మౌంట్ మాంగనీ: విండీస్ బౌలర్ల భరతం పట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కొలిన్ మున్రో (53 బంతుల్లో 104; 3 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధికంగా మూడు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో మున్రో బంగ్లాదేశ్‌పై (101), భారత్ (109 నాటౌట్)పై ఒక్కో సెంచరీ చేశాడు. మున్రో మెరుపులకు తోడు బౌలర్లు సౌతీ (3/21), బౌల్ట్ (2/29), సోధి (2/25) రాణింపుతో వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. రెండో టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇంతకుముందు టెస్టు, వన్డే సిరీస్‌లు కూడా న్యూజిలాండ్ ఖాతాలోకే వెళ్లడం విశేషం. దాంతో 1999–2000 తర్వాత తొలిసారి విండీస్ జట్టు న్యూజిలాండ్ గడ్డపై ఒక్క విజయం నమోదు చేయకుండానే వెనుదిరిగింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు సాధించి టి20ల్లో తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది. మున్రో, గప్టిల్ (38 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 11.1 ఓవర్లలో 136 పరుగులు జోడించడం విశేషం. గప్టిల్ అవుటయ్యాక మిగతా సహచరుల సహకారంతో మున్రో కదంతొక్కాడు. 47 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్న మున్రో ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతికి అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు కివీస్ బౌలర్ల ధాటికి 16.3 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. టిమ్ సౌతీ తొలి ఓవర్‌లోనే విండీస్ ఓపెనర్లు క్రిస్‌గేల్, వాల్టన్‌ల ను డకౌట్ చేశాడు. ఫ్లెచర్ (32బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా మిగతా వారంతా విఫలమయ్యారు.
►3 అంతర్జాతీయ టి20ల్లో మున్రో సెంచరీలు. క్రిస్ గేల్, లెవిస్ (వెస్టిండీస్), మెకల్లమ్ (న్యూజిలాండ్), రోహిత్ శర్మ (భారత్) రెండేసి సాధించారు.
►1 ఈ సిరీస్ విజయంతో పాకిస్తాన్‌ను (124 పాయింట్లు) వెనక్కి నెట్టి న్యూజిలాండ్ 126 పాయింట్లతో టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ 121 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment