న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్-2024 సెమీస్ ఫేవరెట్లలో ఒకటైన కివీస్ టీమ్ కనీసం గ్రూప్ దశ దాటకుండానే.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.
గ్రూప్ ‘సి’లో భాగంగా గురువారం జరిగిన పోరులో వెస్టిండీస్ చేతిలో 13 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడిపోయింది. ఫలితంగా ‘హ్యాట్రిక్’ విజయాలతో కరేబియన్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో ‘సూపర్–8’ దశకు అర్హత సాధించింది. ఈ గెలుపుతో విండీస్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ట్రినిడాడ్ వేదికగా టాస్ నెగ్గిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో బ్రాండన్ కింగ్ (9), చార్లెస్ (0), నికోలస్ పూరన్ (12 బంతుల్లో 17; 3 ఫోర్లు), చేజ్ (0), కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (1) ఇలా ఐదో వరుస బ్యాటర్‌దాకా అంతా చేతులెత్తేశారు.
దీంతో 30 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన ఆతిథ్య జట్టును.. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షెర్‌ఫెన్ రూథర్‌ఫర్డ్ (39 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరోచిత మెరుపులతో నిలబెట్టాడు. 33 బంతుల్లో ఫిఫ్టీతో అతను తన కెరీర్ బెస్ట్ స్కోరు సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లు బౌల్ట్, సౌతీ, ఫెర్గూసన్ తలా 2 వికెట్లు తీశారు.
అనంతరం కష్టమైన లక్ష్యం కాకపోయినా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. గ్లెన్ ఫిలిప్స్ (33 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా, ఫిన్ అలెన్ (23 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), సాన్‌ట్నర్ (12 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.
విండీస్ పేసర్ అల్జారి జోసెఫ్ (4/19), స్పిన్నర్ గుడకేశ్ మోతి (3/25) కివీస్‌ను దెబ్బ తీశారు. ఇక గ్రూప్-సిలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన కివీస్ ఇంకా పాయింట్ల ఖాతానే తెరువలేదు. మరోవైపు.. ఇదే గ్రూపులో ఉన్న అఫ్గనిస్తాన్ పపువా న్యూగినియాను ఓడించి సూపర్-8 బెర్తును ఖరారు చేసుకుంది.
ఫలితంగా 2021 రన్నరప్ న్యూజిలాండ్ ఈసారి లీగ్ దశ నుంచే ఇంటిముఖం పట్టడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మిచెల్ మెక్లెన్‌గన్ కివీస్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కరేబియన్ దీవుల్లో అద్భుతమైన రికార్డు ఉన్న కొలిన్ మున్రోను వెనక్కి పిలిచి.. టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
‘‘కరేబియన్ గడ్డపై టీ20లలో 2146 పరుగులు సాధించిన ఆటగాడిని వాళ్లు పక్కనపెట్టారు. అతడు ఇప్పుడు న్యూజిలాండ్‌లో ఏం చేస్తున్నాడు? అని మాత్రమే మిమ్మల్ని ప్రశ్నించగలను.
నాకు తెలిసి 2014లో బంగ్లాదేశ్‌లోని వరల్డ్‌కప్ తర్వాత ఇదే అత్యంత ప్రపంచకప్ టోర్నీ’’ అని మిచెల్ మెక్లెన్‌గన్ కివీస్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈఎస్‌పీక్రిక్‌ఇన్పోతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
కాగా 37 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్ కొలిన్ మున్రో.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో గత కొన్నేళ్లుగా ఆడుతున్నాడు. ట్రింబాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు మొత్తంగా 79 మ్యాచ్‌లలో కలిపి 2353 పరుగులు సాధించాడు.
బిగ్‌బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ సూపర్ లీగ్‌లోనూ పరుగుల వరద పారించాడు. న్యూజిలాండ్ తరఫున మొత్తం 57 వన్డేలు, 65 టీ20లు ఆడిన అతడు ఆయా ఫార్మాట్లలో 1271, 1724 పరుగులు చేశాడు. ఆడిన ఒకే ఒక టెస్టులో 15 రన్స్ సాధించాడు.
ఈ క్రమంలో 2020లో కివీస్ తరఫున ఆఖరి టీ20 ఆడిన మున్రో గత నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా ఈ మెగా టోర్నీకి అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment