావన్. దీంతో తొలి 4 ఓవర్లలో 20 పరుగులే వచ్చాయి. తర్వాతి ఓవర్లో మాత్రం థామస్‌కు చుక్కలు చూపారు. 149 కి.మీ. వేగంతో అతడు వేసిన బంతిని రోహిత్ మిడాఫ్‌లో అద్భుత సిక్స్ కొట్టగా, ధావన్ రెండు ఫోర్లతో బ్యాట్‌కు పని చెప్పాడు. ఇక్కడి నుంచి స్కోరు వేగంగా ముందుకుసాగింది. పియర్, బ్రాత్‌వైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఓపెనర్లు చెలరేగారు. ఈ క్రమంలో అలెన్ బౌలింగ్‌లో రోహిత్‌కు, బ్రాత్‌వైట్ ఓవర్లో ధావన్‌కు లైఫ్‌లు లభించాయి. దీనిని సద్వినియోగం చేసుకుని 38 బంతుల్లో అర్ధశతకం అందుకున్న కెప్టెన్... అప్పటివరకు కట్టడి చేసిన అలెన్‌కు 14వ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లతో తడాఖా చూపాడు. అయితే, చివరి బంతికి పూరన్ చక్కటి క్యాచ్ పట్టడంతో ధావన్ వెనుదిరిగాడు. దీంతో 123 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసే ఉద్దేశంతో రిషభ్ పంత్ (5)ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపినా అతడు విఫలమయ్యాడు. రాహుల్ ఫటాఫట్ షాట్లతో బౌండరీలు బాదాడు. ఓ చూడముచ్చటైన స్ట్రయిట్ సిక్స్ కొట్టాడు. మరో ఎండ్‌లో పియర్ బౌలింగ్‌లో లాంగాన్‌లో సిక్స్, థర్డ్‌మ్యాన్ దిశగా ఒంటిచేత్తో ఫోర్ కొట్టిన రోహిత్ 90ల్లోకి వచ్చాడు. కానీ, కీమో పాల్ 19వ ఓవర్‌ను పొదుపుగా వేయడం, ఆఖరి బంతికి రాహుల్ సింగిల్ తీయడంతో... హిట్‌మ్యాన్ సెంచరీ పూర్తవుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. రాహుల్ 20వ ఓవర్ మొదటి బంతికి పరుగు తీసి రోహిత్‌కు స్ట్రయికింగ్ వచ్చేలా చూశాడు. అంతే, ఏమాత్రం సంకోచం లేకుండా రెండు వరుస బౌండరీలతో అతడు శతకం (58 బంతుల్లో) అందుకున్నాడు. 50 నుంచి 100కు చేరుకోవడానికి రోహిత్‌కు 20 బంతులే పట్టడం విశేషం. మరుసటి బంతికి షాట్‌ను అడ్డుకున్న బ్రాత్‌వైట్... వికెట్లకేసి విసిరే యత్నంలో ఓవర్ త్రో రూపంలో రోహిత్ ఖాతాలో నాలుగు పరుగులు జమ చేశాడు. ఆ వెంటనే రోహిత్ లాంగాఫ్‌లోకి సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్లో 20 పరుగులు రావడంతో భారత్ ఊహించిన దానికంటే ఎక్కువే స్కోరు చేయగలిగింది. విండీస్ విధి రాతంతే... భారీ లక్ష్యాన్ని అందుకునేందుకు బరిలో దిగిన విండీస్‌కు యువ పేసర్ ఖలీల్ షాకిచ్చాడు. ఓపెనర్లు షై హోప్ (6), హెట్‌మైర్ (15)ను ఔట్ చేసి ఆ జట్టుకు మ్యాచ్‌పై ఆశలు లేకుండా చేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో డారెన్ బ్రావో స్లిప్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇవ్వడంతో పోరాడే వారే లేకపోయారు. రామ్‌దిన్ (10), పూరన్ (4), పొలార్డ్ (6)లకు క్రీజులో నిలవడమే గగనమైంది. ఆ క్యాచ్‌లే పట్టి ఉంటే... ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 27 పరుగుల వద్ద ఉండగా అలెన్ రిటర్న్ క్యాచ్‌ను జారవిడిచాడు. శిఖర్ ధావన్ 28 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను మిడ్ వికెట్లో కీమో పాల్ వదిలేశాడు. ఈ రెండింటిని పట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అంతేకాక, 19వ ఓవర్లో రాహుల్ క్యాచ్‌ను పొలార్డ్ అందుకోలేకపోయాడు. ►భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ (2,203) ఘనత వహించాడు. కోహ్లి (2,102 పరుగులు) రెండో స్థానానికి పడిపోయాడు. ►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ (96) రెండో స్థానానికి చేరాడు. గేల్, గప్టిల్ (103 చొప్పున) అగ్రస్థానంలో ఉన్నారు. ►భారత జట్టుకిది వరుసగా ఏడో టి20 సిరీస్ విజయం. ఈ ఏడింటిలో నాలుగు విదేశాల్లో, మూడు స్వదేశంలో వచ్చాయి. ►అంతర్జాతీయ టి20ల్లో అత్యధికంగా నాలుగు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మున్రో (న్యూజిలాండ్–3 సెంచరీలు) రెండో స్థానంలో ఉన్నాడు. -
20–20లో 20 టీమ్స్!
క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు డ్వేన్ బ్రేవో... మైదానంలో తన ఆటతోనే కాకుండా తన నాట్యంతో, మైదానం బయట తన పాటతో కూడా అలరించే అసలు సిసలు ఆల్‌రౌండర్. టి20 క్రికెట్ స్టార్లలో ఒకడైన అతనికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రతీ జట్టూ తమకు బ్రేవోలాంటి ఆటగాడు ఉండాలని కోరుకుంటుదనడంలో సందేహం లేదు. ఎనిమిదేళ్ల క్రితమే టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అతను, బోర్డుతో గొడవల కారణంగా 2014లోనే వన్డేలకు దూరమయ్యాడు. రెండు టి20 వరల్డ్ కప్‌లు నెగ్గిన జట్టులో సభ్యుడైన బ్రేవో ఇక ఎక్కడ టి20 మ్యాచ్‌లు జరిగినా అక్కడ దర్శనమిస్తున్నాడు. తాజాగా అతను ఇంగ్లండ్ కౌంటీ మిడిలెసెక్స్ తరఫున బరిలోకి దిగాడు. దీంతో కలిపి అతను టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన జట్ల సంఖ్య సరిగ్గా 20కు చేరడం విశేషం. పది రోజుల క్రితం వరకు అతను ఆడిన జట్ల సంఖ్య 18 ఉండగా, దానికి అదనంగా మరో రెండు జట్లు వచ్చి చేరాయి. ‘ఒక్కో ఓవర్‌కు ఒక్కో టీమ్ చొప్పున నా దగ్గర వేర్వేరు 20–20 జెర్సీలు ఉన్నాయి’ అని అతను సరదాగా వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు 394 టి20లు ఆడిన బ్రేవో 5,685 పరుగులు చేయడంతో పాటు 430 వికెట్లు పడగొట్టాడు. బ్రేవో ఆడిన టి20 టీమ్‌లు 1. వెస్టిండీస్, 2. ట్రినిడాడ్ అండ్ టొబాగో, 3. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, 4.ఎసెక్స్, 5. కెంట్, 6. సర్రే, 7. మిడిలెసెక్స్, 8. మెల్బోర్న్ రెనెగేడ్స్, 9. సిడ్నీ సిక్సర్స్, 10. విక్టోరియా, 11. చెన్నై సూపర్ కింగ్స్, 12. ముంబై ఇండియన్స్, 13. గుజరాత్ లయన్స్, 14. చిట్టగాంగ్ కింగ్స్, 15. కొమిల్లా విక్టోరియన్స్, 16. ఢాకా డైనమైట్స్, 17. లాహోర్ ఖలందర్స్, 18. పెషావర్ జల్మీ, 19. డాల్ఫిన్స్, 20. విన్నిపెగ్ హాకింగ్స్. -
ఉదయం రికార్డు సాయంత్రం బద్దలు...
టాంటన్: ముక్కోణపు మహిళల టి20 క్రికెట్ టోర్నీలో ఒకే రోజు రెండు అత్యధిక స్కోర్ల రికార్డులు నమోదయ్యాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఉదయం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 216 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా (209/4; ఇంగ్లండ్‌పై) పేరిట ఉంది. కివీస్ కెప్టెన్ సుజీ బేట్స్ (66 బంతుల్లో 124 నాటౌట్; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. సోఫియా డివైన్ ( 73; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించి మహిళల టి20ల్లో ఏ వికెట్ౖకైనా అత్యుత్తమ భాగస్వామ్యం నమోదు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది. టామీ బ్యూమోంట్ సెంచరీ... న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత సాయంత్రం ఇంగ్లండ్ తో దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ జట్టులో టామీ బ్యూమోంట్ (52 బంతుల్లో 116; 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించింది. -
పాక్‌దే టి20 సిరీస్
కరాచీ: వరుసగా రెండో టి20 మ్యాచ్‌లోనూ నెగ్గిన పాకిస్తాన్ వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. రెండో టి20లో పాక్ 82 పరుగులతో నెగ్గింది. పాక్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (58 బంతుల్లో 97 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ 19.2 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. -
శ్రీలంకపై ఆరు వికెట్లతో భారత్ గెలుపు
-
లంకను పడేశారు
అటు, ఇటు భారీ స్కోర్లు లేవు... ఫోర్లు, సిక్సర్ల హోరు కనిపించలేదు... అంతా సావధానంగా సాగిపోయింది... విజయం భారత్‌కే దక్కింది... కొలంబో: నిదహాస్ ముక్కోణపు టి20 టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ బదులు తీర్చుకుంది. పద్ధతైన బౌలింగ్‌తో ముందుగా ప్రత్యర్థిని కట్టడి చేసి... తర్వాత పెద్దగా ఇబ్బంది పడకుండానే ఛేదనను పూర్తి చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (38 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి మంచి ప్రారంభాన్నిచ్చాడు. మధ్యలో తరంగ (24 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), చివర్లో షనక (19) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ (4/27) చెలరేగగా, వాషింగ్టన్ సుందర్ (2/21) మరోసారి పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అనంతరం భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 153 పరుగులు చేసింది. మనీశ్ పాండే (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (25 బంతుల్లో 39; 5 ఫోర్లు)ల సంయమనానికి సురేశ్ రైనా (15 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తోడవడంతో భారత్ మరో 9 బంతులు ఉండగానే లక్ష్య ఛేదన పూర్తి చేసింది. జల్లుల వర్షం కారణంగా మ్యాచ్ గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో రెండు జట్ల ఇన్నింగ్స్‌లో ఒక్కో ఓవర్ తగ్గించారు. భారత్ రిషభ్ పంత్‌ను పక్కనబెట్టి కేఎల్ రాహుల్‌ను ఆడించగా, లంక చండిమాల్ స్థానంలో లక్మల్‌కు చోటిచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటికి మూడు మ్యాచ్‌లాడిన భారత్ రెండు విజయాలు సాధించింది. లంక మూడింటిలో రెండు ఓడింది. మన జట్టు బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. కుశాల్ మెండిస్ ఒక్కడే... ఓపెనర్ గుణతిలక (17), గత రెండు మ్యాచ్‌ల్లో చెలరేగిన కుశాల్ పెరీరా (3) విఫలమైనా మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ శ్రీలంక ఇన్నింగ్స్‌కు ఇరుసుగా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఒకటీ, రెండు మెరుపులతో నిష్క్రమిస్తున్నా భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ చక్కటి షాట్లు కొట్టాడు. ఆడిన తొలి బంతినే సిక్స్ కొట్టాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడు ఈ టోర్నీలో రెండో అర్ధ శతకం (31 బంతుల్లో) సాధించాడు. గత అయిదు ఇన్నింగ్స్‌ల్లో మెండిస్కిది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇతడితో పాటు తరంగ క్రీజులో ఉండగా 10.4 ఓవర్లలో 96/2తో నిలిచిన లంక భారీ స్కోరు చేస్తుందనిపించింది. కానీ తరంగను బౌల్డ్ చేసి 62 పరుగుల వీరి భాగస్వామ్యాన్ని విజయ్ శంకర్ విడదీశాడు. అయితే... తర్వాతి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి దూకుడు చూపిన కెప్టెన్ తిసార పెరీరా (15)తో పాటు జీవన్ మెండిస్ (1), కుశాల్ మెండిస్‌లను 24 పరుగుల వ్యవధిలో అవుట్ చేసి టీమిండియా ప్రత్యర్థిని కట్టడి చేసింది. లోయరార్డర్లో షనక (16 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) తప్ప ఎవరూ నిలవలేదు. చివరి ఐదు ఓవర్లలో 31 పరుగులు మాత్రమే చేసిన ఆతిథ్య జట్టు 152కే పరిమితమైంది. నిలిచి గెలిపించిన పాండే, కార్తీక్ ఛేదనలో మన జట్టుకు శుభారంభం దక్కలేదు. మొదటి ఓవర్లో సిక్స్, ఫోర్‌తో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ (7 బంతుల్లో 11; 1 ఫోర్, 1 సిక్స్) మరోసారి తక్కువ పరుగులకే అవుటయ్యాడు. మంచి ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ (8) ముందుకొచ్చి ఆడబోయి మిడాన్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఓపెనర్లిద్దరూ స్పిన్నర్ అఖిల ధనంజయ బౌలింగ్‌లోనే అవుటయ్యారు. జట్టు స్కోరు 22/2తో నిలిచిన ఈ దశలో కేఎల్ రాహుల్ (18), రైనా వేగంగా పరుగులు జోడించి రన్‌రేట్ పడిపోకుండా చూశారు. వీరు 3.4 ఓవర్లలోనే 40 పరుగులు జోడించారు. ముఖ్యంగా రైనా వేగంగా ఆడాడు. అంతా సాఫీగా సాగుతుండగా ప్రదీప్ బౌలింగ్‌లో రైనా షాట్ కొట్టేందుకు యత్నించి అవుటయ్యాడు. మూడు ఓవర్ల అనంతరం రాహుల్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి విజయానికి 55 బంతుల్లో 68 పరుగులు చేయాల్సి ఉంది. ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్ విఫలమైతే కొంత క్లిష్ట పరిస్థితి ఎదురయ్యేదే. కానీ... పాండే, కార్తీక్ కుదురుకుంటూనే అడపాదడపా బౌండరీలు బాదుతూ, సింగిల్స్, డబుల్స్ తీస్తూ తడబడకుండా పని పూర్తి చేశారు. ►1 అంతర్జాతీయ టి20లో హిట్ వికెట్‌గా ఔటైన తొలి భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ -
శిఖర్ నడిపించగా...
శ్రీలంక చేతిలో పరాజయం నుంచి భారత్ వెంటనే కోలుకుంది. బౌలర్ల సమష్టి ప్రదర్శనకు తోడు శిఖర్ ధావన్ మరోసారి కదం తొక్కడంతో ముక్కోణపు టి20 టోర్నీలో బోణీ చేసింది. ఆడుతూ పాడుతూ బంగ్లాదేశ్‌పై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. టి20 తరహాలో భారీ షాట్లు, మెరుపు బ్యాటింగ్ పెద్దగా కనిపించని ఈ మ్యాచ్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం కొనసాగించగా... బంగ్లాదేశ్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఫలితంగా మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే గెలుపు రోహిత్ సేన ఖాతాలో చేరింది. కొలంబో: ముక్కోణపు టి20 టోర్నీ (నిదహాస్ ట్రోఫీ)లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. లిటన్ దాస్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), షబ్బీర్ రహమాన్ (26 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో ఉనాద్కట్ 3, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విజయ్ శంకర్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (43 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ నమోదు చేయగా, సురేశ్ రైనా (27 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) సహకారం అందించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 54 బంతుల్లో 68 పరుగులు జోడించారు. చివర్లో మనీశ్ పాండే (19 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు. తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్ సోమవారం శ్రీలంకతో తలపడుతుంది. నిస్సారంగా... భారత్‌తో గతంలో ఆడిన ఐదు టి20ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఈ మ్యాచ్‌లోనూ నాసిరకంగా కనిపించింది. టి20 స్థాయిలో ఎలాంటి మెరుపులు లేకుండా, ఒక్క ఆటగాడు కూడా ధాటిగా ఆడకుండా జట్టు ఇన్నింగ్స్ సాగింది. మధ్యలో భారత్ రెండు క్యాచ్‌లు వదిలేసినా, రనౌట్ అవకాశాలు వృథా చేసినా ఆ జట్టు వాటిని ఉపయోగించుకోలేకపోయింది. జట్టు ఇన్నింగ్స్‌లో ఏకంగా 55 డాట్ బాల్స్ ఉండటం పరిస్థితిని సూచిస్తోంది. ఉనాద్కట్ వేసిన మూడో ఓవర్లో సిక్సర్ కొట్టిన సర్కార్ (14) అదే ఓవర్లో వెనుదిరగడంతో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శార్దుల్ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన తమీమ్ (15) తర్వాతి బంతికే అవుటయ్యాడు. విజయ్ శంకర్ తొలి ఓవర్లో రైనా, సుందర్ క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన దాస్ ఆ తర్వాత మరికొన్ని పరుగులు జోడించగలిగాడు. కీపర్ కార్తీక్ క్యాచ్‌తో ముష్ఫికర్ (18) ఆట ముగిసింది. రివ్యూ ద్వారా భారత్ ఈ ఫలితం పొందగా... విజయ్ శంకర్ కెరీర్లో ఇది తొలి వికెట్ కావడం విశేషం. కెప్టెన్ మహ్ముదుల్లా (1) కూడా ప్రభావం చూపలేకపోయాడు. దాస్‌ను చహల్ ఔట్ చేయగా, చివర్లో వేగంగా ఆడే ప్రయత్నం చేసిన షబ్బీర్‌ను చక్కటి బంతితో ఉనాద్కట్ డగౌట్‌కు పంపించాడు. బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన మన బౌలర్లు కొన్ని సార్లు గతి తప్పారు. 11 వైడ్లు, 2 నోబాల్‌లు సహా మొత్తం 15 పరుగులు ఎక్స్‌ట్రాలు ఇచ్చారు. అర్ధసెంచరీ భాగస్వామ్యం... స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా టీమిండియా విజయం దిశగా దూసుకెళ్లింది. ఇన్నింగ్స్ రెండో బంతిని ఫోర్‌గా మలచి ధావన్ శుభారంభం చేయగా, రెండో ఓవర్లో రోహిత్ (17) తాను ఎదుర్కొన్న ఐదు బంతుల వ్యవధిలో మూడు బౌండరీలు బాదాడు. అయితే ముస్తఫిజుర్ బంతిని రోహిత్ వికెట్లపైకి ఆడుకోగా, కొద్ది సేపటికి రూబెల్ బౌలింగ్‌లో రిషభ్ పంత్ (7) కూడా అదే తరహాలో అవుటయ్యాడు. ఈ దశలో ధావన్, రైనా చకచకా పరుగులు సాధిస్తూ పోయారు. ధావన్ గత మ్యాచ్ జోరును కొనసాగించగా, రైనా మాత్రం తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. మెహదీ హసన్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ ద్వారా కొట్టిన సిక్సర్‌తో రైనా అంతర్జాతీయ టి20ల్లో 50 సిక్సర్లు పూర్తి చేసుకోవడం విశేషం. నజ్ముల్ బౌలింగ్‌లో ఫైన్‌లెగ్ దిశగా ఫోర్ కొట్టిన ధావన్ 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువైన దశలో తక్కువ వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగినా... దినేశ్ కార్తీక్ (2 నాటౌట్)తో కలిసి పాండే జట్టును గెలిపించారు. -
మున్రో మెరుపులు...
మౌంట్ మాంగనీ: విండీస్ బౌలర్ల భరతం పట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కొలిన్ మున్రో (53 బంతుల్లో 104; 3 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యధికంగా మూడు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో మున్రో బంగ్లాదేశ్‌పై (101), భారత్ (109 నాటౌట్)పై ఒక్కో సెంచరీ చేశాడు. మున్రో మెరుపులకు తోడు బౌలర్లు సౌతీ (3/21), బౌల్ట్ (2/29), సోధి (2/25) రాణింపుతో వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. రెండో టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇంతకుముందు టెస్టు, వన్డే సిరీస్‌లు కూడా న్యూజిలాండ్ ఖాతాలోకే వెళ్లడం విశేషం. దాంతో 1999–2000 తర్వాత తొలిసారి విండీస్ జట్టు న్యూజిలాండ్ గడ్డపై ఒక్క విజయం నమోదు చేయకుండానే వెనుదిరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు సాధించి టి20ల్లో తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది. మున్రో, గప్టిల్ (38 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 11.1 ఓవర్లలో 136 పరుగులు జోడించడం విశేషం. గప్టిల్ అవుటయ్యాక మిగతా సహచరుల సహకారంతో మున్రో కదంతొక్కాడు. 47 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్న మున్రో ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతికి అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు కివీస్ బౌలర్ల ధాటికి 16.3 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. టిమ్ సౌతీ తొలి ఓవర్లోనే విండీస్ ఓపెనర్లు క్రిస్‌గేల్, వాల్టన్ల ను డకౌట్ చేశాడు. ఫ్లెచర్ (32బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా మిగతా వారంతా విఫలమయ్యారు. ►3 అంతర్జాతీయ టి20ల్లో మున్రో సెంచరీలు. క్రిస్ గేల్, లెవిస్ (వెస్టిండీస్), మెకల్లమ్ (న్యూజిలాండ్), రోహిత్ శర్మ (భారత్) రెండేసి సాధించారు. ►1 ఈ సిరీస్ విజయంతో పాకిస్తాన్‌ను (124 పాయింట్లు) వెనక్కి నెట్టి న్యూజిలాండ్ 126 పాయింట్లతో టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ 121 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. -
బారాబతిలో 'భారీ' విజయం
-
బారాబతిలో 'భారీ' బహుమతి
సిరీస్ తొలి టెస్టులో లంక భారత్‌ను వణికించింది... తొలి వన్డేలో చిత్తుగా ఓడించింది... తొలి టి20కి వచ్చేసరికి మాత్రం చేతులెత్తేసింది. తమ 100వ మ్యాచ్‌లో కనీస పోరాటం కూడా చూపలేక తలవంచింది. సమష్టిగా రాణించిన భారత్ బారాబతి స్టేడియంలో 93 పరుగుల భారీ విజయాన్నందుకుంది. టి20ల్లో మనకిదే అతిపెద్ద గెలుపు కావడం విశేషం. రెండేళ్ల క్రితం ఇక్కడే దక్షిణాఫ్రికా చేతిలో 92 పరుగులకే ఆలౌటై అవమానం ఎదుర్కొన్న టీమిండియా... ఇప్పుడు దాదాపు అదే స్కోరు తేడాతో మరో మ్యాచ్‌లో గెలిచింది. కటక్: లంకతో తొలి టి20 మ్యాచ్‌లో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఇక్కడి బారాబతి మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 93 పరుగులతో ఘన విజయం సాధించింది. ముందు బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 61; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకానికి తోడుగా ఎంఎస్ ధోని (22 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్); మనీశ్ పాండే (18 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ చహల్ (4/23) ధాటికి లంక 87 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ అర్ధ సెంచరీ... టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు టి20లకు తగ్గ ఆరంభం లభించింది. అరంగేట్ర పేసర్ విశ్వ ఫెర్నాండో వేసిన తొలి ఓవర్లోనే 10 పరుగులు వచ్చాయి. దీంతో లంక రెండో ఓవర్‌కు స్పిన్నర్ అఖిల ధనంజయను రంగంలోకి దించింది. మరో ఎండ్‌లో మాత్రం పేసర్లను మార్చుతూ వచ్చింది. మూడో ఓవర్ చమీర వేయగా, అయిదో ఓవర్‌కు మాథ్యూస్‌కు బంతినిచ్చారు. ఎట్టకేలకు ఈ ప్రయోగం ఫలించింది. మాథ్యూస్ ఓవర్ చివరి బంతికి రోహిత్ (13 బంతుల్లో 17; 2 ఫోర్లు) మిడాన్‌లో చమీరకు చిక్కాడు. అనంతరం వచ్చిన శ్రేయస్ ఆరో ఓవర్ చివరి రెండు బంతులను బౌండరీలుగా మలిచాడు. వ్యక్తిగత స్కోరు 23 వద్ద అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చినా రాహుల్ సమీక్ష కోరి బయటపడ్డాడు. పదో ఓవర్లో అతడి అర్ధ శతకం (34 బంతుల్లో) పూర్తయింది. రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాక శ్రేయస్ (20 బంతుల్లో 24; 3 ఫోర్లు) అవుటయ్యాడు. ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగగా, సాధికారికంగా ఆడుతూ ఊపులో కనిపించిన రాహుల్... పెరీరా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఈ దశలో మనీశ్ పాండే, ధోని కుదురుకోవడానికి ప్రయత్నించడంతో పరుగుల వేగం తగ్గింది. అయితే చమీర వేసిన 17వ ఓవర్లో ధోని బౌండరీ, మరో వైపు పాండే ఫోర్, సిక్స్ బాదడంతో 19 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్లో పెరీరా కొంచెం కట్టడి చేయడంతో 9 పరుగులే వచ్చాయి. కానీ... 19వ ఓవర్లో ఒక్కసారిగా స్కోరు గేరు మారింది. ప్రదీప్ వేసిన ఈ ఓవర్లో రెండు వైడ్లు, ఒక నోబాల్ సహా 21 పరుగులు వచ్చాయి. వైడ్ యార్కర్‌ను పాండే అప్పర్ కట్‌తో సిక్స్‌గా మలచడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ చివరి బంతిని ధోని స్టాండ్స్‌లోకి కొట్టాడు. ఈ ఓవర్లోనూ 12 పరుగులు వచ్చాయి. పాండే, ధోని చివరి నాలుగు ఓవర్లలో 61 పరుగులు రాబట్టడం విశేషం. లంక పేలవంగా... 