మున్రో విధ్వసం
ఆక్లాండ్: దుమ్మురేపే బ్యాటింగ్‌తో చెలరేగిన న్యూజిలాండ్ జట్టు... శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేసింది. కొలిన్ మున్రో (14 బంతుల్లో 50 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు), మార్టిన్ గప్టిల్ (25 బంతుల్లో 63; 6 ఫోర్లు, 5 సిక్సర్లు)ల సంచలన ఆటతీరుతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కివీస్ 9 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈడెన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. మ్యాథ్యూస్ (49 బంతుల్లో 81 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దిల్షాన్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు)లు మినహా మిగతా వారు విఫలమయ్యారు.
ఇలియట్ 4, సాంట్నెర్, మిల్నే చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ను లంక బౌలర్లు నిలువరించలేకపోయారు. దీంతో ఆతిథ్య జట్టు కేవలం 10 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 147 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు గప్టిల్, విలియమ్సన్ (21 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడుతూ 40 బంతుల్లోనే తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత మున్రో సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీ లైన్ దాటించేందుకు ప్రయత్నించాడు.
ఫలితంగా 14 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. టి20ల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ కాగా, కివీస్ తరఫున వేగవంతమైన అర్ధసెంచరీ. అంతకుముందు గప్టిల్ కూడా 19 బంతుల్లోనే 50 పరుగులు చేసినా.. మున్రో జోరు ముందు తన రికార్డు (కివీస్ తరఫున ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ) 20 నిమిషాల్లోనే మరుగున పడిపోయింది. మున్రోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.