మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శార్దుల్ ఠాకూర్ ,పాండే
అటు, ఇటు భారీ స్కోర్లు లేవు...
ఫోర్లు, సిక్సర్ల హోరు కనిపించలేదు...
అంతా సావధానంగా సాగిపోయింది...
విజయం భారత్‌కే దక్కింది...
కొలంబో: నిదహాస్ ముక్కోణపు టి20 టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ బదులు తీర్చుకుంది. పద్ధతైన బౌలింగ్‌తో ముందుగా ప్రత్యర్థిని కట్టడి చేసి... తర్వాత పెద్దగా ఇబ్బంది పడకుండానే ఛేదనను పూర్తి చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (38 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి మంచి ప్రారంభాన్నిచ్చాడు. మధ్యలో తరంగ (24 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), చివర్లో షనక (19) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ (4/27) చెలరేగగా, వాషింగ్టన్ సుందర్ (2/21) మరోసారి పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అనంతరం భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 153 పరుగులు చేసింది. మనీశ్ పాండే (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (25 బంతుల్లో 39; 5 ఫోర్లు)ల సంయమనానికి సురేశ్ రైనా (15 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తోడవడంతో భారత్ మరో 9 బంతులు ఉండగానే లక్ష్య ఛేదన పూర్తి చేసింది. జల్లుల వర్షం కారణంగా మ్యాచ్ గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో రెండు జట్ల ఇన్నింగ్స్‌లో ఒక్కో ఓవర్ తగ్గించారు. భారత్ రిషభ్ పంత్‌ను పక్కనబెట్టి కేఎల్ రాహుల్‌ను ఆడించగా, లంక చండిమాల్ స్థానంలో లక్మల్‌కు చోటిచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటికి మూడు మ్యాచ్‌లాడిన భారత్ రెండు విజయాలు సాధించింది. లంక మూడింటిలో రెండు ఓడింది. మన జట్టు బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.
కుశాల్ మెండిస్ ఒక్కడే...
ఓపెనర్ గుణతిలక (17), గత రెండు మ్యాచ్‌ల్లో చెలరేగిన కుశాల్ పెరీరా (3) విఫలమైనా మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ శ్రీలంక ఇన్నింగ్స్‌కు ఇరుసుగా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఒకటీ, రెండు మెరుపులతో నిష్క్రమిస్తున్నా భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ చక్కటి షాట్లు కొట్టాడు. ఆడిన తొలి బంతినే సిక్స్ కొట్టాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడు ఈ టోర్నీలో రెండో అర్ధ శతకం (31 బంతుల్లో) సాధించాడు. గత అయిదు ఇన్నింగ్స్‌ల్లో మెండిస్‌కిది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇతడితో పాటు తరంగ క్రీజులో ఉండగా 10.4 ఓవర్లలో 96/2తో నిలిచిన లంక భారీ స్కోరు చేస్తుందనిపించింది. కానీ తరంగను బౌల్డ్ చేసి 62 పరుగుల వీరి భాగస్వామ్యాన్ని విజయ్ శంకర్ విడదీశాడు. అయితే... తర్వాతి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి దూకుడు చూపిన కెప్టెన్ తిసార పెరీరా (15)తో పాటు జీవన్ మెండిస్ (1), కుశాల్ మెండిస్‌లను 24 పరుగుల వ్యవధిలో అవుట్ చేసి టీమిండియా ప్రత్యర్థిని కట్టడి చేసింది. లోయరార్డర్‌లో షనక (16 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) తప్ప ఎవరూ నిలవలేదు. చివరి ఐదు ఓవర్లలో 31 పరుగులు మాత్రమే చేసిన ఆతిథ్య జట్టు 152కే పరిమితమైంది.
నిలిచి గెలిపించిన పాండే, కార్తీక్
ఛేదనలో మన జట్టుకు శుభారంభం దక్కలేదు. మొదటి ఓవర్లో సిక్స్, ఫోర్‌తో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ (7 బంతుల్లో 11; 1 ఫోర్, 1 సిక్స్) మరోసారి తక్కువ పరుగులకే అవుటయ్యాడు. మంచి ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ (8) ముందుకొచ్చి ఆడబోయి మిడాన్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఓపెనర్లిద్దరూ స్పిన్నర్ అఖిల ధనంజయ బౌలింగ్‌లోనే అవుటయ్యారు. జట్టు స్కోరు 22/2తో నిలిచిన ఈ దశలో కేఎల్ రాహుల్ (18), రైనా వేగంగా పరుగులు జోడించి రన్‌రేట్ పడిపోకుండా చూశారు. వీరు 3.4 ఓవర్లలోనే 40 పరుగులు జోడించారు. ముఖ్యంగా రైనా వేగంగా ఆడాడు. అంతా సాఫీగా సాగుతుండగా ప్రదీప్ బౌలింగ్‌లో రైనా షాట్ కొట్టేందుకు యత్నించి అవుటయ్యాడు. మూడు ఓవర్ల అనంతరం రాహుల్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి విజయానికి 55 బంతుల్లో 68 పరుగులు చేయాల్సి ఉంది. ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్ విఫలమైతే కొంత క్లిష్ట పరిస్థితి ఎదురయ్యేదే. కానీ... పాండే, కార్తీక్ కుదురుకుంటూనే అడపాదడపా బౌండరీలు బాదుతూ, సింగిల్స్, డబుల్స్ తీస్తూ తడబడకుండా పని పూర్తి చేశారు.
►1 అంతర్జాతీయ టి20లో హిట్ వికెట్‌గా ఔటైన తొలి భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment