టి-20 క్రికెట్లో 20 నిమిషాల్లోనే 2 రికార్డులు
ఆక్లాండ్: న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో వీరబాదుడు బాదేశారు. 20 నిమిషాల్లో రెండు రికార్డులను బద్దలు కొట్టారు. టి-20 క్రికెట్లో న్యూజిలాండ్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మన్గా గుప్టిల్ రికార్డు నెలకొల్పగా, మున్రో కాసేపట్లోనే దీన్ని బ్రేక్ చేశాడు. శ్రీలంక, న్యూజిలాండ్ రెండో టి-20 ఈ రికార్డులకు వేదికైంది.
శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో టి-20లో కివీస్ 9 వికెట్లతో ఘనవిజయం సాధించి.. సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. మాథ్యూస్ (49 బంతుల్లో 81) మెరుపు అజేయ హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 10 ఓవర్లలో వికెట్ నష్టానికి సాధించింది. గుప్టిల్ (25 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 63), మున్రో (14 బంతుల్లో ఫోర్, 7 సిక్సర్లతో 50 నాటౌట్) రికార్డు హాఫ్ సెంచరీలు చేశారు. గుప్టిల్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ తరపున పొట్టి క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అయితే కాసేపటి తర్వాత మున్రో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడంతో గుప్టిల్ రికార్డు బద్దలైంది. అంతేగాక, ప్రపంచ టి-20 క్రికెట్లో రెండో వేగవంతమై హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా మున్రో మరో రికార్డు నమోదు చేశాడు. భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (12 బంతుల్లో) రికార్డు ఉంది.