181... కనీసం 150 స్కోరున్నా ఛేదన కష్టమయ్యే పిచ్‌పై లంకకు ఎదురైన లక్ష్యమిది. దీనికి తగ్గట్లుగా ఆ జట్టుకు ఆరంభం లభించలేదు. ఏమాత్రం ప్రతిఘటన లేకుండా... గెలుపుపై ఆశావహ దృక్పథమే లేదన్నట్లుగా సాగింది వారి ఆటతీరు. ఓపెనర్లు డిక్వెలా (13), తరంగ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడు చూపినా అది ఎంతో సేపు నిలవలేదు. ఉనాద్కట్ బౌలింగ్‌లో రాహుల్‌కు డిక్వెలా క్యాచ్ ఇవ్వగా... తరంగను చహల్ బోల్తా కొట్టించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కుశాల్ పెరీరా (28 బంతుల్లో 19) బౌండరీనే కొట్టలేకపోయాడు. ఇతడితో కలిసి తరంగ నెలకొల్పిన 24 పరుగుల భాగస్వామ్యమే లంక ఇన్నింగ్స్‌లో అతి పెద్దది కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా చహల్, కుల్దీప్ (2/18) బౌలింగ్‌ను లంకేయులు ఎదుర్కోలేకపోయారు. జట్టు స్కోరు 46 వద్ద మాథ్యూస్ (1) వికెట్ కోల్పోయిన లంక ఇక కోలుకోలేకపోయింది. ఆ తర్వాత మరో 46 బంతులాడి 41 పరుగులకే ఏడు వికెట్లు చేజార్చుకుంది. వికెట్ల వెనుక ధోని... రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లతో ఆకట్టుకున్నాడు. బారాబతిలో 'భారీ' బహుమతి -
పొట్టి ఫార్మాట్లో పైచేయి కోసం
టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ తరహా ఫలితాన్ని ఆశిస్తే ఒక విజయంతోనే భారత్ సంతృప్తి చెందాల్సి వచ్చింది. వన్డేల్లో సిరీస్ విజయం సాధించినా... తొలి పోరులో చతికిలపడ్డ తీరు జట్టు సంపూర్ణ ఆధిపత్యానికి సవాల్ విసిరింది. ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో మన సత్తా ఎలాంటిది? ఇక్కడ కూడా మన కుర్రాళ్ల జోరు కొనసాగుతుందా? లేక శ్రీలంకకు మళ్లీ గెలుపు అవకాశం ఉంటుందా? నేటినుంచి జరిగే టి20 సిరీస్‌లో తమ బలాన్ని తేల్చుకునేందుకు ఇరు జట్లూ సన్నద్ధమయ్యాయి. ఎక్కువ మంది కుర్రాళ్లను పరీక్షించే అవకాశం ఉండటమే భారత్‌కు సంబంధించి ఈ సిరీస్‌లో కీలకాంశం. కటక్: వచ్చే ఏడాది వరుసగా ఉండే విదేశీ పర్యటనలకు ముందు భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై తమ ఆఖరి సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. నేడు ఇక్కడ జరిగే తొలి మ్యాచ్‌తో భారత్, శ్రీలంక మధ్య మూడు టి20ల సిరీస్ ప్రారంభమవుతుంది. టెస్టు సిరీస్‌ను 1–0తో, వన్డే సిరీస్‌ను 2–1తో గెలుచుకున్న భారత్ ఈ ఫార్మాట్లోనూ గెలవాలని పట్టుదలగా ఉండగా... వన్డేల్లో కాస్త మెరుగైన ఆటతీరు కనబర్చిన లంక అదే ఉత్సాహంతో టి20ల్లోనైనా సంచలనం సృష్టించాలని భావిస్తోంది. 2017 మొత్తంలో భారత్ మూడు ఫార్మాట్లలో ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా ఓడిపోకపోవడం విశేషం. ఎవరికి అవకాశం? కెప్టెన్ కోహ్లితో పాటు ధావన్, భువనేశ్వర్‌లకు కూడా ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. తాజాగా జరిగిన వన్డే సిరీస్‌తో పోలిస్తే ఈ టీమ్‌లో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ మళ్లీ టీమ్‌లోకి రాగా... పేస్ విభాగంలో బుమ్రాకు జోడీగా మరొక పేసర్ కోసం అనేక ప్రత్యామ్నాయాలు జట్టుకు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే అరంగేట్రం చేసిన హైదరాబాదీ సిరాజ్‌తో పాటు కేరళ పేసర్ బాసిల్ థంపి, ఏడాది క్రితం కెరీర్లో ఒకే ఒక్క టి20 ఆడిన ఉనాద్కట్ కూడా పోటీలో ఉన్నాడు. భారత బ్యాటింగ్‌కు సంబంధించి రోహిత్ శర్మ మళ్లీ భారీ మెరుపులను ప్రదర్శించేందుకు ఇది మరో అవకాశం. అతనితో పాటు రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. వన్డే సిరీస్‌లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంలో రావడం ఖాయమే. వైజాగ్ మ్యాచ్‌లో సత్తా చాటిన కుల్దీప్ను ఎదుర్కోవడం లంకకు సులభం కాదు. ఇక వన్డేల్లో బ్యాటింగ్‌లో మెప్పించలేకపోయిన పాండ్యా తన సత్తా చాటేందుకు ఇది మంచి వేదిక. బలం పెరిగిందా? పాకిస్తాన్‌తో జరిగిన తమ ఆఖరి టి20 సిరీస్‌కు దూరమైన అనేక మంది శ్రీలంక సీనియర్ ఆటగాళ్లు ఈ సిరీస్‌తో మళ్లీ జట్టులోకి వచ్చారు. దాంతో లంక జట్టులో కాస్త ఆత్మవిశ్వాసం పెరిగింది. పైగా టెస్టులతో పోలిస్తే వన్డేల్లో కాస్త మెరుగ్గా ఆడటం కూడా ఆ జట్టుకు మానసిక బలాన్ని ఇస్తోంది. అయితే భారతగడ్డపై ప్రభావం చూపించిన పేసర్ లక్మల్ మాత్రం ఈ సిరీస్‌లో లేడు. లంక బ్యాటింగ్‌కు సంబంధించి ఓపెనర్ తరంగ కీలకం కానున్నాడు. సీనియర్ మాథ్యూస్‌తో పాటు జూనియర్ జయసూర్య, కుషాల్ పెరీరా చెలరేగితే లంక భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. ఇటీవలే ఒక మ్యాచ్‌లో భారత్‌ను వణికించిన అఖిల ధనంజయ స్పిన్‌పై కూడా లంక భారీ నమ్మకం పెట్టుకుంది. మిడిలార్డర్లో డిక్వెలా దూకుడైన బ్యాటింగ్ లంకకు అదనపు బలం. అయితే అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో వరుసగా విఫలమవుతూ కూడా కెప్టెన్సీ అదృష్టం దక్కించుకోగలిగిన తిసారా పెరీరా ఒక్క మ్యాచ్‌లోనైనా తన ప్రభావం చూపిస్తాడా అనేది ఆసక్తికరం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, అయ్యర్, దినేశ్ కార్తీక్, పాండే, ధోని, పాండ్యా, కుల్దీప్, బుమ్రా, చహల్, సిరాజ్/థంపి. శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగ, కుషాల్ పెరీరా, మాథ్యూస్, డిక్వెలా, గుణరత్నే, పతిరణ, ధనంజయ, చమీరా/ఫెర్నాండో, ప్రదీప్. పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ వికెట్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం ఇక్కడ జరిగిన ఏకైక టి20లో ప్రేక్షకుల గొడవ మధ్య కొనసాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడింది. వర్ష సూచన లేదు. ►రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
కొత్త కుర్రాళ్ల లోకం!
ఓపెనర్‌గా రోహిత్ జోడీ ఎవరు? రాహుల్‌కు తుది జట్టులో చోటుంటుందా? మిడిలార్డర్లో భారాన్ని మోసేదెవరు? బుమ్రాతో కొత్త బంతి పంచుకునేదెవరు? పదునైన యార్కర్ల థంపి అరంగేట్రం చేస్తాడా? హిట్టర్ దీపక్ హుడాకు అవకాశమిస్తారా? కుర్రాడైన వాషింగ్టన్ సుందర్‌ను పరీక్షిస్తారా? శ్రీలంకతో బుధవారం ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు భారత తుది జట్టు కూర్పుపై ఇవీ సగటు క్రికెట్ అభిమాని సందేహాలు. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ భువనేశ్వర్‌కు విశ్రాంతినివ్వడంతో ఈ పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో భారత్ అన్ని విభాగాల్లో కొత్త మేళవింపులతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షి క్రీడావిభాగం: టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత జట్టు చివరిదైన టి20 సిరీస్‌నూ గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది. రోహిత్ శర్మ (68 మ్యాచ్‌లు), ధోని (83 మ్యాచ్‌లు), బుమ్రా (30 మ్యాచ్‌లు), హార్దిక్ పాండ్యా (24 మ్యాచ్‌లు) మినహా జట్టులోని మిగతా వారికి అంతర్జాతీయ టి20ల్లో అంతగా అనుభవం లేదు. శ్రీలంక ఎలాగూ ప్రమాదకర ప్రత్యర్థి కాదు కాబట్టి... సమీకరణాల ప్రకారం చూస్తే తొలిసారి టి20 జట్టులోకి ఎంపికైన వాషింగ్టన్ సుందర్, బాసిల్ థంపి, దీపక్ హుడా అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేస్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రాతో పాటు భారం పంచుకునేది ఎవరనే ఆసక్తి కలుగుతోంది. రెండో ఓపెనర్ ఎవరో? రెగ్యులర్ ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ శర్మ రావడం ఖాయం. మరి రెండో ఓపెనర్ ఎవరు? ఈ స్థానం కోసం రాహుల్, శ్రేయస్ అయ్యర్లలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. తాజా ఫామ్‌ను లెక్కలోకి తీసుకుంటే అయ్యర్‌కే ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే... తన తొలి టి20 మ్యాచ్‌లోనే విండీస్ గడ్డపై సెంచరీతో అదరగొట్టిన రాహుల్ అవకాశాలను తోసిపుచ్చలేం. వేగంగా, భారీ షాట్లు ఆడగలగడం అతడి ప్రత్యేకత. టెస్టుల్లో వచ్చినట్లు టి20ల్లో రాహుల్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక శ్రేయస్ రెండు వరుస అర్ధ శతకాలతో వన్డేల్లో సత్తా చాటాడు. ఖాళీల్లోకి బంతిని కొడుతూ కళాత్మకంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్‌ను మరింత పటిష్టం చేయాలనుకుంటే ఇతడిని ఓపెనర్‌గా తీసుకొచ్చి అక్కడ మరొకరికి చోటిచ్చే ఆలోచన చేయొచ్చు. ఇదే జరిగితే రాహుల్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇంకా కావాలంటే జట్టు మేనేజ్మెంట్ దినేశ్ కార్తీక్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించే ప్రయోగమూ చేయొచ్చు. మిడిలార్డర్ సంగతేంటి? ఇటీవల జట్టును ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశం మిడిలార్డర్. సీనియర్లు, ఫినిషర్ల అవసరం ఎక్కువగా ఉండే ఇలాంటి చోట వైఫల్యం పరాజయాలకు దారితీస్తోంది. ఒకవేళ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపి, వన్‌డౌన్‌లో అయ్యర్‌ను ఆడిస్తే మిగిలేది 4, 5, 6 స్థానాలు. వీటిలో 6వ స్థానం ధోనిదే. మిగతా రెండింటికి మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ పోటీలో ఉన్నారు. 7వ స్థానంలో హార్దిక్ పాండ్యా కుదురుకున్నాడు. ధనాధన్ మ్యాచ్‌లు కావడంతో పరిస్థితిని బట్టి పాండ్యాను ఇంకా ముందుకు పంపే ఆలోచన చేయొచ్చు. మంచి ఫీల్డర్ అయిన మనీశ్ పాండే వరుసగా విఫలమవుతున్నాడు. వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా వంటి ఆల్‌రౌండర్లతో బౌలింగ్‌ను మరింత పటిష్ఠం చేసి, వైవిధ్యం చూపాలనుకుంటే మనీశ్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇక చహల్, కుల్దీప్ ప్రధాన స్పిన్నర్లు. టి20 సిరీస్‌లోనూ వీరే బాధ్యతలు తీసుకోవచ్చు. లంక జట్టులో ఎడంచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఎక్కువ కాబట్టి వీరికితోడుగా సుందర్, హుడాలలో ఒకరిని ఆడించవచ్చు. ‘పేస్’ వైపే చూపంతా..! ప్రస్తుత సిరీస్‌లో ప్రధాన బౌలర్ బుమ్రాతో బంతిని పంచుకునే పేసర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హైదరాబాదీ సిరాజ్‌కు ఒక అవకాశం దక్కింది. మిగిలింది కేరళ స్పీడ్‌స్టర్, యార్కర్ల దిట్ట బాసిల్ థంపి, జయదేవ్ ఉనాద్కట్. ఎడంచేతి వాటంతో పాటు, కొంత అనుభవం ఉన్న ఉనాద్కట్‌కు రెండో పేసర్‌గా ప్రాధాన్యం దక్కవచ్చు. సిరీస్ ఫలితం ముందుగా తేలిపోతే... చివరి మ్యాచ్‌కు సరికొత్త మేళవింపును చూసే అవకాశముంటుంది. ►7 భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 11 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ ఏడింటిలో గెలుపొందగా... శ్రీలంక నాలుగింటిలో విజయం సాధించింది. ► 211 శ్రీలంకపై టి20ల్లో భారత్ అత్యధిక స్కోరు. 2009లో మొహాలీలో 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ టీమిండియా ఈ స్కోరు చేసింది. ► 101 శ్రీలంకపై భారత్ అత్యల్ప స్కోరు. 2016లో పుణేలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఓడింది. ► 88 ఇప్పటివరకు భారత్ ఆడిన టి20 మ్యాచ్‌లు. ఇందులో 52 గెలిచి, 33 ఓడింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా... రెండింటిలో ఫలితం రాలేదు. ► 15 స్వదేశంలో భారత్ 28 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 15 విజయాలు, 13 పరాజయాలు ఉన్నాయి. ► 6 వీరేంద్ర సెహ్వాగ్, ధోని, సురేశ్ రైనా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి తర్వాత టి20ల్లో భారత్‌కు నాయకత్వం వహించనున్న ఆరో కెప్టెన్ రోహిత్ శర్మ. -
శ్రీలంక టి20 జట్టులో మలింగకు దక్కని చోటు
వెటరన్ స్పీడ్‌స్టర్ లసిత్ మలింగను భారత్‌తో టి20ల సిరీస్‌కు ఎంపిక చేయలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడే శ్రీలంక జట్టును శుక్రవారం ప్రకటించారు. ఇందులో సీనియర్ ఆటగాళ్లు లక్మల్, తిరిమన్నెలకు విశ్రాంతి ఇవ్వగా... వీరి స్థానంలో విశ్వ ఫెర్నాండో, దాసున్ షనకలకు చోటిచ్చారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్న మలింగకు విశ్రాంతి ఇచ్చినట్లు శ్రీలంక క్రీడల మంత్రి తెలిపారు. ఈ నెల 20న తొలి టి20 కటక్‌లో, తదుపరి మ్యాచ్‌లు 22న ఇండోర్‌లో, 24న ముంబైలో జరుగుతాయి. -
మరింతగా టి20 విందు
న్యూఢిల్లీ: క్రికెటర్లేమో ‘మేం రోబోలం కాదు. మాకూ విశ్రాంతి కావాలి’ అంటున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం ఆదాయం కావాలంటోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఇక్కడ జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో కీలక నిర్ణయాలు తీసుకుంది. తక్కువ ర్యాంకు జట్లతో టీమిండియా మ్యాచ్‌లను కుదించింది. పోటీ జట్లతోనే సిరీస్‌లకు పచ్చ జెండా ఊపింది. 2019 నుంచి 2023 వరకు సంబంధించిన కొత్త ఎఫ్టీపీలో మూడు ఫార్మాట్లలో టీమిండియా ఇంటా బయటా కలిపి 158 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో భారత గడ్డపైనే 81 మ్యాచ్‌లు జరగనుండటం విశేషం. టి20ల సంఖ్యను అనూహ్యంగా పెంచారు. ఈ ఫార్మాట్లో 54 మ్యాచ్‌లను చేర్చారు.గత ఎఫ్టీపీతో పోలిస్తే 30 (స్వదేశంలో) మ్యాచ్‌లు పెరిగాయి. ఇక ఐపీఎల్లో రద్దయిన కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీపై న్యాయ పోరాటం చేసేందుకే బోర్డు సిద్ధపడింది. ఆ ఫ్రాంచైజీకి రూ. 850 కోట్ల చెల్లింపుపై కోర్టులో సవాలు చేయనున్నట్లు తెలిపింది. డోప్ టెస్టులపై ‘నాడా’ గొడుగు కిందకి వచ్చేందుకు నిరాకరించింది. అధికారికంగా టెస్టు హోదా పొందిన అఫ్ఘానిస్తాన్ జట్టుతో 2019లో భారత్ తొలి టెస్టు ఆడనుంది. మ్యాచ్‌లు ఎక్కువ... మైదానంలో తక్కువ ఇదేంటి... మ్యాచ్‌ల సంఖ్య పెరిగినప్పుడు సహజంగా ఆడే రోజులు పెరుగుతాయనుకుంటే పొరపాటే! ఎందుకంటే మ్యాచ్‌ల శాతం పెరిగినా... కేవలం పొట్టి ఫార్మాట్ మ్యాచ్‌ల వల్ల సొంతగడ్డపై భారత ఆటగాళ్లు ఎక్కువ ఆడినా మైదానంలో గడిపేది తక్కువ రోజులే! దీంతో ఒక టెస్టు కోసం ఐదు రోజుల స్టేడియంలో ఆడితే... టి20 కోసం ఒక పూట ఆడితే సరిపోతుంది. దీనిపై బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి మాట్లాడుతూ ‘ముందనుకున్న ప్రతిపాదిత ఎఫ్టీపీలో భారత్‌లో 51 మ్యాచ్‌లుంటే ఇప్పుడు ఈ సంఖ్య 81కి పెరిగింది. అయితే 60 శాతం మ్యాచ్‌లు పెరిగినా... 20 శాతం తక్కువగా మైదానంలో శ్రమిస్తారు’ అని అన్నారు. బ్రాడ్‌కాస్టింగ్‌తో మరో భారీ డీల్ ప్రస్తుత ఎఫ్టీపీలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (2021), వన్డే ప్రపంచకప్ (2023) మ్యాచ్‌లు భాగం కావని చౌదరి చెప్పారు. ఈ రెండు మెగా ఈవెంట్లకు భారతే ఆతిథ్యమివ్వనుంది. ఇవి కాకుండానే ఆడే 158 మ్యాచ్‌లతో బోర్డుకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అసాధారణ మొత్తం రానుంది. స్టార్ స్పోర్ట్స్‌తో ప్రస్తుత ఒప్పందం 2018 మార్చిలో ముగియనుంది. వచ్చే ఏడాది వేలంలో మరో రూ. 10 వేల కోట్లు రావొచ్చని బోర్డు అంచనా వేస్తోంది. -
నేనేంటో... వారికి తెలుసు
కొందరిని మినహాయిస్తే చాలా మంది క్రికెటర్లు 38 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. ఆ వయసులో ఒకసారి జట్టులో స్థానం కోల్పోయాక వారి మదిలో పునరాగమనం చేయాలనే ఆలోచన రావడం అరుదుగా జరుగుతుంది. భారత వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రా ఇందుకు విరుద్ధం. ఐపీఎల్ ద్వారా యువ క్రికెటర్లు దూసు కొస్తున్న వేళ... పొట్టి ఫార్మాట్లో ఈ ఢిల్లీ పేసర్ తన ప్రత్యేకత నిలబెట్టుకున్నాడు. యువ ఆటగాళ్లతో పోటీపడుతూ 38 ఏళ్ల వయసులో మరోసారి జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఈ వారంలో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికైనందుకు ఆనందం వ్యక్తం చేసిన నెహ్రా... తన నైపుణ్యంపై సెలెక్టర్లకు, కెప్టెన్ కోహ్లికి నమ్మకం ఉన్నందునే మరోసారి అవకాశం వచ్చిందని అన్నాడు. న్యూఢిల్లీ: అనూహ్యంగా వెటరన్ సీమర్ ఆశిష్ నెహ్రా భారత టి20 జట్టుకు ఎంపికయ్యాడు. లేటు వయసులో లేటెస్ట్గా మళ్లీ పునరాగమనం చేస్తున్న ఈ ఢిల్లీ స్పీడ్‌స్టర్... కెరీర్ ఆసాంతం విమర్శలెప్పుడూ పట్టించుకోలేదని కొత్తగా ఇప్పుడు ఏమంటారోననే బెంగలేదని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాకు ఆమడదూరముండే ఆశిష్... అజహరుద్దీన్ హయంలో వచ్చాడంటే ఆశ్చర్య పోవాల్సిందే. 38 ఏళ్ల వయసులో కూడా యువకులాడే టి20 సత్తా తనలో ఉందంటున్నాడు. టెస్టులు, వన్డేల నుంచి ఎప్పుడో తప్పుకున్న ఈ సీనియర్ సీమర్ ఐపీఎల్ అయినా అంతర్జాతీయ క్రికెట్లో అయినా కేవలం పొట్టి ఫార్మాట్‌కే అందుబాటులో ఉంటున్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌లోని ఆసక్తికర విషయాల్ని ఇలా పంచుకున్నాడు. సెలక్టర్లకు తెలుసు... సారథికీ తెలుసు.. నేను తిరిగి భారత్‌కు ఆడితే ఎవరు నొచ్చుకుంటారో మరి! అయినా నేనెప్పుడు విమర్శలను, విమర్శకులను పట్టించుకోను. నా సత్తా ఏంటో డ్రెస్సింగ్ రూమ్‌కు తెలుసు. సారథి కోహ్లికి బాగా తెలుసు. సెలక్టర్లకు ఇంకా బాగా తెలుసు. జట్టులో ఉంటే నా వంతు నేను కష్టపడతాను. ఇక ఈ వయసులో పెద్ద గా లక్ష్యాలేవీ పెట్టుకోను. మూడు మ్యాచ్‌లకు నన్ను ఎంపిక చేశారు. ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడతాను. నేను ఆడితే వార్త. బాగా ఆడకపోతే అది ఇంకా పెద్ద వార్త (వైసే భి నెహ్రా అచ్చా కరేగా తో భి న్యూస్ హై. అచ్ఛా నహీ కరేగా తో వో ఔర్ భి బడీ న్యూస్ హై). నాకు తెలియదు... ట్విట్టర్‌కు, ఫేస్‌బుక్‌కు నేను దూరం. నిజానికి ట్విట్టర్లో నా గురించి ఎమరు ఏమనుకుంటున్నారో నిజంగా నాకు తెలియదు. ట్రెయినింగ్, ఫిట్నెస్ ఇలా రోజువారీ పనుల్లోనే నిమగ్నమవుతాను. అందుకే ఈవయసులో కూడా స్థిరంగా గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్ వేయగల సత్తా వుంది. సోషల్ మీడియాలో కనిపించని వారికి ఇప్పుడు జట్టులో కనిపించడం అనూహ్యమే కదా! జహీర్ సూపర్ బౌలర్... నా సహచరుడు జహీర్ ఖాన్ కెరీర్ ఆసాంతం టెస్టులు ఆడాడు. అద్భుత బౌలింగ్ నైపుణ్యం అతని సొంతం. ఐదు రోజుల మ్యాచ్ ఆసాంతం 80 శాతం సామర్థ్యంతో బౌలింగ్ చేయగలడు. నా వరకైతే నేను కేవలం టి20లకే పరిమితమయ్యా. నా బౌలింగ్ యాక్షన్ కూడా అసాధారణమైంది కాదు. అలాగే 80 శాతం సత్తా కూడా నాలో లేదు. కేవలం 24 బంతులు (టి20లో గరిష్టంగా 4 ఓవర్లు) మాత్రం చక్కగా వేయగలను. బహుశా ఓ సాధారణ బౌలిం గ్ యాక్షన్ కలిగివుండటం వల్లేనేమో ఈ వయసు లోనూ తేలిగ్గా బౌలింగ్ చేయగలుగుతున్నా. అజ్జూ భాయ్ హయంలో వచ్చా... చాలా మందికి తెలుసో, తెలియదో కానీ నేను 1999లో అజహరుద్దీన్ కెప్టెన్సీలో జట్టులోకి వచ్చాను. బహుశా నేను, హర్భజన్ సింగ్ తప్ప ఆయన హయాంలో జాతీయ జట్టులోకి వచ్చిన క్రికెటర్ ఇప్పటికీ ఆడుతున్నట్టు కనిపించడంలేదు. వచ్చే ఫిబ్రవరి నాటికి నా అంతర్జాతీయ కెరీర్‌కు 19 ఏళ్లు పూర్తవుతాయి. ఈ దశలో నేను డబ్బుకోసం ఆడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నాకు 12 సార్లు సర్జరీలు అయ్యాయి. అన్ని శస్త్రచికిత్సలయ్యాక కూడా కోలుకొని క్రికెట్ ఆడటం కూడా అరుదేనేమో? అయితే నా ఉదయం దినచర్య ప్రాక్టీస్‌తో మొదలవుతుంది. ఫిట్నెస్తో కొనసాగుతుంది. విరామం లేకుండా ఇలా చేస్తున్నందుకేనేమో ఇంకా నేను క్రికెట్ ఉత్సాహంగా ఆడగలుగుతున్నాను. -
మున్రో విధ్వసం
ఆక్లాండ్: దుమ్మురేపే బ్యాటింగ్‌తో చెలరేగిన న్యూజిలాండ్ జట్టు... శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేసింది. కొలిన్ మున్రో (14 బంతుల్లో 50 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు), మార్టిన్ గప్టిల్ (25 బంతుల్లో 63; 6 ఫోర్లు, 5 సిక్సర్లు)ల సంచలన ఆటతీరుతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కివీస్ 9 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈడెన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. మ్యాథ్యూస్ (49 బంతుల్లో 81 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దిల్షాన్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు)లు మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఇలియట్ 4, సాంట్నెర్, మిల్నే చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ను లంక బౌలర్లు నిలువరించలేకపోయారు. దీంతో ఆతిథ్య జట్టు కేవలం 10 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 147 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు గప్టిల్, విలియమ్సన్ (21 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడుతూ 40 బంతుల్లోనే తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత మున్రో సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీ లైన్ దాటించేందుకు ప్రయత్నించాడు. ఫలితంగా 14 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. టి20ల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ కాగా, కివీస్ తరఫున వేగవంతమైన అర్ధసెంచరీ. అంతకుముందు గప్టిల్ కూడా 19 బంతుల్లోనే 50 పరుగులు చేసినా.. మున్రో జోరు ముందు తన రికార్డు (కివీస్ తరఫున ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ) 20 నిమిషాల్లోనే మరుగున పడిపోయింది. మున్రోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
టి-20 క్రికెట్లో 20 నిమిషాల్లోనే 2 రికార్డులు
ఆక్లాండ్: న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో వీరబాదుడు బాదేశారు. 20 నిమిషాల్లో రెండు రికార్డులను బద్దలు కొట్టారు. టి-20 క్రికెట్లో న్యూజిలాండ్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా గుప్టిల్ రికార్డు నెలకొల్పగా, మున్రో కాసేపట్లోనే దీన్ని బ్రేక్ చేశాడు. శ్రీలంక, న్యూజిలాండ్ రెండో టి-20 ఈ రికార్డులకు వేదికైంది. శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో టి-20లో కివీస్ 9 వికెట్లతో ఘనవిజయం సాధించి.. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. మాథ్యూస్ (49 బంతుల్లో 81) మెరుపు అజేయ హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 10 ఓవర్లలో వికెట్ నష్టానికి సాధించింది. గుప్టిల్ (25 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 63), మున్రో (14 బంతుల్లో ఫోర్, 7 సిక్సర్లతో 50 నాటౌట్) రికార్డు హాఫ్ సెంచరీలు చేశారు. గుప్టిల్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ తరపున పొట్టి క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అయితే కాసేపటి తర్వాత మున్రో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడంతో గుప్టిల్ రికార్డు బద్దలైంది. అంతేగాక, ప్రపంచ టి-20 క్రికెట్లో రెండో వేగవంతమై హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా మున్రో మరో రికార్డు నమోదు చేశాడు. భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (12 బంతుల్లో) రికార్డు ఉంది.